CIBIL Score: ‘గూగుల్‌ పే’లో ఉచితంగా సిబిల్‌ స్కోర్‌.. ఎలా చెక్‌ చేసుకోవాలంటే?

CIBIL Score on Gpay: నగదు బదిలీ, వివిధ రకాల చెల్లింపులకు వినియోగించే గూగుల్‌ పేలో సిబిల్‌ స్కోర్‌ను సైతం పొందొచ్చు.

Updated : 12 Apr 2023 16:16 IST

CIBIL Score on Gpay | ఇంటర్నెట్‌ డెస్క్‌: సిబిల్‌ స్కోరు నివేదిక చూసి, ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితి గురించి ఒక అంచనాకు రావచ్చు. బ్యాంకులూ కొత్తగా అప్పు ఇచ్చేటప్పుడు దీన్ని నిశితంగా పరిశీలిస్తాయి. సిబిల్‌ స్కోరు (CIBIL Score) 750 పాయింట్లకు మించి ఉందంటే మీ ఆర్థిక క్రమశిక్షణ బాగుందని అర్థం. చాలా వెబ్‌సైట్లు, యాప్‌లు సిబిల్‌ స్కోర్‌ను ఉచితంగా అందిస్తున్నాయి. అందులో ఒకటి చాలా మంది తరచుగా ఉపయోగించే గూగుల్‌ పే.

సిబిల్‌ స్కోర్‌ అంటే..

CIBIL అంటే ‘క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(ఇండియా) లిమిటెడ్’. ఇంకా సులువుగా చెప్పాలంటే రుణ చరిత్రలను అందించే సంస్థ. ఇది ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (RBI) అధీకృత క్రెడిట్ ఏజెన్సీ. సిబిల్.. వ్యక్తులకు చెందిన రుణాలు, క్రెడిట్ కార్డుల చెల్లింపు వ్యవహారాలు వంటి సమాచారాన్ని సేకరించి నివేదికలు తయారుచేస్తుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రతినెలా రుణ గ్రహీతల సమాచారాన్ని సిబిల్‌కు అందజేస్తాయి. ఈ సమాచారాన్ని ఉపయోగించి సిబిల్ రుణ చరిత్ర నివేదిక, సిబిల్‌ స్కోర్‌ (CIBIL Score)ను తయారుచేస్తుంది. సిబిల్‌ స్కోర్‌ 300- 900 మధ్య ఉంటుంది. 600 కంటే తక్కువ ఉంటే ‘బ్యాడ్‌ సిబిల్‌ స్కోర్‌’గా పరిగణిస్తారు. అలాంటి వారికి రుణం ఇవ్వడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం అని అర్థం. 750 కంటే ఎక్కువ ఉంటే మెరుగైన స్కోర్‌గా పరిగణిస్తారు.

గూగుల్‌ పేలో సిబిల్‌ స్కోర్‌ ఇలా..

భారత్‌లో కోట్లాది మంది గూగుల్‌ పే (Google pay) యాప్‌ను వివిధ రకాల చెల్లింపుల కోసం వాడుతున్నారు. తొలుత దీంట్లో కేవలం నగదు బదిలీకి మాత్రమే అవకాశం ఉండేది. దశలవారీగా అనేక సేవలు అందుబాటులోకి వచ్చాయి. బిల్లు చెల్లింపులు, రీఛార్జ్‌లకూ దీన్ని విస్తరించారు. ఇటీవల సిబిల్‌ స్కోర్‌ను కూడా ఉచితంగా అందించడం ప్రారంభించారు.

కొత్త యూజర్లు..

 • గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి గూగుల్‌ పే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
 • ఫోన్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసి గూగుల్‌ ఖాతాలోకి లాగిన్‌ కావాలి.
 • తెరపై కనిపించే ఇన్‌స్ట్రక్షన్స్‌ను ఫాలో అవుతూ బ్యాంక్‌ ఖాతాను గూగుల్‌ పే ఖాతాకు అనుసంధానం చేయాలి.
 • డెబిట్‌/క్రెడిట్‌ కార్డును కూడా జత చేయొచ్చు.
 • మీ గూగుల్‌ పే ఖాతా యాక్టివేట్‌ అవుతుంది. తర్వాత సిబిల్‌ స్కోర్‌ను చెక్‌ చేసుకోవడానికి కింద ఇచ్చిన స్టెప్స్‌ను ఫాలో అవ్వాలి.

ఇప్పటికే ఉన్న యూజర్లు..

 • గూగుల్‌ పే యాప్‌ ఓపెన్‌ చేయాలి
 • ‘మేనేజ్‌ యువర్‌ మనీ’ సెక్షన్‌ వచ్చే వరకు స్క్రోల్‌ చేయాలి.
 • అక్కడ కనిపించే ‘చెక్‌ యువర్‌ సిబిల్‌ స్కోర్‌ ఫర్‌ ఫ్రీ’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
 • తర్వాత ‘‘A good CIBIL score gets you better interest rates on loans. Wonder if you will have a good score?’’ అనే ప్రశ్న కనిపిస్తుంది. దాని కింద ‘‘Yes, Not sure, No’’ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.
 • మూడింటిలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకొని ‘‘Let’s check’’ ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి.
 • పాన్‌ కార్డ్‌పై ఉన్న విధంగా ఫస్ట్‌ నేమ్‌, లాస్ట్‌ నేమ్‌ ఎంటర్‌ చేయాలి.
 • కంటిన్యూ ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి.

క్షణాల్లో మీ సిబిల్‌ స్కోర్‌ (CIBIL Score) తెరపై కింద కనిపిస్తుంది. కింద కొన్ని సలహాలు, సూచనలు కూడా ఉంటాయి. గూగుల్‌ పేలో సిబిల్‌ స్కోర్‌ చెక్‌ చేసుకోవడం వల్ల మీ క్రెడిట్‌ స్కోర్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదనే సూచన కూడా కనిపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు