2021లో ఇవి పెరగనున్నాయా?

కరోనా వ్యాప్తి.. లాక్‌డౌన్‌.. ఆదాయం తగ్గుదల.. ఈ ఏడాది సామాన్యుల నుంచి ధనికుల

Published : 30 Dec 2020 08:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వ్యాప్తి.. లాక్‌డౌన్‌.. ఆదాయం తగ్గుదల.. ఈ ఏడాది సామాన్యుల నుంచి ధనికుల వరకు అందరిపైనా ప్రభావం చూపింది ఈ అంశాలే. ఎన్నో ప్రణాళికలతో.. మరెన్నో ఆశలతో 2020 సంవత్సరాన్ని ప్రారంభించినా.. మార్చి నుంచి కలలన్నీ కళ్లలుగా మిగిలాయి. నచ్చినవి కొనుగోలు చేయాలన్నా.. అంత ఆర్థిక స్తోమత లేక వెనకడుగు వేశారంతా. ఇప్పుడు ఈ ఏడాది ముగిసిపోతుంది. జనం లాక్‌డౌన్‌ ప్రభావం నుంచి క్రమంగా బయటపడుతున్నారు. కాస్తోకూస్తో.. చేతులో డబ్బులాడుతున్నాయి. కొత్త సంవత్సరంలోనైనా అవసరమైనవి కొనాలని ఎదురుచూస్తున్నారు. కానీ ఈ ఆర్ఠిక కష్టాలు వచ్చే ఏడాదిలోనూ కొనసాగనున్నాయి. కొత్త ఏడాది ఆరంభం నుంచే ధరల మోత మోగనుంది. ఎలక్ట్రానిక్‌, గృహోపకరణాల ధరలు ప్రియం కానున్నాయన్న సంకేతాలు.. మధ్య తరగతిని కలవరపెడుతున్నాయి. పసిడి ధరలు పరుగులు పెట్టుతున్నాయన్న అంచనాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.  

ప్రియం కానున్న బంగారం, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు
ఈ ఏడాది ఇంట్లోకి తమకు నచ్చిన వస్తువులన్నీ కొనుగోలు చేయాలనుకున్న వారు ఆ ఆలోచనను మానుకున్నారు. వాయిదా పద్ధతిలో కొనుగోలు చేసే వీలున్నా.. ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. కారణం.. కరోనా, వైరస్‌ కట్టడికి అమలు చేసిన లాక్‌డౌన్‌ అందరి బడ్జెట్‌ను తలకిందులు చేసింది. కొన్ని రోజులుగా కాస్తోకూస్తో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఆదాయం మళ్లీ గాడినపడుతోంది. కానీ కొత్త సంవత్సరంలో అవసరమైన వస్తువులు కొనుగోలు చేయాలని భావిస్తున్న తరుణంలో ఇటీవల పరిణామాలు వారిని కలవరపెడుతున్నాయి. పసిడి ధరలు పరుగులు పెడుతాయని అంచనాలు వచ్చాయో.. లేదో వెంటనే ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల ధరలు ఆకాశాన్ని అంటుతాయని వార్తలు  వినిపించాయి. ఫలితంగా ధరల మోత తప్పేలా లేదని అంతా దిగాలు చెందుతున్నారు.

ధరల పెరుగుదలకు సంబంధించి అందరూ చెబుతోంది బంగారం గురించే.. కొత్త ఏడాదిలో బంగారం ధర మరింత పరుగులు పెట్టనుందనే ఊహాగానాలు పసిడి ప్రియుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. 10 గ్రాముల బంగారం రూ. 60వేలు దాటుతుందనే అంచనాలు వేస్తున్నారు. మరికొందరు అయితే 10 గ్రాముల ధర రూ. 63వేలు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదని చెబుతున్నారు. గతేడాదితో పొలిస్తే ఈసారి బంగారం ధర వేగంగా పెరగడం మదుపర్ల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తోంది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు బంగారానికి అమాంతం గిరాకీ పెంచేశాయి. ప్రపంచ వ్యాప్తంగా 2020లో ఏర్పడిన అనిశ్చితి 2021లోనూ కొనసాగుతుందన్న అంచనాలు.. వ్యాక్సిన్‌ ఆగమనం.. డాలర్‌ విలువ తగ్గిపోవడం లాంటి పరిణామాలతో పసిడి ధరలకు రెక్కలొస్తాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

భారతీయులకు ఎంతో ఇష్టం..
భారతీయులకు పసిడి ఎంతో ప్రియమైన లోహం. పెళ్లిళ్లు..శుభకార్యాలన్నింటా పుత్తడికి ప్రాధాన్యత, సెంటిమెంటు తోడుకావడంతో పసిడి ధరలు దేశీయ మార్కెట్లో ఎప్పుడూ  మారుతూ ఉంటాయి. అయితే ఈ ఏడాది కరోనా ప్రభావంతో బంగారం కూడా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. మార్కెట్లు తెరుచుకోక గిరాకీ పడిపోయింది. అన్‌లాక్‌ ప్రక్రియ మొదలై మార్కెట్లు ప్రారంభమయ్యాక.. రికార్డు స్థాయిలో పసిడి ధరలు నమోదయ్యాయి. 2010లో రూ.18వేల విలువ గల బంగారం పదేళ్లలో నాలుగు రెట్లకుపైగా పెరిగి రూ.56వేల మార్కును దాటింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.52 వేల వరకు పలుకుతోంది. వచ్చే ఏడాది ఇంతకుమించి ధరలు నమోదవుతాయన్న అంచనాలున్నాయి. ఇవే మార్కెట్ వర్గాలతోపాటు కొనుగోలుదారుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. 

ఉద్దీపన ప్యాకేజీలతో అనిశ్చితి 
ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ఉద్దీపన ప్యాకేజీలతో బంగారం మరింత బలపడనుందని బులియన్‌ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా అనిశ్చిత పరిస్థితుల్లో పసిడిని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావిస్తారు. కరోనా సంక్షోభంలో 10 గ్రాముల బంగారం ధర ఎంసీక్స్‌లో మునుపెన్నడూ లేని విధంగా రూ.56 వేలు పలికింది. అంతర్జాయ మార్కెట్లయితే ఆగస్టులో ఒక్క ఔన్స్‌ 2075 డాలర్ల మార్కును అధిగమించింది. వడ్డీ రేట్లు తగ్గిస్తూ కేంద్ర బ్యాంకులు తమ ద్రవ్యవిధానాన్ని ప్రకటించడం, నగదు అందుబాటులో ఉంచడం వంటివి.. బంగారం  పెరుగుదలకు కారణమవుతున్నాయి. బంగారానికి ప్రత్యక్ష గిరాకీ కన్నా..  బులియన్‌, ట్రేడింగ్‌ పరంగా డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది. పసిడి దుకాణాల్లో 10శాతం మేర క్రయవిక్రయాలు జరిగితే, కమోడిటీస్‌ మార్కెట్లో అది 90శాతంగా ఉంది. కొవిడ్‌ భయాందోళనల నేపథ్యంలో వినియోగదారులు డిజిటల్‌ వేదికలపై గోల్డ్‌ కాయిన్స్‌,బాండ్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. అయితే అనిశ్చిత పరిస్థితుల్లో బంగారానికి గిరాకీ అమాంతం పెరుగుతోంది. లాక్‌డౌన్‌ విధించిన మార్చిలో దేశీయ మార్కెట్లో 41,700 వద్ద ట్రేడ్‌ అయిన 10గ్రాముల బంగారం ధర తర్వాత పుంజుకుంది. ఈ వేగంతోనే కొత్త ఏడాదిలో బంగారం రూ.60వేల మార్కు దాటుతుందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలకు పలు అంతర్జాతీయ పరిణామాలు ఊతమిస్తున్నాయి. 

డాలర్‌ విలువ పతనమే కారణం
బంగారం ధర, డాలర్‌ విలువ ఒకటితో ఒకటి ముడిపడి ఉంటాయి. డాలర్‌ పతనం పసిడి ధరలకు పెరుగుదలకు కారణం అవుతాయి. కొవిడ్‌ వల్ల ఆర్థిక వ్యవస్థలు తలకిందులయ్యాయి. ఉపాధి, వేతనాలు లేక సతమతమవుతున్నవారికోసం పలు దేశాలు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. అమెరికాలో రూ. 2 లక్షల కోట్ల ప్యాకేజీని అందించారు. ఫలితంగా నగదు లభ్యత అమాంతం పెరిగి బంగారం మరింత బలపడుతుందని బులియన్‌ వర్గాలు  చెబుతున్నాయి. వడ్డీ ధరలు కూడా దిగొచ్చాయి. అందుకే డాలర్‌ బలహీనపడి ఆ ప్రభావం బంగారం ధరలపై పడుతోందని నిపుణులు అంటున్నారు. 

అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర ప్రస్తుతం 1885 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతుండగా... ఒకానొక దశలో 2075 డాలర్ల మార్కును తాకింది. ఈ అనిశ్చితి ఇదేలా కొనసాగితే వచ్చే ఏడాది ఆరంభంలోనే ఔన్స్‌ బంగారం 2200 డాలర్లను  అధిగమిస్తుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే బంగారం ధర 60వేలకు వడివడిగా పరుగులు తీస్తుందని ట్రేడర్స్ అంచనా వేస్తున్నారు.  

కరోనా 2.0 కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణంగా నిలుస్తోంది. ప్రభుత్వాలు మరికొన్ని ఉద్దీపనలు అందిస్తే డాలర్‌ మరింత బలహీనపడుతుంది. మళ్లీ పసిడి ధరలు పెరుగుతాయి. ఈ పరిణామాలతో వచ్చే ఏడాది ఎక్కువ మంది మదుపర్లు బంగారానికే మొగ్గు చూపుతారన్న అంచనాలున్నాయి. బంగారం వినియోగం విషయంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది భారత్‌. ఇతర దేశాలతో పోలిస్తే బంగారంపై పన్నులు ఎక్కువ. కస్టమ్‌ సుంకం, జీఎస్టీ కలిపి 15.5శాతం పన్నులు బంగారంపై వసూలు చేస్తున్నారు. భారత్‌లో బంగారం ఉత్పత్తి చాలా తక్కువ. 99శాతం పసిడిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. 

లాక్‌డౌన్‌తో రవాణా సమస్యలు తలెత్తగా ధరలు పెరగడం వంటివి పసిడి ధరపై ప్రభావం చూపాయి. సెప్టెంబరు నాటికి భారత్‌లో పసిడి గిరాకీ 49శాతం తగ్గింది. అయితే అక్టోబర్‌, డిసెంబర్‌ మధ్య మాత్రం ధరలు అమాంతం పెరిగాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తివేయడం, పెళ్లిళ్ల సీజన్‌ కావడం వల్ల ఈ త్రైమాసికంలో అంతకు ముందుతో పోలిస్తే.. ప్రత్యక్ష గిరాకీ పెరిగింది. కానీ 2019నాటితో పోలిస్తే తక్కువగానే ఈ డిమాండ్ నమోదైంది. 20 ఏళ్ల కాలంలో డిమాండ్‌ అతి తక్కువగా నమోదుకావడం ఇది రెండోసారని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే శూన్య మాసంలో పసిడి కొనుగోళ్లలో కొంతమేర స్తబ్ధత నెలకొనే అవకాశాలున్నాయి. 

అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి సర్దుకోవడం, వ్యవస్థాగత మార్పులూ... వైరస్‌ ప్రభావం తగ్గుముఖం పట్టడం, వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం లాంటి పరిణామాలతో పసిడి ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఏడాదిలో బంగారం ధర పెరిగినా.. అది ఉన్నట్టుండి ఆ స్థాయికి చేరుకోదని చెబుతున్నారు పలువురు నిపుణులు. ఔన్స్‌ ధర బంగారం మరికొద్ది నెలల్లో 2100-2200 వద్ద ట్రేడ్‌ అయే అవకాశం ఉందనీ, అప్పుడు 10 గ్రాముల బంగారం రూ. 55-58 వేల మధ్య స్థిరపడుతుందని వారు అంచనా వేస్తున్నారు. పరిస్థితి మరింత దిగజారి 2200 డాలర్లకు పైగా ఔన్స్‌ బంగారం ధర ట్రేడ్‌ అయితే.. రూ.60వేల మార్కు దాటడం సాధ్యపడుతుందని చెబుతున్నారు. ఏదేమైనా.. ఈ పరిణామాలన్నీ గమనిస్తే కొత్త ఏడాదిలో 10గ్రాముల బంగారం రూ.50వేల లోపు దిగొస్తుందనే ఆశలు అడియాశలే అవుతాయని తెలుస్తోంది.

ఎలక్ట్రానిక్‌ క్రయవిక్రయాలపై ప్రభావం 
దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాల ధరలు భారీగా పెరగనున్నాయని మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. ఏడాదిగా మూతపడ్డ పరిశ్రమలు తిరిగి కొలుకున్నా.. ఇప్పటికీ వెంటాడుతున్న సమస్యలు అనుబంధ రంగాల్లోనూ ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఫలితంగానే ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్‌ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు సహా మిగతా గృహోపకరణాల ధరలకు రెక్కలు రాబోతున్నాయి. ముడిసరకు ధరలతో పాటు జల, వాయు రవాణా ఛార్జీలు పెరగడమే ఇందుకు కారణమంటున్నాయి పరిశ్రమ వర్గాలు. గృహోపరకరణాల ధరల్లో 15 నుంచి 20 శాతం పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నాయి. 

గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో భారత్‌ అతిపెద్ద మార్కెట్‌. ఈ విభాగంలో ఏటా వేల కోట్ల లావాదేవీలు జరగుతుంటాయి. దిగ్గజ సంస్థలైనా పానసోనిక్‌, సోనీ, ఎల్జీ, వీయూ, ఎంఐ, శాంమ్‌సంగ్‌ వంటి ప్రధాన సంస్థల ఉపకరణాలకు భారత విపణిలో మంచి గిరాకీ ఉంది. భారత విపణి పెద్దది కావడంతో అన్ని సంస్థలు పోటీపడి మరి విక్రయాలు చేస్తున్నాయి. కానీ ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో అధికభాగం విదేశాల నుంచి దిగుమతి అవుతున్నవే. కొన్ని సంస్థలు నేరుగా విదేశీ పరికరాలను దిగుమతి చేసుకొని విక్రయిస్తుండగా.. మరికొన్ని సంస్థలు విడి భాగాలను దిగుమతి చేసుకుంటున్నాయి.  

దేశంలోనూ కొన్ని సంస్థలు ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు ఉత్పత్తి చేస్తున్నా.. ముడి సరకు కోసం మళ్లీ దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. ముఖ్యంగా చైనా నుంచి భారత్‌కు అధిక దిగుమతులు జరుగుతున్నాయి. 2018-19 ఏడాదిలో భారత్‌ గృహోపకరణాలు ఎలక్ట్రానిక్స్‌ మార్కెట్ విలువ రూ.76,400 కోట్లు. ఇందులో రూ.32,200 కోట్ల మేర ఉత్పత్తులు దేశీయంగా ఉత్పత్తి కాగా.. మిగతాది అంతా విదేశాల నుంచి దిగుమతి అయినవే. 

అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో కొవిడ్‌ ఆంక్షలతో మూతపడ్డ పరిశ్రమలు ఇంకా గాడినపడలేదు. కరోనా పరిస్థితులు స్థిమిత పడుతున్న తరుణంలో పరిశ్రమల ఉత్పత్తి ఇంకా సాధారణ స్థాయికి చేరుకోలేదు. దీంతో ఎలక్ట్రానిక్స్‌ పరికరాల తయారీ సంస్థలకు ముడిపదార్థాల లభ్యత కొరత ఏర్పడింది. సరిగ్గా ఇదే సమయంలో విక్రయాలు జోరందుకోవడంతో డిమాండ్‌ దృష్ట్యా ధరలు పెంచేశాయి తయారీ సంస్థలు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న రవాణా సమస్యలు ధరల పెరుగుదలకు కారణమంటున్నారు నిపుణులు. ప్రపంచ వ్యాప్తంగా  జరగుతున్న మొత్తం సరకు రవాణాలో ఏకంగా 80శాతం సముద్ర మార్గాల్లోనే జరుగుతుంటాయి. ప్రస్తుతం అంతర్జాతీయ విపణి గొలుసు చిన్నాభిన్నం అవడం, దేశాల మధ్య నౌకా రాకపోకలు తగ్గిపోవడంతో సరకు రవాణాకు  మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతోపాటే పెరిగిన రవాణా ఖర్చులు అంతిమంగా వినియోగదారుడిపైనే పడుతున్నాయి. 

ఎంత శాతం పెరుగుతాయంటే..
విశ్లేషకుల అంచనా ప్రకారం నూతన ఏడాదిలో ఏసీల ధరలు 8-10శాతం, రిఫ్రిజిరేటర్ల ధరలు 12-15శాతం, ఎల్‌ఈడీ టీవీల ధరలు 7-20శాతం పెరగనున్నాయి. ఇక ఇంటిళ్లిపాదిని కట్టిపడేసే బుల్లితెరల్లో ప్రధాన భాగమైన ప్యానల్‌ ధరలు అనూహ్యంగా 200 శాతం పెరిగిపోయాయి. అందుకు ప్రధాన కారణం సరఫరాలో లోటు. ఈ ప్యానెళ్లు అత్యధికంగా చైనాలో తయారవుతుండగా.. వీటికి సరైన ప్రత్యామ్నాయం అందుబాటులో లేదు. అందుకే పెరిగిన ధరలను తప్పక ఆమోదించాల్సి వస్తుందంటున్నారు తయారీ సంస్థల ప్రతినిధులు.

ఇప్పటికే థాంసన్‌, కొడాక్‌ సంస్థలు ఆండ్రాయిడ్ టీవీ ధరలు జనవరి నుంచి 20శాతం పెంచనున్నట్లు సమాచారం. జనవరిలో 7శాతం, తొలి త్రైమాసికంలో 11శాతం ధరలు పెరిగేందుకు అవకాశం ఉన్నట్లు పానసోనిక్‌ ఇండియా సీఈవో మనీశ్‌ శర్మ తెలిపారు. ఎల్జీ ఇండియా కూడా తన ఉత్పత్తి ధరల్ని 8శాతం పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. సోనీ ఇండియా మాత్రం వేచిచూసే ధోరణి అవలంబిస్తోంది. అన్ని రకాల టీవీల ధరల్లో పెరుగుదల ఉన్నప్పటికీ.. చిన్న పరిమాణంలోని టీవీల ధరల పెరుగుదల విక్రయాలపై ప్రభావం చూపుతాయని మార్కెట్‌ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

గృహోపకరణాల తయారీలో వివిధ రకాల లోహాలు వినియోగిస్తుంటారు. అంతర్జాతీయంగా వీటి ధరల్లో పెరుగుదల నమోదైంది. కాపర్‌, జింక్, అల్యూమినియం ధరలు డిసెంబర్‌లో 15-20 శాతం పెరిగాయి. రిఫ్రిజిరేటర్ల ఫోమ్స్‌ తయారీ కోసం ఉపయోగించే ఎండీఐ అనే రసాయనం ధర ప్రపంచ మార్కెట్లో దాదాపు 200శాతం పెరిగింది. వీటికి తోడుగా సముద్ర రవాణా మరింత ప్రియం అయింది. ఇంధన ధరలు, ప్రయాణపు జాగ్రత్తలు, సిబ్బంది కొరత వంటి వివిధ కారణాలతో నౌక రవాణా ఛార్జీలను 40-50శాతం పెంచేశారు. వాయు రవాణాలో ఖర్చు మొదటి నుంచి అధికమే అయినా వాటి ధరలు ఇప్పుడు మరింత పెరిగాయి. ఇలా విభిన్న రంగాల్లో వచ్చిన మార్పులు దేశ ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. ధరల పెరుగుదలకు అనూహ్య డిమాండ్‌ మరింత ఊతమందించింది. వర్క్‌ ఫ్రమ్‌ హోం పని విధానం కారణంగా దేశీయ విపణిలో ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్లు, టీవీలకు అధిక గిరాకీ ఏర్పడింది. ఈ కారణంగానే గతేడాది ఇదే సమయంలోని అమ్మకాలతో పోలిస్తే ప్రస్తుత అమ్మకాలు పెరిగాయంటున్నారు విక్రయదారులు.  

కరోనాకు మూలకారణంగా భావిస్తున్న చైనా.. అంతర్జాతీయ మార్కెట్లలో ఎంతలా పాతకుపోయిందో ఈ పరిణామాలు కళ్లకు కడుతున్నాయి. ప్రపంచ వాణిజ్య గొలుసులో మిగతా ఏ దేశం లాభపడనంతగా చైనా సంస్థలు లాభాలు ఆర్జిస్తున్నాయి. కానీ కరోనా విజృంభనతో అపకీర్తి మూటకట్టుకోవడమే కాక.. ఆదేశ సంస్థల కార్యకలాపాలపైనా తీవ్ర ప్రభావం పడింది. ఇప్పుడు అన్ని దేశాలు చైనా నుంచి దిగుమతులు తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. దీంతో చైనా సంస్థలు ఉత్పత్తి తగ్గిస్తున్నాయి. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌కు తగ్గట్లు ముడిసరకు సరఫరా కావడం లేదు. రానున్న కాలాన్ని దృష్టిలో ఉంచుకొని చైనా మార్కెట్‌ను సొంతం చేసుకునేందుకు తైవాన్‌,వియత్నాం ప్రయత్నిస్తున్నాయి. భారత్‌ ఇప్పుడిప్పుడే ఎలక్ట్రానిక్‌ పరికరాలు, విడిభాగాల తయారీపై దృష్టి పెడుతోంది. పూర్తిస్థాయి దేశీయ తయారీకి ఇంకా కొంతకాలం పట్టనుంది. 

వాస్తవానికి దసరా, దీపావళి వంటి పండగల సమయంలోనే ఎలక్ట్రానిక్‌ పరికరాల ధరలు పెంచాల్సి ఉందంటున్నారు పరిశ్రమ విశ్లేషకులు. కానీ అసలే కరోనా కారణంగా తగ్గిపోయిన అమ్మకాలు.. మరింత తగ్గుతాయని ధరల పెంపునకు సంస్థలు మొగ్గు చూపలేదని తెలుపుతున్నారు. ప్రస్తుత నిర్ణయంతో వచ్చే త్రైమాసిక అమ్మకాలు కోలుకోవడంపై ప్రభావం తప్పక ఉంటుందని, కానీ ముడి సరకులోని ద్రవ్యోల్భనాన్ని తయారీ సంస్థలు భరించే స్థితిలో లేవని వివరిస్తున్నారు. ఒకే సారి ఇంత పెద్ద మొత్తంలో ధరలు పెరగడం గతంలో ఎప్పుడూ లేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి . 

మొత్తంగా కొత్త సంవత్సరంలో ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు కొనుక్కోవాలనుకుంటున్న సామాన్యుడు.. మరింత భారం మోయక తప్పేలా లేదు. ప్రస్తుతం పరిస్థితుల్లో గృహోపకరణాల ధరలు రూ. 4-10 వేల వరకు పెరిగే అవకాశాలున్నాయి. కానీ భారత విపణిలో మొత్తం చెల్లించి ఉపకరణాలు కొనుగోలు చేసే వారికంటే..ఫైనాన్స్‌పై విక్రయిస్తున్న వారే అధికంగా ఉన్నారు. దాదాపు 75-80శాతం మంది ఫైనాన్స్‌ సంస్థలు అందిస్తున్న రుణాలతోనే నూతన వస్తువుల కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ కారణంగా ధరల పెరుగుదలతో కొనుగోళ్లలో పెద్ద వ్యత్యాసం ఉండకపోవచ్చని విక్రయదారులు అంచనా వేస్తున్నారు.  

లోకాస్ట్‌ ఈఎంఐ వంటి వెసలుబాట్లు, రాయితీలు, ఈజీ ఈఎంఐల వంటివి అందుబాటులోకి రావడంతో వినియోగదారులు ఖరీదైన వస్తువులను సైతం సులభ వాయిదాల్లో కొనుగోలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని