Google: ఆ నిర్ణయంతో భారత్‌ కస్టమర్లకే నష్టం.. రూ.1,338 కోట్ల ఫైన్‌పై స్పందించిన గూగుల్‌

తమకు జరిమానా విధిస్తూ సీసీఐ తీసుకున్న నిర్ణయం భారతీయ వినియోగదారులు, వ్యాపారాలకే పెద్ద ఎదురు దెబ్బ అని గూగుల్‌ పేర్కొంది.

Updated : 21 Oct 2022 19:16 IST

దిల్లీ: గూగుల్‌(Google) తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) గురువారం భారీ జరిమానా విధించడంపై సెర్చింజిన్‌ దిగ్గజం స్పందించింది. సీసీఐ ఇచ్చిన తీర్పును సమీక్షించి తదుపరి మదింపు చర్యలు తీసుకుంటామని తెలిపింది. అలాగే, సీసీఐ తీసుకున్న నిర్ణయం భారతీయ వినియోగదారులు, వ్యాపారాలకే పెద్ద ఎదురు దెబ్బగా పేర్కొంది. పలు విపణుల్లో, ఆండ్రాయిడ్‌ మొబైల్‌ విభాగంలో గూగుల్‌ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని పేర్కొంటూ గూగుల్‌కు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) నిన్న రూ.1,337.76 కోట్లు జరిమానా విధించిన విషయం తెలిసిందే. 

అనైతిక వ్యాపార కార్యకలాపాలు ఇకపై మానుకోవాలని, నిర్దేశిత గడువులోగా తన ప్రవర్తన మార్చుకోవాలని కూడా సీసీఐ సూచించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం గూగుల్‌ తొలిసారి అధికారికంగా స్పందించింది. గూగుల్‌ ఆండ్రాయిడ్‌ ప్రతి ఒక్కరికీ అనేక ఎంపికల్ని సృష్టించిందని, భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వేలాది వ్యాపారాలు విజయవంతానికి మద్దతుగా నిలిచిందని తెలిపింది. సీసీఐ తీసుకున్న నిర్ణయం భారతీయ వినియోగదారులకు, వ్యాపారాలకు పెద్ద ఎదురు దెబ్బగా అభివర్ణించింది. ఆండ్రాయిడ్‌ సెక్యూరిటీ ఫీచర్లను విశ్వసించే భారతీయులకు ఇది తీవ్రమైన భద్రతా ప్రమాదాలకు ద్వారం తెరిచిందని.. భారతీయుల మొబైల్‌ డివైజ్‌ల ధరలు పెరిగేందుకు దారితీస్తుందని పేర్కొంటూ గూగుల్‌ అధికార ప్రతినిధి ఈ-మెయిల్ ప్రకటన విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు