పన్ను ఆదా కోసం బీమా పాలసీ తీసుకుంటున్నారా?

ఒక్క రూపాయి కూడా పన్ను కట్టకూడదన్న పట్టుదలతో ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సిన పాలసీలను ఎంచుకుంటారు

Published : 16 Dec 2020 19:41 IST

జీవిత బీమా పాలసీలు…పన్ను రాయితీలకు విడదీయరాని సంబంధం ఉంది. మనలో ఎక్కువ మంది ప్రీమియం ద్వారా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సి కింద మినహాయింపు పొందవచ్చుననీ, గడువు తీరాక వచ్చే సొమ్ముపై కూడా పన్ను ఉండదని తెలుసుకునే పాలసీలు తీసుకుంటారు. పాలసీ తీసుకునే సమయంలో ఆలోచనలు రాయితీ చుట్టూనే తిరుగుతాయి. మన ఆర్థిక పరిస్థితేంటి? మన అవసరాలకు పాలసీ తగిందేనా? చివరి వరకూ ప్రీమియం కట్టగలమా? ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా? అన్న విషయాలు విస్మరిస్తారు. ఒక్క రూపాయి కూడా పన్ను కట్టకూడదన్న పట్టుదలతో ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సిన పాలసీలను ఎంచుకుంటారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే వచ్చే కొత్త పాలసీలు కూడా ఆకర్షిస్తుంటాయి. ఫలితం… అండగా నిలవాల్సిన పాలసీ ఆర్థికంగా భారంగా మారుతుంది.

  • పన్ను మినహాయింపు అన్నది బీమా కల్పించే అదనపు ప్రయోజనం మాత్రమే.
  • అతి తక్కువ ప్రీమియంతో సాధ్యమైనంత ఎక్కువ బీమా రక్షణ కల్పించే టెర్మ్‌ పాలసీలు ఎంపిక చేసుకోవటమై తెలివైన పని.

పెట్టుబడి కాదు…

దండిగా చేతిలో సొమ్ము ఆడుతోందని చెప్పి పాలసీ తీసుకోవటం మరో పొరపాటు. జీవిత బీమా అంటే దీర్ఘకాలానికి సంబంధించింది. కనీసం, ఇరవై నుంచి పాతికేళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు సమృద్ధిగా డబ్బు ఉందని చెప్పి భారీ ప్రీమియంతో కూడిన పాలసీ ఎంచుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తవచ్చు. అర్థంతరంగా పాలసీలకు నీళ్లొదులుకుంటున్న వారిలో ఎక్కువ శాతం మంది ఇలాంటి పొరపాటు చేసిన వారే. సొమ్ముంది కదా అని సింగిల్‌ ప్రీమియం పాలసీ తీసుకుంటే గడువు తీరిన తర్వాత వచ్చే పన్ను రాయితీలు దూరం అవుతాయి.

  • అనుకోకుండా వచ్చిన సొమ్మును మదుపు చేయటానికి బీమా సాధనం కాదు.
  • ఇందుకు స్వల్పకాలిక ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, లిక్విడ్‌ఫండ్స్‌ ఉన్నాయి.

మొహమాటానికి పోతే…

ఏ ఇద్దరు మనుషుల అవసరాలు, ఆర్థిక పరిస్థితులు ఒకేలా ఉండవు. కాబట్టి, స్నేహితుడో లేక బంధువో ఎంచుకున్న పాలసీని అనుకరించకూడదు.

  • పాలసీ ఎంపికకు మీ అవసరాలు, ఆర్థిక స్థితిగతులే ప్రాతిపదిక కావాలి.
  • పాలసీల విషయంలో అనుకరణలు, మొహమాటాలు ఎంత మాత్రం పనికిరావు.

వైద్యంతోపాటుగా…

పన్ను ప్రణాళికలో… సెక్షన్‌ 80సి గురించే చాలామంది ఆలోచిస్తారు. ఇది కాకుండా సెక్షన్‌ 80డీ కింద కూడా పన్ను మినహాయింపు పొందవచ్చు. ఆరోగ్య బీమా పాలసీలకు చెల్లించిన మొత్తాన్ని ఇందులో చూపించుకోవచ్చు.

రోజురోజుకీ పెరిగిపోతున్న వైద్య ఖర్చులను తట్టుకోవడానికి ఆరోగ్య బీమా పాలసీలను తీసుకోవడం మినహా ప్రత్యామ్నాయం లేదు. ఈ పాలసీల కోసం చెల్లించిన ప్రీమియానికి సెక్షన్‌ 80డి కింద పన్ను వర్తించే ఆదాయంలో నుంచి తగ్గించుకోవచ్చు. అందుకే ఆరోగ్య బీమా పాలసీ అటు అనారోగ్యంలో ఆర్థికంగా అండగా… ఇటు పన్ను తగ్గించుకునేందుకు అనువైన పథకంగానూ ఎంచుకోవచ్చు.

సాధారణ వ్యక్తులు ఆరోగ్య బీమా పాలసీకి చెల్లించి మొత్తంలో రూ. 25వేల వరకు క్లయిం చేసుకోవచ్చు. సీనియర్‌ సిటిజన్లకు ఈ మొత్తం రూ. 50వేలు. తల్లిదండ్రుల కోసం తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీలకు చెల్లించిన ప్రీమియానికి కూడా రూ. 25వేల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. (తల్లిదండ్రులు సీనియర్‌ సిటిజన్లు అయితే… రూ. 50వేల వరకు). కొన్ని సంస్థల్లో బృంద ఆరోగ్య బీమా అందిస్తుంటారు. దీనికి చెల్లించిన ప్రీమియం కూడా ఈ సెక్షన్‌ కింద మినహాయింపు పొందవచ్చు.

ఆదాయానికా… లాభం లేదు!

జీవిత బీమా పాలసీల ద్వారా వచ్చే రాబడి సగటున ఏడాదికి 3.5 శాతం నుంచి 4 శాతానికి మించదు. ద్రవ్యోల్బణంతో పోల్చి చూస్తే ఇది నష్టం కూడా. అంటే, పాలసీల ద్వారా మీకు వచ్చిందేమీ లేకపోగా ఏటా కొంత రాబడిని వదులుకోవాల్సి వస్తుంది. అందుకే బీమాని పెట్టుబడి సాధనంగా పరిగణించటం తప్పు. దీర్ఘకాలం ఆగితే రెండంకెల స్థాయికి ఢోకా లేకుండా రాబడి అందించే మ్యూచువల్‌ ఫండ్‌ మార్గం ఉండనే ఉంది.

ఆపద సమయంలో ఆర్థికంగా అండగా నిలిచే టెర్మ్‌ పాలసీని తీసుకోండి. టెర్మ్‌ పాలసీకి ప్రీమియం తక్కువగానే ఉంటుంది. ఇలా మిగుల్చుకున్న సొమ్మును ప్రతినెలా క్రమం తప్పకుండా పీపీఎఫ్ లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టండి. పాలసీ అమల్లో ఉన్నంత కాలం ఇలా చేస్తూ వెళితే మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని