Google: డెస్క్‌ను షేర్‌ చేసుకోండి.. ఉద్యోగులకు గూగుల్‌ ఆదేశం.. ఎందుకంటే?

Google desk share Model: వ్యయ నియంత్రణలో భాగంగా గూగుల్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే డెస్క్‌ను ఇద్దరు ఉద్యోగులు వాడుకునేలా క్లౌడ్‌ విభాగంలో మార్పులు చేస్తోంది.

Updated : 24 Feb 2023 11:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యయ నియంత్రణలో భాగంగా గూగుల్‌ (Google) ఇప్పటికే భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు (Layoffs) ప్రకటించింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కార్యాలయాల నిర్వహణకు వెచ్చిస్తున్న వ్యయాన్ని సైతం తగ్గించుకునేందుకు సిద్ధమైంది. తక్కువ స్థలాన్ని సమర్థంగా ఉపయోగించుకొని ఎక్కువ ఉత్పాదకతను సాధించాలని నిర్ణయించింది. అందుకోసం ఉద్యోగులు తమ డెస్క్‌లను షేర్‌ చేసుకోవాలని ఆదేశించింది.

ఇకపై గూగుల్‌ (Google)లో ఒకే డెస్క్‌ను ఇద్దరు వాడుకోవాల్సి ఉంటుంది. మొదట దీన్ని గూగుల్‌ (Google) క్లౌడ్‌ విభాగంలో అమలు చేయనున్నారు. కిర్క్‌లాండ్‌, వాషింగ్టన్‌, న్యూయార్క్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, సియాటెల్‌, కాలిఫోర్నియా, సన్నీవేల్‌లో ఉన్న కార్యాలయాల్లో ఈ డెస్క్ షేరింగ్‌ మోడల్‌ వెంటనే అమల్లోకి రానుంది. అయితే, ఉద్యోగుల మధ్య ఇబ్బందులు లేకుండా గూగుల్‌ (Google) వారికి ఒక సూచన చేసింది. ప్రస్తుతం ఉద్యోగులు ఎలాగూ హైబ్రిడ్‌ మోడల్‌ (Hybrid Model)లో పనిచేస్తున్నారు. అంటే కొన్ని రోజులు ఆఫీసుకు వస్తున్నారు. మరికొన్ని రోజులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు మాట్లాడుకొని పరస్పర అంగీకారంతో ఒకరోజు ఒకరు.. మరోరోజు ఇంకొకరు ఆఫీసుకు రావాలని సూచించింది. ఉదాహరణకు సోమవారం ఒకరొస్తే.. మంగళవారం మరొకరు.. ఇలా సర్దుబాటు చేసుకోవాలని తెలిపింది.

అయితే, డెస్క్‌ అందుబాటులో లేని రోజు కూడా ఉద్యోగులు ఆఫీసుకి రావాలనుకుంటే రావొచ్చని గూగుల్‌ స్పష్టం చేసింది. అయితే, ఆరోజు వారు ఆఫీసులో ఉన్న ఏదైనా ఖాళీ స్థలంలో కూర్చొని పనిచేసుకోవాలని సూచించింది. ఈ కొత్త విధానాన్ని ‘గూగుల్‌ క్లౌడ్‌ ఆఫీస్‌ ఎవల్యూషన్‌’గా అభివర్ణించింది. ఒక డెస్క్‌ను రెండు వేర్వేరు విభాగాలకు చెందినవారు షేర్‌ చేసుకునేలా మార్పులు చేయనున్నట్లు పేర్కొంది. తద్వారా ఉద్యోగుల మధ్య ఎలాంటి ఇబ్బందుల తలెత్తవని చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని