Gold price: 2023లో బంగారం ₹60 వేల మార్కుకు..?

Gold prices in 2023: అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.

Published : 30 Dec 2022 15:48 IST

ముంబయి: భౌగోళిక రాజకీయ పరిణామాలు, వడ్డీ రేట్ల పెంపు వంటి కారణాలతో అంతర్జాతీయంగా ఈ ఏడాది పసిడి ధరలు (Gold price) తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయంగా అదే స్థాయిలో ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే, వచ్చే ఏడాది 10 గ్రాముల బంగారం (Gold) ధర దేశీయ మార్కెట్‌లో రూ.60 వేల స్థాయిని చేరుకోవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి ఎక్కువమంది పెట్టుబడులు పెట్టే అవకాశం ఉండడమే ఇందుకు కారణం కానుందని చెబుతున్నారు.

ఏడాదంతా ఒడుదొడుకులే..

అంతర్జాతీయంగా బంగారం ధరలు ఈ ఏడాది తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 2022 ప్రారంభంలో 1800 డాలర్లుగా ఉన్న ఔన్సు బంగారం ధర మార్చి నెలలో 2070 డాలర్లకు చేరింది. నవంబర్‌లో తిరిగి 1616 డాలర్ల కనిష్ఠాన్ని చేరింది. ఇప్పుడు మళ్లీ కోలుకుని 1800 డాలర్ల స్థాయి వద్ద కదలాడుతోంది. దేశీయంగా ప్రస్తుతం మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో డాలరుతో రూపాయి మారకం విలువ 83 వద్ద లెక్కిస్తే 10 గ్రాముల బంగారం ధర రూ.54,790గా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో రూ.47,850 ఉండగా.. మార్చిలో గరిష్ఠంగా రూ.55,680కి చేరింది. సెప్టెంబర్‌లో మళ్లీ రూ.48,950 స్థాయికి దిగొచ్చింది.

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కారణంగా కొద్ది రోజుల పాటు ఈ ఏడాది పసిడి ధరలు పెరిగాయని మార్కెట్‌ విశ్లేషకులు తెలిపారు. అయితే ఎప్పుడైతే డాలర్‌ బలపడిందో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సహా ఇతర కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడం, బాండ్ల రిటర్నులు పెరగడం పసిడిపై ఆసక్తి తగ్గడానికి కారణమైందని చెప్పారు.

వచ్చే ఏడాది ఎందుకు పెరుగుతాయంటే..?

భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఆర్థిక మాంద్యం భయాలు, ద్రవ్యోల్బణ పరిస్థితులు, క్రిప్టోలపై ఆసక్తి తగ్గడం వంటి కారణాల వల్ల ఎప్పటిలానే మరోసారి బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. 2023లో అంతర్జాతీయంగా బంగారం ధర 1670 డాలర్ల నుంచి 2000 డాలర్ల మధ్య కదలాడే అవకాశం ఉందని కోటాక్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, కమొడిటీ రీసెర్చ్‌ హెడ్‌ రవీంద్ర వి రావు అన్నారు. వచ్చే ఏడాది బంగారానికి స్థిరంగా డిమాండ్‌ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేశారు.

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు వల్ల వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో బంగారంపై ధర కొంత మేర తగ్గే అవకాశం ఉందన్నారు. అయితే, కొనసాగుతున్న ద్రవ్యోల్బణ భయాలు, భౌగోళిక పరిస్థితులు, ఫైనాన్షియల్‌ మార్కెట్లలో రిస్కుల కారణంగా భౌతిక బంగారానికి, గోల్డ్‌ బార్స్‌కు డిమాండ్‌ కొనసాగనుందని రావు అంచనా వేశారు. రేట్ల పెంపు విషయంలో చివరి దశకు చేరుకున్నప్పుడు గోల్డ్‌ ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్ల (EFT)పై పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి అంతర్జాతీయంగా పసిడి ధర 1885 డాలర్ల స్థాయికి, దేశీయంగా 10 గ్రాముల ధర రూ.57 వేలస్థాయికి చేరే అవకాశం ఉందని చెప్పారు. అంతర్జాతీయంగా ఏదైనా భౌగోళిక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా కట్టారు.

అంతర్జాతీయంగా బంగారం మళ్లీ 2000 డాలర్ల స్థాయికి చేరే అవకాశం లేనప్పటికీ.. రూపాయి విలువ కారణంగా దేశీయంగా బంగారం ధర గరిష్ఠ స్థాయి రూ.56,370ని దాటే అవకాశం ఉందని కామ్‌ట్రెండ్జ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ సీఈఓ జ్ఞానశేఖర్‌ త్యాగరాజన్‌ అన్నారు. వచ్చే ఏడాది తొలి అర్ధ భాగం వరకు బంగారం ధరలు స్థిరంగా ఉన్నా.. రెండో అర్ధభాగంలో డిమాండ్‌ పెరిగే అవకాశం ఉందని జెమ్‌ అండ్‌ జువెలర్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ మాజీ ఛైర్మన్‌, కామా జువెలర్స్‌ ఎండీ కొలిన్‌ షా అన్నారు. రేట్ల పెంపు నిలుపుదల వల్ల అంతర్జాతీయంగా బంగారం ధర 1900 నుంచి 1975 డాలర్ల స్థాయికి చేరుతుందని, దేశీయంగా పసిడి ధర రూ.55-57 వేల మధ్య కదలాడొచ్చని తెలిపారు. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ పరిస్థితులు తీవ్రం కావడం, కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలుకు మొగ్గు చూపడం వంటి పరిణామాల కారణంగా వచ్చే ఏడాది బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని