ఇప్ప‌టికీ ప‌న్ను వాప‌సు రాలేదా? ఇదీ ఒక కార‌ణం కావ‌చ్చు

బ్యాంకు ఖాతాకు సంబంధించిన స‌మాచారంలో త‌ప్పులు ఉండ‌డం వ‌ల్ల చాలా వ‌ర‌కు రీఫండ్‌లు విఫ‌ల‌మ‌వుతున్నాయి

Published : 18 Dec 2020 17:32 IST

అసెస్మెంటు సంవ‌త్స‌రం 2019-20 గానూ స‌రైన స‌మ‌యంలో రిట‌ర్నులు ఫైల్ చేసిన‌ప్ప‌టికీ ప‌న్ను వాప‌సు ఇప్ప‌టికీ రాలేదా? ఇందుకు వివిధ కార‌ణాలు ఉంటాయి. ఏదేమైనా ఇంద‌కు ప్ర‌ధాన కార‌ణం చాలా మంది త‌మ బ్యాంకు ఖాతా వివ‌రాలు త‌ప్పుగా ఇవ్వ‌డం.

ఇంత‌కు ముందు ఆదాయ‌పు ప‌న్ను రీఫండ్‌ల‌ను చెక్ ద్వారా గానీ బ్యాంకు ఖాతాకు నేరుగా క్రెడిట్ చేయ‌డం ద్వారా గానీ చెల్లించేవారు. అయితే ప్ర‌స్తుతం రీఫండ్ల‌ను నేరుగా ప‌న్ను చెల్లింపుదారుల‌ బ్యాంక్ ఖాతాకు మాత్ర‌మే క్రెడిట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ అసెస్మంటు సంవ‌త్స‌రం నుంచి బ్యాంకు ఖాతాల‌ను ముందుగానే ధృవీక‌రించ‌డంతో పాటు ప‌న్ను చెల్లింపు దారుల శాశ్వ‌త ఖాతా సంఖ్య‌(పాన్‌)తో అనుసంధానించాలి.

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు ఫైల్ చేసిన‌ప్పుడు, చెల్లించాల్సి ప‌న్ను కంటే ఎక్కువ మొత్తంలో ఆదాయ‌పు శాఖ‌కు ప‌న్ను చెల్లించినా లేదా ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో డిడ‌క్ట్ చేయ‌వ‌ల‌సిన దానికంటే ఎక్కువ మూలం వ‌ద్ద ప‌న్ను(టీడీఎస్‌) త‌గ్గించిన మీరు ఆదాయ‌పు ప‌న్ను వాప‌సు పొందేందుకు అర్హులు. అధికంగా చెల్లించిన మొత్తాన్ని ఆదాయ‌పు ప‌న్ను శాఖ తిరిగిచెల్లిస్తుంది. అయితే సంబంధిత ఆర్థిక సంవ‌త్స‌రానికి దాఖ‌లు చేసే ప‌న్ను రిట‌ర్నుల‌లో రిఫండ్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ప‌న్ను స్టేట‌స్ ట్రాక్ చేయండి:
ఒక‌వేళ మీరు ఇప్ప‌టి వ‌ర‌కు రీఫండ్ పొంద‌క‌పోతే, రిట‌ర్నుల ప్రాసెసింగ్, క్లెయిమ్ రిఫండ్ స్టేట‌స్‌ను చెక్ చేసుకోవాలి. ఐదు నుంచి ఆరు సంవ‌త్స‌రాల క్రితం, రీఫండ్ స్టేట‌స్‌ను తెలుసుకునేందుకు అసెసింగ్ అధికారిని సంప్ర‌దించ‌వ‌ల‌సి వ‌చ్చేది. అయితే ప్ర‌స్తుతం ఆన్‌లైన్ ద్వారా ప‌న్నుచెల్లింపుదారులు త‌మ రీఫండ్ స్టేట‌స్‌ను స్వ‌యంగా తెలుసుకోవ‌చ్చ‌ని చార్టర్డ్ అకౌంటెన్సీ సంస్థ అశోక్ మహేశ్వరి అండ్‌ అసోసియేట్స్ ఎల్ఎల్‌పీ భాగస్వామి అమిత్ మహేశ్వరి తెలిపారు. కొన్ని సంద‌ర్భాల‌లో త‌ప్ప, ప్ర‌స్తుతం చాలామందికి రిట‌ర్ను ఫైల్ చేసిన కొద్ది నెల‌ల‌లోనే వాప‌సు వ‌స్తుంద‌ని మ‌హేశ్వ‌రి అన్నారు.

www.incometaxindia.gov.in లేదా www.tin-nsdl.com వెబ్‌సైట్‌ల‌ ద్వారా మీ ఆదాయ‌పు ప‌న్ను రీఫండ్ స్టేట‌స్‌ను తెలుసుకోవ‌చ్చు. వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిన త‌రువాత ప‌న్ను రీఫండ్ ట్యాబ్‌పై క్లిక్ చేసి, మీ పాన్ నెంబ‌రు, మీరు ఏ అసెస్మెంటు సంవ‌త్స‌రానికి రీఫండ్ చెక్ చేస్తున్నారు… వంటి వివ‌రాల‌ను ఎంట‌ర్ చేయాలి. వాప‌సు అప్ప‌టికే ప్రాసెస్ చేస్తే, చెల్లింపుల స్థితి, రిఫ‌రెన్స్ నెంబ‌రు, స్టేట‌స్‌, రిఫండ్ చేసే తీదీ వంటి వివ‌రాలు పాప్ అప్ విండోలో క‌నిపిస్తాయి.

ఏదైనా కార‌ణం వ‌ల్ల రీఫండ్ జారీ చేయ‌క‌పోయినా లేదా తిర‌స్క‌రించినా దానికి సంబంధించిన స‌మాచారం కూడా తెలుపుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు, రీఫండ్ అన్‌పేయిడ్ అని మేసేజ్ వ‌స్తే, మీ ఆదాయ ప‌న్ను శాఖ‌కు అందించిన బ్యాంకు ఖాతా వివ‌రాలు(ఖాతా నెంబ‌రు, ఐఎఫ్ఎస్ కోడ్‌) త‌ప్పుగా స‌బ్మిట్ చేసి ఉండచ్చు. అందువ‌ల్ల ఐటీఆర్‌కు మీరు ఇచ్చిన బ్యాంకు ఖాతా వివ‌రాల‌ను స‌రిచూసుకోవాలి.

బ్యాంకు ఖాతా సంబంధిత స‌మాచారం:
ఆదాయ‌పు ప‌న్ను నియ‌మాల ప్ర‌కారం, ప‌న్ను చెల్లింపు దారునికి సంబంధించి, రిట‌ర్నులు ఫైల్ చేసే ముందు సంవ‌త్స‌రం వ‌ర‌కు భార‌త‌దేశంలో ఉన్న‌ అన్ని పొదుపు, క‌రెంట్ ఖాతా వివ‌రాల‌ను, రిట‌ర్నులు ఫైల్ చేసే స‌మ‌యంలో ఇవ్వాల్సి ఉంటుంది. మూడు సంవ‌త్స‌రాలుగా ఆప‌రేట్ చేయ‌ని ఖాతాల వివ‌రాలు అందించ‌డం త‌ప్ప‌నిస‌రి కాదు. అన్ని బ్యాంకు ఖాతాల ద్వారా వ‌చ్చే ఆదాయాన్ని రిట‌ర్నులలో చూపించి బ్యాంకు వివ‌రాలు ఇవ్వ‌క పోయిన‌ప్ప‌టికీ పెనాల్టీ ప‌డ‌ద‌ని మ‌హేశ్వ‌రి తెలిపారు.

ఒక‌వేళ మీకు ఒక‌టి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే, రీఫండ్ వ‌స్తుందా… లేదా… అనే దానితో సంబంధం లేకుండా ఏ ఖాతాకు రీఫండ్ క్రెడిట్ చేయాలో త‌ప్ప‌నిస‌రిగా తెలియ‌జేయాలి. బ్యాంకు పేరు, ఖాతా సంఖ్య‌, 11 అంకెల ఐఎఫ్ఎస్ కోడ్ త‌దిత‌ర వివ‌రాల‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఒక‌వేళ మీకు విదేశీ బ్యాంకులో ఖాతా ఉంటే అంత‌ర్జాతీయ బ్యాంకు ఖాతా సంఖ్య‌ను కూడా తెలియ‌జేయాల్సి ఉంటుంది.

అసెస్మెంటు సంవ‌త్స‌రం 2019-20కి గానూ ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు ఫైల్ చేసిన ప‌న్ను చెల్లింపుదారులు రీఫండ్ కోసం ఎంచుకున్న బ్యాంకుఖాతా ఇ-ఫైల్లింగ్ ఖాతాతో ధృవీక‌రించ‌రా… బ్యాంకు ఖాతా పాన్ కార్డుతో అనుసంధాన‌మైందో లేదో నిర్థారించుకోవాలి. పైన తెలిపిన వివ‌రాలు అందించ‌క‌పోతే రీఫండ్ క్రెడిట్ కాదు.

ఏవిధంగా స‌రిచేసుకోవాలి:
ఒక‌వేళ బ్యాంకు ఖాతా వివ‌రాలు త‌ప్పుగా న‌మోదు చేసిఉంటే, రీఫండ్‌లు తిరిగి జారీ చేసేంద‌కు అభ్య‌ర్ధించ‌వ‌చ్చు. అయితే అంత‌కంటే ముందు స‌రైన బ్యాంకు ఖాతా వివ‌రాల‌ను అందించాల్సి ఉంటుంది. స‌రైన బ్యాంకు వివ‌రాలు అందించ‌క‌పోవ‌డం వ‌ల్ల రీఫండ్ విఫ‌ల‌మైన‌ప్పుడు మాత్ర‌మే బ్యాంకు వివ‌రాలు అప్‌డేట్ చేయాల‌ని గుర్తించుకోవాలి.

ఒక‌వేళ మీరు మీ బ్యాంకు ఖాతా వివ‌రాల‌ను స‌వ‌రించాల‌నుకుంటే, ఆన్‌లైన్‌లో ద్వారా చేసుకోవ‌చ్చు. ముందుగా www.incometaxindiaefiling.gov.in లోకి మీ యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌ల‌ను ఉప‌యోగించి లాగిన్ అవ్వాలి. త‌రువాత "మై అక్కౌంట్‌"ని క్లిక్ చేసి రీఫండ్ అభ్య‌ర్థ‌న చేయాలి. ఇక్క‌డ కొత్త బ్యాంకు ఖాతా నెంబ‌రు లేదా ఇప్ప‌టికే ఇచ్చిన బ్యాంకు ఖాతా నెంబ‌రును స‌రిచేసి అభ్య‌ర్థ‌న‌ను స‌బ్మిట్ చేయాలి.

మీ పాన్ నెంబ‌రు ఖాతాతో అనుసంధానిచారో లేదో స‌రిచూసుకోవాలి. ఒక‌వేళ లింక్ చేయ‌క‌పోతే పాన్ కాపీతో మీ బ్యాంకు బ్రాంచిని సంప్ర‌దించాల్సి ఉంటుంది. ఒక‌సారి మీ బ్యాంకు ఖాతాను పాన్‌తో అనుసంధానించిన త‌రువాత ఇ-ఫైల్లింగ్ అక్కౌంట్స్‌లో ప్రీ-వ్యాలిడేట్ చేయాలి. ఇందుకోసం బ్యాంకు పేరు, ఖాతా సంఖ్య‌, ఐఎఫ్‌ఎస్‌ కోడ్‌, మొబైల్ నెంబ‌రు, ఈమెయిల్ ఐడీ త‌దిత‌ర వివ‌రాల‌ను తెలియ‌జేయాలి. ఒక‌సారి మీ బ్యాంకు వివ‌రాలు అప్‌డేట్ చేసి రిఫండ్స్ అభ్య‌ర్థ‌న‌ను పూర్తి చేసిన కొద్ది రోజుల‌కే రీఫండ్ మొత్తం మీ ఖాతాకు క్రెడిట్ అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని