Google: ‘భవిష్యత్తును అంచనా వేయడం కష్టం’.. ఉద్యోగులతో సుందర్‌ పిచాయ్‌!

గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్‌ లేఆఫ్‌లు ప్రకటించనుందనే గత కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులతో కంపెనీ సీఈవో సుందర్‌ పిచాయ్‌ చెప్పిన మాటలు వీటికి మరింత బలం చేకూరుస్తున్నాయి.

Updated : 13 Dec 2022 19:47 IST

కాలిఫోర్నియా: మాంద్యం భయాలు వెంటాడుతున్న నేపథ్యంలో టెక్‌ కంపెనీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించాయి. ఇప్పటికే ట్విటర్‌ (Twitter), మెటా (meta), అమెజాన్‌ (Amazon) వంటి దిగ్గజ సంస్థలు ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించాయి. కొద్దిరోజులు క్రితం గూగుల్‌ (Google) సైతం పదివేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై ఆందోళనలో ఉన్న ఉద్యోగులు కంపెనీ సీఈవో సుందర్‌ పిచాయ్‌ (sundar pichai) వద్ద లేఆఫ్‌లపై స్పష్టత ఇవ్వాలని కోరగా భవిష్యత్తును ఊహించడం కష్టమని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. 

కంపెనీ ఇటీవల నిర్వహించిన సమావేశంలో పలువురు ఉద్యోగులు లేఆఫ్‌ల గురించి పిచాయ్‌ను ప్రశ్నించగా ఆయన వారికి భరోసా ఇవ్వలేదట. ‘‘భవిష్యత్తును అంచనా వేయడం చాలా కష్టం. నేను నిజాయితీగా మీ ముందు కూర్చుని భరోసా ఇవ్వలేను. క్రమశిక్షణతో కూడిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోక తప్పడంలేదు. రాబోయే ముప్పును ఎదుర్కొనేందుకు సరైన ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి. దానిపైనే దృష్టి సారించి, మనవంతు ప్రయత్నం చేయాలి భావిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించినట్లు ది ఇన్ఫర్మేషన్‌ అనే అమెరికన్‌ వార్తా సంస్థ పేర్కొంది. 

ఉద్యోగుల తొలగింపుపై ఇప్పటి వరకు గూగుల్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. రాబోయే రోజుల్లో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ (alphabet) మొత్తం ఉద్యోగుల్లో ఆరు శాతం మందిని తొలగించనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ అంచనాలకు అనుగుణంగా పనిచేయని ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలని పలు విభాగాల మేనేజర్లను కోరినట్లు సమాచారం. పనితీరు సరిగాలేని ఉద్యోగులను గుర్తించేందుకు గూగుల్ కొత్త మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను పరిచయం చేసినట్లు తెలుస్తోంది.  ఆ నివేదికల ఆధారంగా కొత్త సంవత్సరంలో తొలగింపులు ఉంటాయని వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఆల్ఫాబెట్‌లో సుమారు 1,87,000 మంది పనిచేస్తున్నారు. ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో రిక్రూట్‌మెంట్ ప్రక్రియను నెమ్మదించనున్నట్లు కంపెనీ ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో సుందర్‌ పిచాయ్‌ వ్యాఖ్యలు ఉద్యోగుల తొలగింపునకు మరింత బలం చేకూరుస్తున్నాయి.

ఇటీవల ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత మస్క్‌ కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. గత నెలలోనే సగానికి పైగా ఉద్యోగుల్ని ఎలాన్‌ మస్క్ (elon musk) తొలగించారు. మరోవైపు ఆయన జారీ చేసిన అల్టిమేటంతో దాదాపు మరో 1200 మంది రాజీనామా చేశారు. తాజాగా మరింత మందిని తొలగించేందుకు మస్క్‌ సిద్ధమవుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది. అయితే, ట్విటర్‌ భవిష్యత్‌పై తాను ఏమాత్రం ఆందోళనపడటం లేదని, అత్యుత్తమ ఉద్యోగులే తమతో ఉంటారని మస్క్‌ పేర్కొనడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు