పన్ను ఆదాకు.. ఈక్విటీ మార్గం..

ఆర్థిక ప్రణాళికలో పన్ను ఆదా ఎంతో కీలకం. దీనికోసం అందుబాటులో అనేక పథకాలున్నప్పటికీ.. స్టాక్‌ మార్కెట్లో మదుపు చేయడం ద్వారా పన్ను భారం తగ్గించుకునే వెసులుబాటునిచ్చేవి ఈఎల్‌ఎస్‌ఎస్‌లు (ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు). ఆర్థిక లక్ష్యాల సాధనకూ ఇవి తోడ్పడతాయి.

Updated : 21 Jan 2022 12:16 IST

ర్థిక ప్రణాళికలో పన్ను ఆదా ఎంతో కీలకం. దీనికోసం అందుబాటులో అనేక పథకాలున్నప్పటికీ.. స్టాక్‌ మార్కెట్లో మదుపు చేయడం ద్వారా పన్ను భారం తగ్గించుకునే వెసులుబాటునిచ్చేవి ఈఎల్‌ఎస్‌ఎస్‌లు (ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు). ఆర్థిక లక్ష్యాల సాధనకూ ఇవి తోడ్పడతాయి.

పన్ను ప్రణాళిక ఆర్థిక సంవత్సరం తొలి నెల నుంచే ప్రారభం కావాలి. అయినప్పటికీ చాలామంది జనవరి తర్వాతే దీని గురించి ఆలోచిస్తుంటారు. ఈ సమయంలోనూ పూర్తి అవగాహనతో సరైన పథకాన్ని ఎంచుకుంటే.. దీర్ఘకాలిక ప్రయోజనం పొందడం కష్టమేమీ కాదు.

ఇతర పథకాలతో పోలిస్తే ఉన్న విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఈఎల్‌ఎస్‌ఎస్‌లు మదుపరుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80సీ ప్రకారం ఇందులో పెట్టిన పెట్టుబడికి పన్ను మినహాయింపు లభిస్తుంది. రూ.1,50,000 పరిమితికి లోబడి అనేది గుర్తుంచుకోవాలి. ఇవి సాధారణ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలను పోలి ఉన్నప్పటికీ.. మదుపును కనీసం మూడేళ్లపాటు కొనసాగించాలనే నిబంధన ఉండటం, పెట్టిన పెట్టుబడికి పన్ను మినహాయింపు లభించడం ప్రత్యేకతలుగా చెప్పొచ్చు. ఇందులోనూ గ్రోత్‌, డివిడెండ్‌, డివిడెండ్‌ రీ ఇన్వెస్ట్‌మెంట్‌ ఐచ్ఛికాలున్నాయి.

ఒకేసారి మదుపు చేసేందుకూ, క్రమానుగత విధానంలో పెట్టుబడి పెట్టేందుకూ ఈ పథకాలు అవకాశాన్నిస్తాయి. ఈఎల్‌ఎస్‌ఎస్‌లు ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పెట్టుబడుల్లో మదుపు చేస్తాయి. ఈక్విటీల్లో ఏడాదికి మించి పెట్టుబడులను కొనసాగించినప్పుడు.. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్షకు మించి రాబడి వస్తే.. ఆ పై మొత్తానికి 10 శాతం పన్ను చెల్లించాలి. ఈఎల్‌ఎస్‌ఎస్‌లకూ ఇది వర్తిస్తుంది.

తక్కువ లాకిన్‌: మూలధనం వృద్ధి చెందాలంటే సరైన పెట్టుబడులను ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. సాధారణంగా ఇతర పన్ను ఆదా పథకాలను కొనసాగించాల్సిన వ్యవధి (లాకిన్‌ పీరియడ్‌) అయిదేళ్లుగా ఉంది. వీటితో పోలిస్తే ఈఎల్‌ఎస్‌ఎస్‌ల లాకిన్‌ మూడేళ్లు మాత్రమే. కాబట్టి, మదుపరులకు పన్ను మినహాయింపు కోసం తక్కువ వ్యవధితో ఉన్న పథకాలు కావాలంటే ఇవే మార్గం. సిప్‌ (క్రమానుగత పెట్టుబడి విధానం) చేసేందుకూ ఇవి అనుకూలంగా ఉంటాయి. మూడేళ్ల తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. లేదా కొనసాగొచ్చు. మూడేళ్ల వ్యవధి ముగిసిన తర్వాత మొదటి నెల సిప్‌ మొత్తాన్ని వెనక్కి తీసుకొని, మళ్లీ పెట్టుబడి పెట్టొచ్చు. ఇలా ఈ పెట్టుబడి చక్రాన్ని కొనసాగించే వీలుంది.

వృద్ధికి అవకాశం.. ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల మేనేజర్లు దీర్ఘకాలిక దృష్టితో రంగాలను, షేర్లను ఎంచుకొని మదుపు చేస్తారు. దీంతో వీటిల్లో స్థిరమైన రాబడులను అందుకునే అవకాశాలు అధికం. మూడేళ్ల లాకిన్‌ ఉండటం వల్ల పెట్టుబడులు పెరిగేందుకు వీలవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని