బంగారంలో పెట్టుబ‌డులు పెడుతున్నారా? ఇది చదవండి!

బంగారంలో మ‌దుపు చేయాల‌నుకునే వారు తెలుసుకోవాల్సిన అంశాలు చూద్దాం  

Published : 18 Dec 2020 14:15 IST

అధిక రాబ‌డుల కోసం బంగారంలో మ‌దుపు చేసేందుకు పెట్టుబ‌డిదారులు మొగ్గు చూపుతుంటారు. భౌతిక రూపంలో ఉన్న బంగారం వ‌ల్ల న‌గ‌దు ల‌భ్య‌త అధికంగా ఉంటే, డీమ్యాట్ రూపంలోని పెట్టుబ‌డులైన బంగారం ఈటీఎఫ్‌లు, సార్వ‌భౌమ ప‌సిడి ప‌థ‌కాలు స్థిర‌మైన ధ‌ర‌ను క‌ల్పిస్తాయ‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. బంగారాన్ని త‌ర‌చుగా కొనాల‌నేకునేవారు స‌రైన స‌మ‌యం, త‌మ పెట్టుబ‌డుల‌పై ప‌న్ను ప్ర‌యోజ‌నాల కోసం త‌ర‌చి చూస్తుంటారు. సెంటిమెంట్ కార‌ణంగా బంగారాన్ని కొనుగోలు చేయ‌వ‌ద్ద‌ని నిపుణులు స‌ల‌హా ఇస్తుంటారు. బంగారంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఉన్న మూడు మార్గాల గురించి తెలుసుకుందాం. అవి భౌతిక రూపంలోని బంగారం, బంగారం ఈటీఎఫ్‌లు, బంగారం బాండ్లు. ఈ మూడు మార్గాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. భౌతిక రూపంలోని బంగారాన్ని న‌గ‌లు, నాణేలు, కడ్డీల రూపంలో కొనుగోలు చేయ‌వ‌చ్చు. భౌతిక‌ బంగారం ధ‌ర‌లో ప్ర‌స్తుత‌మున్న బులియ‌న్ ధ‌ర‌ల‌తో పాటు త‌యారీ ఖ‌ర్చులు ఉంటాయి. మీరు కోరిన రూపంలో బంగారం త‌యారు చేసినందుకు గానూ ఆభర‌ణాల త‌యారీ సంస్థ‌లు విధించే ఖ‌ర్చుల‌నే త‌యారీ ఛార్జీలు అంటారు. ఇవి ఒక్కో న‌గ‌ల దుకాణంలో ఒక్కో ర‌కంగా ఉంటాయి.

బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ల‌(ఈటీఎఫ్‌)లో మ‌దుపు చేయ‌డం, మ్యూచువ‌ల్ ఫండ్ల మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో స‌మీక‌రించిన నిధుల‌ను కేవ‌లం బంగారం పైనే మ‌దుపు చేస్తారు. ఇంకా చెప్పాలంటే బంగారం ఈటీఎఫ్‌లు, భౌతిక బంగారం ధ‌ర ఆధారం ట్రేడ‌వుతుంటాయి. అయితే ఇవి డీమ్యాట్ రూపంలో ఉంటాయి. బంగారం ఈటీఎఫ్‌లలో మ‌దుపు చేసేందుకు డీమ్యాట్ ఖాతా త‌ప్ప‌నిస‌రి. భౌతిక బంగారంతో పోలిస్తే ఈటీఎఫ్‌ల‌లో ధ‌ర‌లు నిల‌క‌డ‌గా ఉంటాయి.

భౌతిక బంగారంలో కాకుండా బంగారం ఈటీఎఫ్‌లు, బాండ్ల‌లో మ‌దుపు చేయ‌వ‌చ్చు. సార్వ‌భౌమ ప‌సిడి బాండ్ల‌లో ప్ర‌తీ ఆరు నెల‌ల‌కోసారి వ‌డ్డీ చెల్లిస్తారు. ప్ర‌స్తుతం వీటిపై 2.5 శాతం వ‌డ్డీ . బంగారం బాండ్లు లేదా సార్వ‌భౌమ‌ ప‌సిడి బాండ్ల‌ను అధీకృత బ్యాంకులు, బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌లు, స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా కొనుగోలు చేయ‌వ‌చ్చు.

బంగారంలో మ‌దుపు చేసే ముందు ఈ ఐదు విష‌యాల‌ను తెలుసుకోండి:

భౌతిక రూపంలోని బంగారం, డీమ్యాట్ బంగారంలో ఏది మంచిది?

భౌతిక రూపంలో బంగారం కొనుగోలు చేయాల‌నుకునే వారు త‌యారీ ఖ‌ర్చులు త‌క్కువ‌గా ఉన్న వాటిపై దృష్టి సారించాలి. పండుగలు, శుభ‌కార్యాల స‌మ‌యంలో ఆభ‌ర‌ణాల సంస్థ‌లు అందించే ఆఫ‌ర్ల గురించి తెలుసుకోవ‌డం మంచిద‌ని నిపుణుల స‌ల‌హా. వివిధ ఉత్ప‌త్తులపై త‌యారీ ఖ‌ర్చులు ఎలా ఉన్నాయ‌నే విష‌యాల‌ను ఆభ‌ర‌ణాల సంస్థ‌ల‌తో చ‌ర్చిస్తుండాలి. భౌతికంగా లేదా డీమ్యాట్ రూపంలో బంగారం కొనాల‌నుకునే వారు, బంగారం ధ‌ర‌ల‌లో ఏర్ప‌డే ఒడుదొడుకుల‌ను త‌ట్టుకునేందుకు పెట్టుబ‌డుల‌లో కొంత మొత్తాన్ని స్టాక్ లేదా ఫ్యూచ‌ర్స్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం మంచిద‌ని ఆర్థిక నిపుణులొక‌రు త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

బంగారంలో త‌ప్ప‌కుండా మ‌దుపు చేయాలా?

పెట్టుబ‌డుల‌కు భ‌ద్ర‌త‌నిచ్చే ఆర్థిక సాధ‌నాల‌లో బంగారం ముఖ్య‌మైంది. ఇందువ‌ల్లే బంగారానికి, ఈక్విటీ మార్కెట్ల‌కు విలోమ సంబంధం ఉంద‌ని గ‌త చ‌రిత్ర అనుభ‌వాలు చాటుతున్నాయి. సెంటిమెంట్ ప్రాతిప‌దిక‌న కాకుండా, ఆర్థిక ల‌క్ష్యం, పోర్టుఫోలియో ప్రాతిప‌దిక‌న పెట్టుబ‌డులు ఉండాలి. దేశీయంగా, అంత‌ర్జాతీయంగా త‌లెత్తే ఉద్రిక్త‌త‌ల నుంచి భ‌ద్ర‌త క‌ల్పించేందుకు బంగారం ఉప‌క‌రిస్తుంద‌ని ఆర్థిక నిపుణులొక‌రు తెలియజేశారు.

బంగారం కొనేందుకు ఇది స‌రైన స‌మ‌య‌మేనా

మార్కెట్ ఒడుదొడుకులు, ద్ర‌వ్యోల్బ‌ణం, అనిశ్చితి నుంచి హెడ్జింగ్ చేసుకునేందుకు బంగారం ఉప‌క‌రిస్తుంద‌ని చాలా మంది నిపుణుల అభిప్రాయం. ఐదేళ్ల నుంచి ఫ్లాట్‌గా ఉన్న బంగారం ధ‌ర‌ల్లో అంత‌ర్జాతీయ అనిశ్చితుల కార‌ణంగా ఒక్క‌సారిగా క‌ద‌లికి వ‌చ్చింది. మ‌ళ్లీ ద్ర‌వ్యోల్బ‌ణ ప‌రిస్థితుల కార‌ణంగా వ‌చ్చే ఐదేళ్ల వ‌రకు బంగారంలో పెట్టుబ‌డులు పెట్ట‌డం మంచిదేన‌ని ఒక ప్రైవేట్ సంస్థ‌కు చెందిన ఆర్థిక నిపుణ‌డు వ్యాఖ్యానించారు.

వీటిపై ప‌న్ను అమ‌లు ఎలా?

బంగారాన్ని భౌతిక రూపంలో లేదా ఈటీఎఫ్‌ల రూపంలో కొనుగోలు చేసినా ప‌న్ను భారం ఒకేలా ఉంటుంది. అయితే సార్వ‌భౌమ ప‌సిడి బాండ్ల‌లో మాత్రం స్వ‌ల్పంగా తేడా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

బంగారంలో పెట్టుబ‌డులపై ప‌న్నుల అమ‌లు:

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని