Google: గూగుల్‌ బ్రౌజర్‌లోనూ చాట్‌జీపీటీ తరహా సేవలు..!

గూగుల్‌ నాలుగో త్రైమాసిక ఫలితాలపై కంపెనీ నిర్వహించిన సమావేశంలో సీఈవో సుందర్‌ పిచాయ్‌ గూగుల్ బ్రౌజర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  దీంతో గూగుల్ బ్రౌజర్‌ కొత్త పీచర్స్ ఎలా ఉండబోతున్నాయనే చర్చ ప్రారంభమైంది. 

Published : 03 Feb 2023 21:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత ఆరు నెలల కాలంగా సాంకేతిక రంగంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం చాట్‌జీపీటీ (ChatGPT). కృత్రిమమేధ (AI) ఆధారంగా పనిచేసే ఈ చాట్‌బోట్‌ (Chatbot) గూగుల్‌ (Google)కు గట్టిపోటీనిస్తుందని టెక్‌ వర్గాలు అభిప్రాయపతున్నాయి. మరోవైపు బ్రౌజింగ్ కోసం ఎక్కువ మంది గూగుల్‌కు బదులుగా చాట్‌జీపీటీని ఉపయోగించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారనే వాదనలు విపిస్తున్నాయి. మరోవైపు చాట్‌జీపీటీని మరింత అభివృద్ధి చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ (Microsoft) చాట్‌జీపీటీ మాతృ సంస్థ అయిన ఓపెన్‌ఏఐ (OpenAI)లో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఈ నేపథ్యంలో చాట్‌జీపీటీ తరహా సేవలపై గూగుల్ సీఈవో సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే గూగుల్ సెర్చ్‌ ఇంజిన్‌లో చాట్‌జీపీటీ తరహా సేవలను పరిచయం చేయనున్నట్లు తెలిపారు.

‘‘ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న వాటిలో ఏఐ ఎంతో కీలకమైన టెక్నాలజీ. త్వరలోనే గూగుల్ బ్రౌజర్‌లో కూడా ఏఐ ఆధారిత సేవలను యూజర్లకు పరిచయం చేయనున్నాం. దీంతో గూగుల్‌ యూజర్లు శక్తిమంతమైన, సరికొత్త ఏఐ ఆధారిత బ్రౌజర్‌ సేవలు పొందుతారు. దీంతోపాటు ఏపీఐ డెవలపర్స్‌ కోసం కొత్త టూల్స్‌ను తీసుకొస్తున్నాం. వాటితో డెవలపర్స్ సొంతగా అప్లికేషన్స్‌ను రూపొందించవచ్చు’’ అని సుందర్‌ పిచాయ్‌ కంపెనీ నాలుగో త్రైమాసిక ఫలితాలపై చర్చ సందర్భంగా వెల్లడించారు. చాట్‌జీపీటీ రాకతో గూగుల్ ఇబ్బందులు ఎదుర్కొంటుదనే వార్తల నేపథ్యంలో సుందర్‌ పిచాయ్‌ ప్రకటనతో టెక్ వర్గాల్లో గూగుల్‌ సేవలపై చర్చ మొదలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని