printouts @ doorstep: ఫుడ్డే కాదు.. ప్రింట్స్‌ కావాలన్నా ఆర్డర్‌ పెట్టుకోవచ్చు!

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటోకు చెందిన బ్లింకింట్‌ యాప్‌ ప్రింటవుట్‌ డెలివరీ సేవలను ప్రారంభించింది. కేవలం 11 నిమిషాల్లోనే మీకు కావాల్సిన ప్రింటవుట్‌లను డెలివరీ చేస్తామంటోంది.

Published : 19 Aug 2022 22:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అర్జెంట్‌గా వేరే చోటకు బయల్దేరి వెళ్లాలి. ప్రయాణానికి దుస్తులు సర్దుకోవాలి. అదే సమయంలో కొన్ని ముఖ్యమైన పేపర్లు ప్రింట్‌ తీయించి వెంట తీసుకెళ్లాలి. ఉన్న కొంచెం సమయంలో ఇవన్నీ సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మేమున్నామంటోంది బ్లింకిట్‌ యాప్ (Blinkit app)‌. ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటోకు చెందిన ఈ గ్రాసరీ యాప్‌ తాజాగా ప్రింటవుట్‌ డెలివరీ సేవలనూ ప్రారంభించింది. కేవలం 11 నిమిషాల్లోనే మీకు కావాల్సిన ప్రింటవుట్‌లను డెలివరీ చేస్తామంటోంది. తొలుత దిల్లీ-ఎన్‌సీఆర్‌లో కొన్ని ప్రాంతాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది.

మినమిమ్‌ ఆర్డర్‌తో సంబంధం లేకుండా ఎన్ని ప్రింటవుట్‌లైనా డెలివరీ చేస్తామని బ్లింకిట్‌ చెబుతోంది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ ప్రింటవుట్‌కు రూ.9, కలర్‌ అయితే రూ.19 చొప్పున వసూలు చేస్తుంది. ఇంట్లో ప్రింటర్లు లేని వారు, దగ్గర్లో సైబర్‌ కేఫ్‌లు, స్టేషనరీ షాపులూ లేని వారికి ఈ సేవలు ఉపయుక్తంగా ఉంటాయని బ్లింకిట్‌ పేర్కొంది. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ప్రింట్‌ కావాల్సిన వారు సంబంధిత డాక్యుమెంట్లను బ్లింకిట్‌ యాప్‌లో నిర్దేశించిన ఫార్మాట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ప్రింటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యాక ఆ డేటాను తమ సర్వర్ల నుంచి డిలీట్‌ చేస్తామని బ్లింకిట్‌ చెబుతోంది. ప్రింటవుట్‌ ఖర్చుతో పాటు డెలివరీ ఛార్జీ కింద మరో రూ.25 అదనంగా వసూలు చేస్తుంది. ప్రస్తుతం ఈ సేవలు దేశ రాజధానికే పరిమితమైనప్పటికీ.. త్వరలో మిగిలిన చోట్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని