GDP: 2023లో నెమ్మదించనున్న భారత వృద్ధిరేటు: గోల్డ్‌మన్‌ శాక్స్‌

కరోనా సంక్షోభం నుంచి కోలుకున్న భారత ఆర్థిక వ్యవస్థకు అనేక సవాళ్లు అడ్డంకిగా మారాయని గోల్డ్‌మన్‌ శాక్స్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది వృద్ధిరేటు నెమ్మదించనుందని అంచనా వేసింది.

Published : 21 Nov 2022 14:51 IST

దిల్లీ: వచ్చే ఏడాదికి సంబంధించి భారత వృద్ధిరేటు అంచనాలను గోల్డ్‌మన్‌ శాక్స్‌ గ్రూప్‌ తగ్గించింది. అధిక వడ్డీరేట్లు, తగ్గిన వినియోగ గిరాకీ వంటి సవాళ్లతో.. కరోనా నుంచి వేగంగా కోలుకున్న ఫలాలు ఆవిరయ్యాయని పేర్కొంది. అందువల్లే వృద్ధి నెమ్మదించనుందని అంచనా వేసింది. 

ఈ ఏడాది భారత జీడీపీ 6.9 శాతంగా నమోదవుతుందని.. వచ్చే సంవత్సరానికి అది 5.9 శాతానికి తగ్గుతుందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా వేసింది. 2023 ప్రథమార్ధంలో వృద్ధి నెమ్మదిగా ఉంటుందని పేర్కొంది. కరోనా పునరుత్తేజ ఫలితాలు కనుమరుగవ్వడం, ద్రవ్య విధానాలను కఠినతరం చేయడం వినియోగ డిమాండ్‌పై ప్రభావం చూపుతుందని వివరించింది. ద్వితీయార్ధానికి వృద్ధి వేగం పుంజుకుంటుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి తిరిగి గాడినపడడం, ఎగుమతులు పుంజుకోవడం, పెట్టుబడులు తిరిగి రావడం అందుకు దోహదం చేస్తాయని తెలిపింది. 

కరోనా సంక్షోభం నుంచి 2021-22లో వేగంగా కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలిచిన విషయం తెలిసిందే. కానీ, ఈ ఏడాది ఆ జోరును కొనసాగించలేకపోయిందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ తెలిపింది. దీనికి అనేక సవాళ్లు అడ్డంకిగా మారాయని పేర్కొంది. యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్‌ కఠిన వైఖరి, అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక లోటు పెరగడం వంటి పరిణామాలు అడ్డంకిగా మారాయని తెలిపింది. ఇతర దేశాలతో పోలిస్తే డాలరుతో రూపాయి మారకం విలువ మెరుగ్గానే ఉందని పేర్కొంది. మరోవైపు ఈ ఏడాది ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉంటుందని.. వచ్చే ఏడాదికి అది 6.1 శాతానికి తగ్గుతుందని తెలిపింది. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు ఆర్‌బీఐ డిసెంబరులో మరో 50 బేసిస్‌ పాయింట్లు, ఫిబ్రవరిలో 35 బేసిస్‌ పాయింట్ల చొప్పున వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఫలితంగా రెపోరేటు 6.75 శాతం వరకు చేరుతుందని తెలిపింది. ప్రస్తుతం ఇది 5.9 శాతంగా ఉన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని