Updated : 11 Jun 2022 14:35 IST

బంగారం, స్థిరాస్తి లో ఏది మంచి పెట్టుబ‌డి?

బంగారం, స్థిరాస్తి రంగాలు రెండూ వాటి స్వంత పెట్టుబ‌డి విలువ‌ను క‌లిగి ఉన్నాయి. అయితే, పెట్టుబ‌డిదారులు పెట్టుబ‌డి సౌలభ్యత కి ప్రాధాన్య‌త‌నిస్తారు. ఈ రెండింటిలో ఏది పెట్టుబ‌డికి మంచి ఎంపిక అనేది ఇక్క‌డ చూద్దాం.

బంగారం, స్థిరాస్తి రెండూ భార‌తీయ పెట్టుబ‌డిదారుల‌కు బ‌ల‌మైన సెంటిమెంట్ విలువ‌ను క‌లిగి ఉన్నాయి, బ‌ల‌మైన విశ్వ‌స‌నీయ‌త‌, స్థిర‌మైన స్వ‌భావంతో ఉంటాయి. మ‌హిళ‌లు బంగారం పెట్టుబ‌డుల‌కు అధిక ప్రాధాన్య‌త‌నిస్తారు. బంగారాన్ని సాంప్ర‌దాయ‌మైన పెట్టుబ‌డిగా వీరు గుర్తిస్తారు. అంతే కాకుండా పండుగ‌లు, శుభ‌కార్యాలు జ‌రిగేట‌ప్పుడు బంగారాన్ని ఎంతో ముఖ్యమైన వ‌స్తువుగా ప‌రిగ‌ణిస్తారు. మ‌హిళ‌ల‌లో గ్రామీణ వాతావ‌ర‌ణంలో వారే కాకుండా, ప‌ట్ట‌ణాల్లో చ‌దువుకున్న వారు కూడా బంగారంపై ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌డం భార‌త్‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

అయితే భార‌త్‌లో పురుషులు బంగారంపై కాకుండా స్థిరాస్తి వైపు మొగ్గు చూపుతారు. దీనికి చాలా కార‌ణాలే ఉన్నాయి. స్వ‌త‌హాగా భార‌త్ వ్య‌వ‌సాయ ప్ర‌ధానమైన దేశం కావ‌డం చేత పురుషుల‌కు వివిధ పంట పొలాల‌పై ఆస‌క్తి ఉంటుంది. సంపాద‌న అనేది పురుష ల‌క్ష‌ణం అనేది భార‌త్‌లో న‌ర‌న‌రాన జీర్ణించుకు పోయిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఆ వ్య‌వ‌సాయ క్షేత్రాల ద‌గ్గ‌ర్నుంచి క్ర‌మంగా స్థిరాస్తి వైపుకు పురుషులు మొగ్గుచూప‌డానికి కార‌ణ‌మైంది. మ‌హిళ‌లు.. ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్రాంతాల తారాత‌మ్యం లేకుండా బంగారం మీద ఆస‌క్తి ఎలా చూపిస్తారో, పురుషులు కూడా గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రాంతాల వారు స్థిరాస్తి వైపుకే మొగ్గుచూపుతారు. అయితే నివాస నిర్మాణ ఇళ్ల‌పై స్త్రీ, పురుషులిద్ద‌రికి కూడా ఆస‌క్తి ఉండ‌టం భార‌త్‌లో సాధార‌ణ విష‌యం.

చాలా మంది బంగారు లోహాన్ని ఒక త‌రం నుండి మ‌రొక త‌రానికి బ‌దిలీ చేయ‌డం వ‌ల‌న భార‌తీయ కుటుంబాల‌కు బంగారం ఎల్ల‌ప్పుడూ ఇష్ట‌మైన పెట్టుబ‌డి సాధ‌నంగా ఉంది. బంగారానికి అతిపెద్ద ప్ర‌యోజ‌నం ఏమిటంటే, మీరు రూ. 1000 పెట్టాల‌న్నా, రూ. 1 కోటి పెట్టాల‌న్నా బంగారం అంద‌రికీ అందుబాటులో ఉంటుంది. పెట్టుబ‌డి ప‌రిమాణం లేదా మొత్తానికి అనువైన‌ది. అలాగే, బంగారం చాలా లిక్విడ్ (కావలసినప్పుడు నగదు లో మార్చుకునేలా)గా ఉంటుంది.

పెట్టుబ‌డి ప్ర‌యోజ‌నాలతో చూస్తే స్థిరాస్తి కూడా అధిక ప్ర‌యోజ‌నాల‌తో కూడిన‌దే. అయితే బంగారంతో పోలిస్తే స్థిరాస్తి రంగానికి పెద్ద మొత్తంలో నిధులు అవ‌స‌రం. కొనుగోలుదారుకు దీర్ఘ‌కాలం వేచి ఉండే ఓపిక కూడా చాలా అవ‌స‌రం. మీరు పెట్టుబ‌డి పెట్ట‌డానికి గ‌ణ‌నీయ‌మైన మొత్తాన్ని క‌లిగి ఉంటే, స్థిరాస్తి అనేది ప్ర‌స్తుతం ఆక‌ర్ష‌ణీయ‌మైన దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డి ఎంపిక‌గా ఉంది. ఇక్క‌డ ఆస్తి విలువ కాల‌క్ర‌మేణా పెరుగుతుంది. కాబ‌ట్టి స‌రైన మార్గంలో స‌రైన స్థిరాస్తిని కొనుగోలు చేసిన‌వారికి చాలావ‌ర‌కు ఈ రంగం అద్భుత‌మైన లాభాల‌ను అందించింది.

స్థిరాస్తి రంగం అద‌న‌పు ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌తో ఆదాయాన్ని సృష్టించే అవ‌కాశం ఉంది. నివాస‌, వాణిజ్య భ‌వ‌న‌మైన స్థిరాస్తి పెట్టుబ‌డిదారుల‌కు న‌గ‌దు రూపంలో నెల‌వారీ అద్దెల రూపంలో ఆదాయం వ‌స్తుంది. బంగారం పెట్టుబ‌డుల‌కు ఈ విధ‌మైన ఆదాయం రాదు. పెరుగుతున్న అద్దెల కార‌ణంగా స్థిరాస్తి రంగంలో 15% వ‌ర‌కు వార్షిక విలువ పెరుగుతుంద‌ని గ‌ణాంకాలు సూచిస్తున్నాయి. మార్కెట్‌, ఆర్ధిక వ్య‌వ‌స్థ‌లో మార్పుల కార‌ణంగా ఆస్తి విలువ కూడా పెరుగుతుంది.

స్థిరాస్తి అనేది అత్యంత స్థిర‌మైన పెట్టుబ‌డి ఎంపిక‌, ఇది త‌క్కువ న‌ష్టాల‌తో వ‌స్తుంది. ఆస్తిలో మీ భ‌విష్య‌త్తు ఉండ‌టం వ‌ల్ల మాన‌సిక‌, ఆర్ధిక సంతృప్తిని క‌లిగిస్తుంది. మ‌రోవైపు, బంగారం ఒక వ‌స్తువు, ఇది మార్కెట్‌లో వ‌ర్త‌కం చేయ‌బ‌డేదే అయినా, ఇది అధిక అస్థిర‌త‌, దొంగిలించ‌బ‌డే ప్ర‌మాదం క‌లిగి ఉంది. ఇంటి రుణం ద్వారా నివాస గృహాన్ని కొనుగోలు చేస్తే ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ఉంటే, బంగారాన్ని కొనుగోలు చేసేట‌ప్పుడు అలాంటి ప్ర‌యోజ‌నాలు ఏమి ఉండ‌వు.

బంగారం లో త‌రుగు, మ‌జూరీ లాంటి ఖ‌ర్చులు  కూడా ఉంటాయి. ఇవి తెలియ‌కుండా బంగారు వినియోగ‌దారునికి అధిక న‌ష్టాన్ని క‌లుగ‌చేస్తాయి. పెరుగుతున్న జ‌నాభాతో భూమికి డిమాండ్ పెరుగుతుంది. భూమిని సృష్టించ‌లేక‌పోవ‌డం వ‌ల్ల ఇది చివ‌రికి ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు దారితీస్తుంది. మ‌రోవైపు బంగారాన్ని డిజిట‌ల్ రూపంలో కూడా కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇలా దొంగిలించ‌బ‌డే ప్ర‌మాదాన్ని నివారించ‌గ‌లిగినా, కంటికి క‌నిపించ‌ని ఆస్తిగా మిగులుతుంది, బంగారాన్ని కొనుగోలు చేసిన సంతృప్తి ఉండ‌దు.

స్థిరాస్తి రంగం ఆర్ధిక వ్య‌వ‌స్థ‌కు స‌హాయం చేస్తుంది. స్థిరాస్తి రంగానికి పెద్ద మొత్తంలో నిధులు అవ‌స‌రం కావ‌చ్చు. కానీ చాలా రంగాల మ‌నుగ‌డ దానిపై ఆధార‌ప‌డి ఉంటుంది. రుణాలు ఇచ్చే సంస్థ‌లు, సిమెంట్‌, భ‌వ‌న మెటీరియ‌ల్స్‌, అనేక కార్మిక వ‌ర్గాల‌కు ప‌ని దొర‌క‌డం, ఇంకా అనేక రంగాల వారికి ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఈ రంగంపై ఆధార‌ప‌డి ఉంటారు. ఆర్ధిక వ్య‌వ‌స్థ‌కు పెద్ద మొత్తంలో ట‌ర్నోవ‌ర్ జ‌రుగుతుంది.

స్థిరాస్తి పెట్టుబ‌డి అనేది సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డి మాత్ర‌మే కాదు, మీరు దానికి అద్దె ఆస్తిగా ఉప‌యోగిస్తున్న‌ట్ల‌యితే ఇప్పుడు సాధార‌ణ ఆదాయాన్ని ఆర్జిస్తున్న‌ప్ప‌టికీ కొంత కాలం త‌ర్వాత మెరుగైన రాబ‌డిని పొందొచ్చు. ప‌న్ను ప్ర‌యోజ‌నం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల ఇది గొప్ప పెట్టుబ‌డి ఎంపిక‌. మీరు సంప‌ద, ఆస్తుల‌ను నిర్మించ‌డానికి దీన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు. వృద్ధాప్యంలో భ‌వ‌న ఆస్తి అద్దెల‌పై ఆధార‌ప‌డొచ్చు. కానీ బంగారం ఎంతున్నా దానిపై ఆధార‌ప‌డ‌లేము, దానికి నెల నెలా అద్దె రూపంలో ఎలాంటి వ‌సూళ్లు రావు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts