Investment: ల‌క్ష్యం ఆధారిత పెట్టుబ‌డుల ప్ర‌ణాళిక‌.. ఆర్థిక విజ‌యానికి మొద‌టి మెట్టు

సంపాద‌న‌, పొదుపుతోనే ల‌క్ష్యాన్ని చేరుకోలేం. త‌గిన‌ పెట్టుబ‌డులూ పెడితేనే గ‌మ్యాన్ని స‌రైన స‌మ‌యంలో చేర‌గ‌లం. 

Updated : 03 Dec 2021 20:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంప‌ద సృష్టికి దీర్ఘ‌కాలిక వ్యూహం ఉండాలి. ల‌క్ష్యం ఆధారంగా పెట్టుబ‌డులు ఉంటే.. స‌మ‌యాన్ని బ‌ట్టి పెట్టుబ‌డులు ఎంచుకుని, గ‌మ్యం అల‌వోక‌గా చేరుకోవ‌చ్చు. ఒక ల‌క్ష్యం అంటూ లేకుండా భ‌విష్య‌త్‌ కోసం పొదుపు చేస్తున్నామంటూ పెట్టుబ‌డులు మొద‌లు పెడితే స‌మ‌యం వృథా అవుతుందే త‌ప్ప త‌గిన మొత్తాన్ని ఏర్పాటు చేసుకోలేరు.

ఉదాహ‌ర‌ణ‌కు మీరు సూపర్ మార్కెట్‌కు వెళ్లారనుకుందాం. ఏది కొనాలో ముందుగా నిర్ణ‌యించుకోలేదు. అప్పుడు అవసరం లేనివి కూడా అధికంగా కోనేస్తుంటాం. ఇక్క‌డ డబ్బుతో పాటు స‌మ‌యం కూడా చాలా వృథా అవుతుంది. అదే మీరు ముందుగానే ఇది కొనుగోలు చేయాలి అని నిర్ణ‌యించుకుని వెళితే నేరుగా ఆ సెక్ష‌న్‌కు వెళ్లి మీ బ‌డ్జెట్‌లో కొనుగోలు చేసి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాం. స‌మ‌యం, డ‌బ్బు రెండూ వృథా కావు. పెట్టుబ‌డులు కూడా అంతే. మార్కెట్లో అనేక ర‌కాలు పెట్టుబ‌డి మార్గాలు అందుబాటులో ఉంటాయి. ఒక ల‌క్ష్యం ఉంటే దానికి త‌గిన పెట్టుబ‌డులు ఎంచుకుంటే స‌రిపోతుంది. లేదంటే అయోమ‌యంలో ప‌డిపోతాం. పైగా కొన్నింటికి లాక్‌-ఇన్ పిరియ‌డ్ ఉంటుంది. స‌మ‌యం వ‌ర‌కు వేచి ఉంటేనే పూర్తి ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌గ‌ల‌రు.

బ‌డ్జెట్‌తో ప్రారంభిచండి..: ముందుగా బ‌డ్జెట్‌తో ప్రారంభించాలి. ఆదాయం, ఖ‌ర్చులు, పొదుపులు.. ఇలా దేనికి ఎంత మొత్తం కేటాయిస్తున్నారో తెలుసుకోండి. ఖ‌ర్చుల‌ను ట్రాక్ చేయండి. అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకుని.. అతిగా ఖ‌ర్చు చేయ‌కుండా జాగ్ర‌త్తలు తీసుకోండి. బ‌డ్జెట్‌కు క‌ట్టుబ‌డి ఉండండి. ఇందుకు క్ర‌మ‌శిక్ష‌ణ అవ‌స‌రం. సంపాద‌న‌, పొదుపుతోనే ల‌క్ష్యాన్ని చేరుకోలేం. పెట్టుబ‌డులూ పెట్టాలి. అప్పుడే మీరు పొదుపు చేసిన మొత్తంపై మ‌రింత ఆదాయాన్ని పొందుతారు.

ల‌క్ష్యాల జాబితా త‌యారు చేయండి: ల‌క్ష్యం ఆధారంగా పెట్టుబ‌డులు ప్రారంభించేందుకు ముందుగా మీ ఆర్థిక ల‌క్ష్యాల జాబితాను త‌యారు చేసుకోవాలి. ఉన్న‌త చ‌దువులు, పెళ్లి, పిల్లల చ‌ద‌వులు, విహార యాత్ర‌లు, ఇంటి కొనుగోలు, విలువైన వ‌స్తువుల కొనుగోలు, ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి ఇలా ర‌క‌ర‌కాల ల‌క్ష్యాలు ఉంటాయి. అందిరికీ ఒకే ర‌క‌మైన ఆర్థిక ల‌క్ష్యాల‌ను ఉండాల‌ని లేదు. వ్య‌క్తులకు వారి వారి జీవ‌న శైలి, అవ‌స‌రాల‌ను బ‌ట్టి వేరు వేరు ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. అందువ‌ల్ల మీ ఆర్థిక ల‌క్ష్యాలు ఏంటనేది ఆలోచించి పూర్తి జాబితా త‌యారు చేయండి. లక్ష్యం మొత్తం, కాల పరిమితి, నెలసరి పెట్టుబడి ఇలా ప్రతిదీ రాసిపెట్టుకోవాలి.

దేనికి ప్రాధాన్య‌త ఇవ్వాలో నిర్ణ‌యించండి: మ‌న‌కు చాలా లక్ష్యాలు ఉంటాయి. కానీ అన్నింటికీ ఒకేసారి మదుపు చేయ‌లేం. అందువ‌ల్ల మీ ల‌క్ష్యాల జాబితాలో ప్రాధాన్య‌ం ఉన్న ల‌క్ష్యాల‌ను ముందుగా ఎంచుకోండి. త‌ర్వాత వీటిని దీర్ఘ‌కాలిక‌, స్వ‌ల్ప‌కాలిక ల‌క్ష్యాలుగా విభ‌జించండి. మీ వ‌య‌సు ఆధారంగా ప‌ద‌వీ విర‌మ‌ణ‌, పిల్ల‌ల చ‌దువు, ఆస్తి కొనుగోలు వంటివి దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాలుగానూ, పెళ్లి, విహార‌యాత్ర‌లు, గ్యాడ్జెట్స్ కొనుగోలు వంటివి స్వ‌ల్ప‌కాల‌ ల‌క్ష్యాల జాబితాకు తీసుకురండి.

పెట్టుబడులు ఎంపిక చేయండి: ఒక‌సారి మీ ల‌క్ష్యాలను చేరుకునేందుకు ఉన్న స‌మ‌యం గురించి ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చిన త‌ర్వాత వాటిని సాధించ‌డంలో స‌హాయ‌ప‌డే పెట్టుబ‌డుల‌ను ఎంపిక చేసుకుని.. ప్ర‌తి ల‌క్ష్యానికి కావ‌ల‌సిన నిధుల‌ను స‌మ‌కూర్చుకోవ‌డం ప్రారంభించవ‌చ్చు. ఉదాహర‌ణ‌కు 10-30 సంవత్సరాల దూరంలో ఉన్న దీర్ఘ‌కాలిక ఆర్థిక ల‌క్ష్యం చేరుకునేందుకు మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ సాధనాల్లో మ‌దుపు చేయొచ్చు. మీ లక్ష్యం చేరుకునేందుకు ఒకటి లేదా రెండు సంవత్సరాల స‌మ‌యం మాత్ర‌మే ఉన్నట్లయితే రికరింగ్ డిపాజిట్లు, డెట్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి స్థిర ఆదాయ సాధనాలను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవ‌చ్చు.

ల‌క్ష్యం సాధించాలంటే: పెట్టుబ‌డులు పెట్టేట‌ప్పుడు ల‌క్ష్యంతో పాటు మూడు అంశాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవాలి. మొద‌టిది లక్ష్యం కోసం ఎంత డ‌బ్బు అవ‌స‌రమో అంచ‌నా వేయాలి. ఇందుకు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. రెండోది లక్ష్య సాధనకు స‌మ‌యం తెలుసుకోవాలి. మూడోది రిస్క్ తీసుకునే సామ‌ర్థ్యం. ఒక‌వేళ రిస్క్ తీసుకుని పెట్టుబ‌డుల నుంచి అనుకున్నంత రాబ‌డి లేక‌పోగా నష్టం భ‌రించాల్సి వ‌స్తే, మీరు త‌ట్టుకోగ‌ల‌రా లేదా చూసుకోవాలి. 

మూల‌ధ‌న వృద్ధి: సిప్ విధానంలో క్ర‌మానుగ‌తంగా పెట్టుబడులు చేయొచ్చు. స్టెప్ అప్ విధానాన్ని ఎంచుకుంటే మూల‌ధ‌న వృద్ధి ఉంటుంది. ఫోర్ట్‌ఫోలియోలో వైవిధ్య‌త ఉండేలా జాగ్ర‌త్త ప‌డాలి. అలాగే పొదుపు, పెట్టుబ‌డుల‌ విష‌యంలో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో న‌డుచుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ లాంటి పథకాల్లో సమయం చాలా ముఖ్యమైనది. అప్పుడే మీ పెట్టుబడిపై అధిక రాబడి పొందే అవకాశం ఉంటుంది. తొందరపాటుతో గానీ, అవ‌గాహ‌న లేమితో గానీ ల‌క్ష్యం ఎంపిక‌లో విఫ‌లం అయితే.. పెట్టుబ‌డుల‌ ప్ర‌ణాళిక మొత్తం ఇబ్బందుల్లో ప‌డే అవ‌కాశం ఉంది. అందువ‌ల్ల ల‌క్ష్యాన్ని జాగ్ర‌త్త‌గా ఎంచుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని