Elon Musk: అలాంటి కంపెనీలు లేకుండా చేయాలి: మస్క్‌

ద్రవ్యోల్బణం కారణంగా ఆర్థిక మందగమన పరిస్థితులు తలెత్తుతున్నాయన్న ఆర్థిక నిపుణుల విశ్లేషణలపై బిలియనీర్‌, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ స్పందించారు....

Published : 27 May 2022 13:40 IST

వాషింగ్టన్‌: ద్రవ్యోల్బణం కారణంగా ఆర్థిక మందగమన పరిస్థితులు తలెత్తుతున్నాయన్న ఆర్థిక నిపుణుల విశ్లేషణలపై బిలియనీర్‌, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ స్పందించారు. ఈ మందగమనం 12-18 నెలల పాటు కొనసాగొచ్చని ట్విటర్‌లో ఓ యూజర్‌ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. గత అనుభవాల దృష్ట్యా తాను ఈ అంచనాకు వస్తున్నట్లు వెల్లడించారు.

నిరంతర నష్టాలతో సంపద సృష్టికి అవరోధంగా మారిన కంపెనీలు పూర్తిగా ఉనికిలో లేకుండా పోవాల్సిన అవసరం ఉందని మస్క్‌ అభిప్రాయపడ్డారు. ఫలితంగా ఆయా కంపెనీలు వినియోగించే వనరులు మిగిలిపోతాయని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఎగబాకిన విషయం తెలిసిందే. దీంతో ఆర్థికమందగమనం తలెత్తే అవకాశం ఉందని ఇటీవల ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ప్రపంచ జీడీపీ గణాంకాలను పరిశీలిస్తే మాంద్యాన్ని నివారించడం సాధ్యం కాదన్న విషయం స్పష్టమవుతోందని తెలిపింది.

గత నెల ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంకు ఒకశాతం తగ్గించి 3.2 శాతంగా పేర్కొంది. ప్రపంచ దేశాలు ప్రస్తుతం ఆహార, ఇంధన, ఎరువుల కొరతను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు చైనాలో కఠిన లాక్‌డౌన్‌లు కూడా ధరల పెరుగుదలకు దోహదం చేశాయి. మరోవైపు ద్రవ్యోల్బణ కట్టడికి కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచడం కూడా మందగమనానికి దారితీసే కారణాల్లో ఒకటని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఏడాది ఆఖరు కల్లా అగ్రరాజ్యం అమెరికా సైతం ఆర్థికమందగమనంలో కూరుకుపోయే అవకాశం ఉందని హేమన్‌ క్యాపిటల్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ ఇటీవల అంచనా వేశారు. మరోవైపు ప్రముఖ రేటింగ్‌ సంస్థలన్నీ భారత  వృద్ధి అంచనాల్లో కోత విధిస్తున్నాయి. తాజాగా భారత వృద్ధి అంచనాలను మూడీస్‌ 9.1% నుంచి 8.8% సవరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని