Credit score in whatsapp: వాట్సాప్‌ ద్వారా క్రెడిట్ స్కోర్ పొందడమెలా..?

సాధారణంగా క్రెడిట్ స్కోరు అనేది మీ క్రెడిట్ చరిత్రపై ఆధారపడి ఉంటుంది

Published : 06 May 2022 02:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో గత కొన్ని సంవత్సరాలుగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు, క్రెడిట్ బ్యూరోలు అయిన ట్రాన్స్ యూనియన్ సిబిల్, ఈక్విఫ్యాక్స్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎక్స్పీరియన్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సీఆర్‌ఐఎఫ్‌ హై మార్క్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లు వినియోగదారులకు క్రెడిట్ స్కోర్లు, క్రెడిట్ నివేదికలు, నెలవారీ అప్‌డేట్స్‌ అందజేయడానికి పలు ఫిన్ టెక్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఫిన్ టెక్ స్టార్ట్ అప్ అయిన విష్ఫిన్ ఒక అడుగు ముందుకు వేసి వాట్సాప్‌ ద్వారా క్రెడిట్ స్కోరును అందించడానికి ట్రాన్స్ యూనియన్ సిబిల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

సాధారణంగా క్రెడిట్ స్కోరు అనేది మీ క్రెడిట్ చరిత్రపై ఆధారపడి ఉంటుంది. మీరు ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బకాయిలను సరైన సమయానికి చెల్లింపు చేసినట్లయితే, మీకు మంచి క్రెడిట్ స్కోర్ లభిస్తుంది. రుణం కోసం ప్రయత్నించినప్పుడు, మంచి క్రెడిట్ స్కోర్ మీకు సులభంగా రుణం లభించేలా చేస్తుంది. ముఖ్యంగా అధిక క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి కొన్ని బ్యాంకులు గృహ రుణం వంటి పెద్ద రుణాలను తక్కువ వడ్డీ రేట్లకే అందిస్తాయి.

వాట్సాప్‌ ద్వారా క్రెడిట్ స్కోర్ పొందడం ఎలా?

మీరు 82871 51151 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం లేదా విష్ఫిన్ వెబ్‌సైట్‌లో మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయవలసి ఉంటుంది. అనంతరం, మీరు ‘విష్ఫిన్ సిబిల్ స్కోర్’ నుంచి వాట్సాప్‌ మెసేజ్‌ను పొందుతారు. మెసేజ్‌లో తెలిపిన సూచనలను అనుసరిస్తూ మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్, చిరునామా, పాన్, ఈ-మెయిల్ వంటి వివరాలను నమోదు చేయవలసి ఉంటుంది. అయితే, వివరణాత్మక నివేదిక పొందాలంటే మాత్రం మీరు విష్ఫిన్ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా క్రెడిట్ నివేదికను పొందడంతో పాటు 12 నెలవారీ అప్‌డేట్స్‌ను ఉచితంగా పొందొచ్చు.

భారత్‌లో క్రెడిట్ బ్యూరో కార్యకలాపాలను నిర్వహించాలనుకున్న సంస్థలు, క్రెడిట్ రిపోర్టును కోరిన ప్రతి ఒక్కరికీ సంవత్సరానికి ఒక పూర్తి ఉచిత క్రెడిట్ నివేదికను అందించాలని రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా (ఆర్‌బీఐ) స్పష్టం చేసింది. మీరు రుణం కోసం బ్యాంక్‌ను అభ్యర్థిస్తున్నప్పుడు వారికి కావలసిన అన్ని వివరాలు ఈ క్రెడిట్ నివేదిక ప్రతిబింబిస్తుంది. మీరు ఈ నివేదికలను వివిధ క్రెడిట్ బ్యూరో వెబ్‌సైట్‌ల ద్వారా కూడా పొందొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు