Google Layoffs: గూగుల్‌లో 12వేల ఉద్యోగాల కోత

ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. అమెరికాలో ఉద్యోగులపై తక్షణమే ఈ ప్రభావం ఉండబోతోందని తెలిపింది.

Published : 20 Jan 2023 17:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెక్‌ కంపెనీల్లో ఉద్యోగ కోతల పర్వం కొనసాగుతోంది. మైక్రోసాఫ్ట్‌, మెటా, ట్విటర్‌, అమెజాన్‌ వంటి పెద్ద పెద్ద కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించగా.. తాజాగా ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్‌ (Google) మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ (Alphabet) సైతం భారీ సంఖ్యలో ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 12 వేల మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) ఉద్యోగులకు ఇ-మెయిల్‌ ద్వారా సమాచారమిచ్చారు. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ప్రతిభను, మూలధనాన్ని అధిక ప్రాధాన్యతల వైపు మళ్లించడంపై దృష్టి సారించాల్సిన సమమయం ఆసన్నమైందని అందులో పేర్కొన్నారు.

రిక్రూటింగ్‌, కార్పొరేట్‌ కార్యకలాపాలు, ఇంజినీరింగ్‌, ప్రొడక్ట్స్‌ టీమ్‌కు చెందిన విభాగాలతో పాటు ఇతర విభాగాల్లోనూ ఉద్యోగ కోతలు ఉండనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ కోతలు ఉండబోతున్నాయని, అమెరికాలో సిబ్బందిపై వెంటనే ఈ ప్రభావం ఉండనుందని ఆల్ఫాబెట్‌ తెలిపింది. అయితే, తదుపరి ఉపాధి చూసుకునే వారికి సాయం అందిస్తామని తెలిపింది.

అమెరికాలో ఉండే ఉద్యోగులకు 60 రోజుల పూర్తి నోటిఫికేషన్‌ కాలానికి వేతనం చెల్లించనున్నట్లు సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. పరిహార ప్యాకేజీ కింద 16 వారాల వేతనంతో పాటు గూగుల్‌లో పనిచేసిన కాలానికి గానూ ఏడాదికి రెండు వారాల చొప్పున వేతనం చెల్లించనున్నట్లు చెప్పారు. ఉద్యోగం కోల్పోయిన వారికి 2022కు సంబంధించి బోనస్‌తో పాటు వెకేషన్‌ టైమ్‌, ఆరు నెలల పాటు హెల్త్‌ కేర్‌, జాబ్‌ ప్లేస్‌మెంట్‌ సర్వీసులు, ఇమ్మిగ్రేషన్‌ సపోర్ట్‌ను అందించనున్నట్లు తెలిపారు. అమెరికా వెలుపల ఉన్న వారికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చెల్లింపులు, ఇతర ప్రయోజనాలు కల్పించనున్నట్లు పిచాయ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని