Google: మెటా, అమెజాన్‌ బాటలో గూగుల్‌.. 10 వేల మందికి ఉద్వాసన!

టెక్‌ దిగ్గజ కంపెనీలు ఆర్థికభారాన్ని తగ్గించుకునే క్రమంలో ఉద్యోగుల తొలగింపును చేపడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ట్విటర్‌, మెటా, అమెజాన్‌ వంటి సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపాయి. ఇప్పుడు, గూగుల్ సైతం ఇదే బాటలో పయనిస్తోంది.

Published : 22 Nov 2022 20:17 IST

న్యూయార్క్‌: మాంద్యం భయాలు వెంటాడుతుండటంతో టెక్‌ దిగ్గజ కంపెనీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటున్నాయి. ఇందులో భాగంగా ట్విటర్‌, మెటా, అమెజాన్‌ సంస్థలు ఉద్యోగులను తొలగింపును చేపట్టాయి. తాజాగా గూగుల్ సైతం పది వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్‌ మొత్తం ఉద్యోగుల్లో ఆరు శాతం మందిని తొలగించాలని భావిస్తోందట. కంపెనీ అంచనాలను అనుగుణంగా పనితీరు కనబరచని ఉద్యోగులకు ముందుగా ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం. 

ఈ  ప్రక్రియలో భాగంగా మేనేజర్లు తమ టీమ్‌లోని సభ్యుల హోదా, పనితీరు మెరుగుదలపై నివేదిక పంపాలని అల్ఫాబెట్ కోరిందని కథనాలు వెలువడ్డాయి. ఈ  నివేదికల ఆధారంగా కొత్త సంవత్సరం నుంచి తొలగింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని సమాచారం. ఉద్యోగుల పనితీరును గుర్తించేందుకు గూగుల్ కొత్త మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను పరిచయం చేసినట్లు ది ఇన్ఫర్మేషన్‌ అనే అమెరికన్‌ పత్రిక ఒక కథనంలో పేర్కొంది. దీని ద్వారా మేనేజర్లు పనితీరు సరిగాలేని ఉద్యోగులను గుర్తించగలరని తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. మెరుగైన పనితీరు కనబరచని ఉద్యోగులను గూగుల్ తొలగించనుంది. 

ఉద్యోగుల తొలగింపు ప్రక్రియకు సంబంధించి అల్ఫాబెట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, కొద్ది నెలల క్రితం కంపెనీ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ఉద్యోగుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. త్రైమాసిక ఫలితాల్లో మెరుగుదల కనిపించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు, గత కొద్ది నెలలుగా గూగుల్ నియామకాలను సైతం నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని