Google - CCI: సీసీఐ ఉత్తర్వులపై NCLATకు గూగుల్‌

Google approaches NCLAT: ఆండ్రాయిడ్‌ విషయంలో కాంపీటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన తీర్పుపై గూగుల్‌ ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించింది. తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తోంది.

Published : 23 Dec 2022 19:50 IST

దిల్లీ: కాంపీటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) ఉత్తర్వులపై ప్రముఖ సెర్చింజిన్‌ గూగుల్‌ (Google) అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ ఎన్‌సీఎల్‌ఏటీ (NCLAT)ని ఆశ్రయించింది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ విభాగంలో గుత్తాధిపత్యాన్ని గూగుల్‌ దుర్వినియోగం చేస్తోందంటూ కాంపీటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా గూగుల్‌పై రూ.1337.76 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అనైతిక వ్యాపార పద్ధతులను మానుకోవాలని సూచించింది.

ఈ అంశంపై ఎన్‌సీఎల్‌ఏటీలో సవాలు చేసినట్లు గూగుల్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. సీసీఐ నిర్ణయం భారత యూజర్లకు, వ్యాపారాలకు తీవ్రనష్టమని పునరుద్ఘాటించారు. దీనివల్ల ఆండ్రాయిడ్‌ సెక్యూరిటీ ఫీచర్ల విషయంలో రాజీ పడడంతో పాటు, మొబైల్‌ డివైజుల ధరలు పెరుగుతాయని పేర్కొన్నారు. యూజర్లు, భాగస్వామ్య పక్షాల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని, అందుకే ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించినట్లు తెలిపారు. ఆండ్రాయిడ్‌ వల్ల అటు భారత యూజర్లు, డెవలపర్లు, మొబైల్‌ తయారీ కంపెనీలు భారీగా లాభపడ్డాయని, భారత్‌ డిజిటల్‌ ప్రయాణంలో ఆండ్రాయిడ్‌ ఎంతగానో సాయపడిందని కంపెనీ తెలిపింది.

అయితే, సీసీఐ ఉత్తర్వులపై అప్పీల్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించిన గూగుల్‌.. ఆర్డర్‌పై స్టే విధించాలని కోరినట్లు తెలిసింది. ఆండ్రాయిడ్‌ వ్యాపార విభాగం వల్ల వినియోగదారులు, భాగస్వామ్య పక్షాల ప్రయోజనాలు కాకుండా గుత్తాధిపత్యాన్ని గూగుల్‌ దుర్వినియోగం చేస్తోందని నిరూపించడంలో సీసీఐ విఫలమవుతుందని ఆ కంపెనీ భావిస్తోంది. భారత్‌ మొబైల్‌ విభాగం వృద్ధిలో ఆండ్రాయిడ్‌ భాగస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్‌సీఎల్‌ఏటీ తమకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉందని కంపెనీ ఆశవహ దృక్పథంలో ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు