Gold Price: రూ.52 వేల మార్కు దాటిన బంగారం ధర

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న యుద్ధ సంక్షోభంతో పసిడి ధర పరుగులు పెడుతోంది. భారత్‌లో శుక్రవారం 10 గ్రాముల మేలిమి బంగారం రూ.52 వేల మార్కు దాటింది.

Updated : 04 Mar 2022 18:30 IST

దిల్లీ: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న యుద్ధ సంక్షోభంతో పసిడి ధర పరుగులు పెడుతోంది. భారత్‌లో శుక్రవారం 10 గ్రాముల మేలిమి బంగారం రూ.52 వేల మార్కు దాటింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో పుత్తడి విలువ 0.45 శాతం పెరిగి, 52,001కి చేరింది. వెండి అదే ఒరవడి కొనసాగించింది. కిలో వెండి విలువ రూ.68,279కి  పెరిగింది. 0.55 శాతం పెరుగుదల నమోదైంది. 

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 0.28 శాతం పెరిగి, 1,941 డాలర్లకు చేరుకుంది. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌పై రష్యా చేపడుతోన్న సైనిక చర్య మరింత తీవ్రం అవుతోంది. తాజాగా జాపోరిషియా అణు విద్యుత్ కేంద్రంపై దాడి, చమురు ధరలు.. స్టాక్‌మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. రూపాయి బలహీనపడుతోంది. ద్రవ్యోల్బణం, రాజకీయ అనిశ్చితి వంటి సందర్భాల్లో మదుపర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తుంటారు. ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా ముడి చమురు ధరలు భారీగా ఉన్నాయి. ఫలితంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసేందుకు రానున్న రోజుల్లో 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు పెంచుతామని అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ ప్రకటించింది. ఈ పరిణామాలు బులియన్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని