Gold price: భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ దూకుడు ఎప్పటి వరకు?

Gold price today: బంగారం ధర మరోసారి భారీగా పెరిగింది. బ్యాంకింగ్‌ రంగంలో చోటుచేసుకున్న వరుస పరిణామాలు పసిడిలో పెట్టుబడులకు కారణమవుతున్నాయి.

Updated : 20 Mar 2023 17:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బంగారం ధర (Gold price) మరోసారి భారీగా పెరిగింది. అంతర్జాతీయంగా ధర పెరగడంతో దేశీయంగానూ పసిడి ధరకు రెక్కలొచ్చాయి. సోమవారం దిల్లీ స్పాట్‌ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి (24k) బంగారం ధర (Gold price Today) ఒకే రోజు రూ.1400 పెరిగి రూ.61,100కు చేరింది. వెండి ధర సైతం రూ.1860 పెరిగి రూ.69,340కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 2005 డాలర్లు పలుకుతుండగా.. వెండి 22.55 డాలర్లుగా ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు.
Also Read: బంగారం ధరల్లో ఏమిటీ గందరగోళం?

ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలో పసిడికి భారీగా డిమాండ్‌ ఏర్పడింది. యుద్ధ పరిస్థితులు మదుపరులను తీవ్రంగా కలవరపెట్టాయి. దీంతో అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర గతేడాది మార్చిలో 2052 డాలర్లు పలికింది. గత కొంతకాలంగా పసిడి తగ్గుతూ వచ్చింది. ఈక్విటీ మార్కెట్లు రాణించడంతో బంగారం ధర దిగి వచ్చింది. ఇటీవల కాలంలో మార్చి 8 నాటికి 1818 డాలర్ల కనిష్ఠానికి చేరింది. ఫలితంగా దేశీయంగా 10 గ్రాముల పసిడి రూ.56-57వేల స్థాయికి చేరింది. ఇటీవల బ్యాంకింగ్‌ రంగంలో చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలు బంగారం ధరకు రెక్కలు రావడానికి కారణమయ్యాయి. అనూహ్యంగా పది రోజుల వ్యవధిలోనే పసిడి ధర రూ.56వేల స్థాయి నుంచి రూ.60వేల స్థాయికి చేరింది.
Also Read: బంగారం అంటే నగలే కాదు.. ఇవీ ఉన్నాయ్‌..!

ఎన్నాళ్లీ దూకుడు..?

ఎప్పుడైతే అమెరికాలో సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ ఎప్పుడైతే పతనం అయ్యిందో.. మదుపరుల్లో భయాలు మొదలయ్యాయి. దీనికితోడు రోజుల వ్యవధిలోనే సిగ్నేచర్‌ బ్యాంక్‌ మూతపడడం, స్విట్జర్లాండ్‌కు చెందిన క్రెడిట్‌ సూయిజ్‌ పతనావస్థకు చేరడం వంటి పరిణామాలు వారి భయాలను మరింత పెంచాయి. దీంతో అనిశ్చిత పరిస్థితులు సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారంవైపు మదుపరులు తమ పెట్టుబడులను మరలిస్తున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ స్పాట్‌ గోల్డ్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2000 డాలర్లను తాకింది. యూఎస్‌ గోల్డ్‌ ఫ్యూచర్‌ సైతం 2 శాతం పెరిగి 2012 డాలర్లకు చేరింది. అయితే, గత కొంత కాలంగా వడ్డీ రేట్లు పెంచుతూ వస్తున్న అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మరోసారి మంగళవారం సమావేశం కానుంది. వరుస బ్యాంకింగ్‌ పతనాల నేపథ్యంలో ఆచితూచి నిర్ణయం వెలువరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫెడ్‌ వెలువరించే రేట్ల నిర్ణయం బంగారం ధరకు దిశానిర్దేశం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ వార్త/ కథనం అవగాహన కోసం మాత్రమే. స్పాట్‌ మార్కెట్‌ ధరలను మాత్రమే ఇక్కడ ప్రస్తావించాం. అలాగే, ప్రాంతాన్ని బట్టి పసిడి ధరల్లో వ్యత్యాసం ఉండొచ్చు. మీ ప్రాంతంలో ఉన్న బంగారం ధర కోసం స్థానిక దుకాణదారుడిని సంప్రదించండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని