Maruti: మారుతీ నుంచి 6 కొత్త మోడళ్లు

కొవిడ్‌-19 ప్రభావం నుంచి వేగంగా కోలుకున్న రంగాల్లో ఆటోమొబైల్‌ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. కారు ‘విలాసం’ నుంచి ‘తప్పనిసరి అవసరం’గా మారింది. దీంతో ప్రారంభస్థాయి చిన్న కార్ల మొదలు, సెడాన్లు, ఎస్‌యూవీలూ అధికంగా

Updated : 09 Jan 2022 09:20 IST

 ఇదేబాటలో ఇతర సంస్థలూః విక్రయాలు పెంచుకునేందుకు వ్యూహాలు
 రూ.10- 20లక్షల విభాగంపై దృష్టి

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌-19 ప్రభావం నుంచి వేగంగా కోలుకున్న రంగాల్లో ఆటోమొబైల్‌ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. కారు ‘విలాసం’ నుంచి ‘తప్పనిసరి అవసరం’గా మారింది. దీంతో ప్రారంభస్థాయి చిన్న కార్ల మొదలు, సెడాన్లు, ఎస్‌యూవీలూ అధికంగా అమ్ముడయ్యాయి. గిరాకీ భారీగా ఉన్నా.. చిప్‌సెట్ల కొరత వల్ల వాహన సంస్థలు తగినన్ని సరఫరా చేయలేకపోయాయి. దీంతో 2021లో కొనుగోలుదార్లు తమకు నచ్చిన మోడళ్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా కొత్త ఉత్పరివర్తనాలు కొనసాగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత ప్రయాణానికి మొగ్గుచూపే వారి సంఖ్య అధికమవుతుందని, అందువల్ల ఈ ఏడాదిలోనూ కార్ల కొనుగోళ్లు అధికంగా ఉంటాయని వాహన సంస్థలు అంచనా వేస్తున్నాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకునేందుకు కొత్త మోడళ్లను తీసుకు రావడంపై దిగ్గజ సంస్థ మారుతీతో పాటు ఇతర సంస్థలూ దృష్టి సారించాయి. 

ఆకట్టుకునేలా..

ఇప్పటికే ఉన్న మోడళ్లను ఆధునికీకరించడంతో పాటు అధునాతన సదుపాయాలు పొందుపరచడానికి కృషి చేస్తున్నాయి. కొన్ని మోడళ్లను తీర్చిదిద్ది, కొత్త పేర్లతో విడుదల చేసేందుకూ సిద్ధమవుతున్నాయి. ఆధునిక హంగులు, ఆకట్టుకునే రూపు, వినియోగదారుల అవసరాలు.. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని, కార్ల సంస్థలు కొత్త మోడళ్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

* మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) 2022లో కనీసం ఆరు కొత్త మోడళ్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దేశీయంగా ఏడాదిలో విక్రయమయ్యే మొత్తం కార్లలో దాదాపు సగం మేర ఈ సంస్థవే. కొన్ని మోడళ్లను ఫేస్‌లిఫ్ట్‌ చేయడంతో పాటు, మూడు ఎస్‌యూవీలు, మరో మూడు చిన్నకార్లను తీసుకొచ్చే వ్యూహంతో ఎంఎస్‌ఐ ఉంది. బాలెనో, ఎర్టిగా, వ్యాగన్‌ ఆర్‌, అల్టో 800 మోడళ్లలో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.

* స్కోడా ఆటో ఇండియా ఈ ఏడాదిలో ఆరు మోడళ్లను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇందులో కొన్ని కొత్తవి కాగా.. మరికొన్ని మోడళ్ల వేరియంట్‌ మార్పులతో రానున్నాయి. ఒకటి రెండు రోజుల్లో అభివృద్ధి చేసిన ‘కొడియాక్‌’ రానుంది. రాపిడ్‌ స్థానంలో స్లావియాను తీసుకొస్తోంది. మార్చి నాటికి ఇది అందుబాటలోకి రానుంది. కుషాక్‌లోనూ కొత్త వేరియంట్‌ను తీసుకురానుంది.

* కియా ఇప్పటికే కారెన్స్‌ను తీసుకొచ్చింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా తన స్కార్పియోకు కొన్ని మార్పులు చేసి, తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది.

విద్యుత్‌ వాహనాలే కీలకం

టాటా, హ్యుందాయ్‌తోపాటు బీఎండబ్ల్యూ, ఆడి లాంటి ప్రీమియం కార్లలోనూ ఈ ఏడాది విద్యుత్‌ మోడళ్లు సందడి చేయనున్నాయి. పెట్రో ధరలు పెరగడానికి తోడు పర్యావరణ హిత విద్యుత్‌ వాహనాల (ఈవీ)పై ప్రజలు ఆసక్తి చూపుతున్నందున, వాహన సంస్థలూ ఈ విభాగంపై దృష్టి సారిస్తున్నాయి. టాటా నుంచి నెక్సాన్‌ ఈవీ ఇప్పటికే ఉండగా.. మరో మోడల్‌లోనూ ఈవీని తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉందని సమాచారం.

ఆధునిక సదుపాయాలు జతచేస్తూ

రూ.10 లక్షల లోపు విలువైన చిన్నకార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నా, రెండేళ్ల నుంచి రూ.10-20 లక్షల లోపు కార్లకూ గిరాకీ పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగానే కార్ల తయారీ సంస్థలు ఈ ధరల శ్రేణిలో  అధునాతన సదుపాయాలతో కొత్త మోడళ్లను ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కుటుంబ అవసరాలు తీర్చేలా వీటిని రూపొందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని