Gold Imports: 9 నెలల్లో 75% పెరిగిన బంగారం దిగుమతులు!

కరెంటు ఖాతా లోటుపై నేరుగా ప్రభావం చూపే బంగారం దిగుమతులు ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య 73 శాతం పెరిగి 45.1 బిలియన్‌ డాలర్లకు చేరాయి....

Published : 13 Mar 2022 15:31 IST

దిల్లీ: కరెంటు ఖాతా లోటుపై నేరుగా ప్రభావం చూపే బంగారం దిగుమతులు ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య 73 శాతం పెరిగి 45.1 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.3.46 లక్షల కోట్లు)కు చేరాయి. క్రితం ఏడాది ఇదే సమయంలో దిగుమతుల విలువ 26.11 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. దేశీయంగా గిరాకీ పుంజుకోవడమే దిగుమతులకు ప్రధాన కారణమని కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది.

అయితే, ఫిబ్రవరి 2022లో మాత్రం బంగారం దిగుమతులు పడిపోవడం గమనార్హం. ప్రభుత్వ లెక్కల ప్రకారం గత నెలలో దిగుమతులు 11.45 శాతం తగ్గి 4.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పసిడి దిగుమతులు పెరగడంతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో కరెంటు ఖాతా లోటు 176 బిలియన్‌ డాలర్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే సమయంలో ఈ లోటు 86 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. రానున్న పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో దిగుమతులు మరింత పెరిగి కరెంటు ఖాతా లోటుపై ఇంకా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రపంచంలో అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకుంటున్న రెండో దేశం భారత్‌. ముఖ్యంగా ఆభరణాల పరిశ్రమలే ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటాయి. పైన తెలిపిన 9 నెలల వ్యవధిలో భారత్‌ 842.28 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ఇక ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య రత్నాభరణాల ఎగుమతులు 57.5 శాతం పెరిగి 35.25 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని