Gold Imports: ఏప్రిల్‌-జులైలో ₹ 1లక్ష కోట్లకు బంగారం దిగుమతులు

దేశ కరెంటు ఖాతా లోటుపై ప్రత్యక్ష ప్రభావం చూపే బంగారం దిగుమతులు ఏప్రిల్‌-జులై మధ్య 6.4 శాతం పెరిగి 12.9 బిలియన్‌ డాలర్లకు చేరాయి....

Updated : 19 Aug 2022 15:20 IST

దిల్లీ: దేశ కరెంటు ఖాతా లోటుపై ప్రత్యక్ష ప్రభావం చూపే బంగారం దిగుమతులు ఏప్రిల్‌-జులై మధ్య 6.4 శాతం పెరిగి 12.9 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.1.02 లక్షల కోట్లు)కు చేరాయి. క్రితం ఏడాది ఇదే సమయంలో దిగుమతుల విలువ 12 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. జులై నెలలో మాత్రం దిగుమతులు 43.6 శాతం తగ్గి 2.4 బిలియన్‌ డాలర్లుగా నమోదవ్వడం గమనార్హం.

ఏప్రిల్‌-జులై మధ్య బంగారం, చమురు దిగుమతులు గణనీయంగా పెరగడం వల్ల వాణిజ్య లోటు రికార్డు స్థాయి అయిన 30 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. క్రితం ఏడాది ఇదే సమయంలో ఇది 10.63 బిలియన్‌ డాలర్లుగా ఉండింది. చైనా తర్వాత అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశం భారత్‌. ముఖ్యంగా ఆభరణాల కోసం దేశంలోకి భారీ ఎత్తున పసిడి దిగుమతి అవుతూ ఉంటుంది.

ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో రత్నాభరణాల ఎగుమతులు 7 శాతం పెరిగి 13.5 బిలియన్‌ డాలర్లకు చేరాయి. భారీ వాణిజ్య లోటు వల్ల 2021-22లో దేశ కరెంటు ఖాతా లోటు జీడీపీలో 1.2 శాతానికి చేరింది. అదే 2020-21లో కరెంటు ఖాతాలో మిగులు నమోదవ్వడం గమనార్హం. 2021 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో 22.2 బిలియన్‌ డాలర్లతో జీడీపీలో 2.6 శాతంగా ఉన్న కరెంటు ఖాతా లోటు 2022 జనవరి-మార్చి త్రైమాసికానికి జీడీపీలో 1.5 శాతానికి తగ్గి 13.4 బిలియన్‌ డాలర్లకు చేరింది. దేశ దిగుమతుల విలువ.. ఎగుమతుల విలువ కంటే ఎక్కువుంటే అప్పుడు దేశ కరెంటు ఖాతాలో లోటు ఏర్పడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని