Google Layoffs: గూగుల్‌లో మరిన్ని తొలగింపులు.. సుందర్‌ పిచాయ్‌ సంకేతాలు!

Google Layoffs: ఆర్థిక అస్థిరతల నేపథ్యంలో టెక్‌ కంపెనీలన్నీ ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాయి. అందులో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గూగుల్ ఇప్పటికే 12 వేల మందిని తొలగించింది. మరికొంతమందినీ ఇంటికి పంపే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Updated : 13 Apr 2023 12:55 IST

వాషింగ్టన్‌: ఆర్థిక అస్థిరతల నేపథ్యంలో గూగుల్‌ (Google) వంటి దిగ్గజ సంస్థలు సైతం గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఖర్చుల్ని తగ్గించుకోవడం కోసం ఉద్యోగులను తొలగించడం అనివార్యమవుతోంది. ఇప్పటికే టెక్‌ దిగ్గజం గూగుల్‌ (Google) 12,000 మందిని జనవరిలో ఇంటికి పంపింది. అయినా, పరిస్థితులు ఇంకా చక్కబడిన సూచనలు కనిపించడం లేదు. దీంతో మరింత మంది ఉద్యోగులను తీసివేసేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా కంపెనీ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ దిశగా సంకేతాలిచ్చారు.

కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బాట్‌ బార్డ్‌, జీమెయిల్‌, గూగుల్‌ డాక్స్‌పై కీలక ప్రాజెక్టులు కొనసాగుతున్నట్లు పిచాయ్‌ (Sundar Pichai) తెలిపారు. వీటిలో ఇంకా చాలా పనిచేయాల్సి ఉందన్నారు. వీటిలో ఉన్న అవకాశాలకు తాము ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే తమ సిబ్బందిని అధిక ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టుల్లోకి తరలిస్తున్నామని పేర్కొన్నారు. కంపెనీలో జరుగుతున్న ప్రతి పనిని క్షుణ్నంగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఖర్చులను పునఃసమీక్షించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఫలితంగా కంపెనీ సామర్థ్యాన్ని మరో 20 శాతం పెంచాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆయన వ్యాఖ్యల్ని బట్టి చూస్తే త్వరలో గూగుల్‌ (Google) మరికొంత మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కంపెనీ ఉద్యోగుల్లో ఆరు శాతానికి సమానమైన 12,000 మందిని గూగుల్‌ (Google) జనవరిలో తొలగించింది. అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని అప్పట్లో సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) వెల్లడించారు. భారత్‌లో 450 మందిని ఇంటికి పంపారు. అయితే, ఫిబ్రవరిలో తొలగించిన ఈ 450 మంది 12,000 తొలగింపుల్లో భాగమా.. కాదా.. అనే విషయంపై మాత్రం ఇప్పటి వరకు స్పష్టత రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని