Google pay: గూగుల్‌ పేలో లోపం.. ఖాతాల్లోకి ₹80 వేలు..!

Google pay Error: అమెరికాలోని గూగుల్‌ పే సేవల్లో లోపం తలెత్తింది. దీంతో చాలా మందికి రివార్డుల రూపంలో భారీ మొత్తంలో నగదు జమ అయ్యింది.

Updated : 10 Apr 2023 15:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గూగుల్‌కు చెందిన పేమెంట్‌ యాప్‌ గూగుల్‌ పే (Google pay)లో ఒకప్పుడు భారీగా క్యాష్‌బ్యాక్‌లు వచ్చేవి. ఇప్పుడు మాత్రం చాలా మందికి ‘బెటర్‌ లక్‌ నెక్ట్స్‌టైమ్‌’ అనే సందేశమే వస్తూ ఉంటుంది. అలాంటిది స్క్రాచ్‌ చేసిన వారిలో కొందరికి రూ.80వేల వరకు ఖాతాల్లో జమ అయ్యాయి. గూగుల్‌ పేలో చిన్నపాటి లోపం కారణంగా ఈ విధంగా జరిగింది. అయితే ఇది జరిగింది భారత్‌లో కాదు.. అమెరికాలో!

గూగుల్‌ పేలో లోపం కారణంగా అమెరికాలోని కొందరు పిక్సల్‌ ఫోన్‌ యూజర్లకు భారీగా క్యాష్‌బ్యాక్‌లు (Google pay cashback) వచ్చాయి. 10 డాలర్లు మొదలుకొని కొందరికి 1000 డాలర్ల వరకు నగదు క్రెడిట్‌ అయ్యింది. ఈ విషయాన్ని కొందరు యూజర్లు రెడ్డిట్‌లో రాసుకొచ్చారు. తాను 16 లావాదేవీలు జరిపితే 10 లావాదేవీలకు క్యాష్‌బ్యాక్‌ వచ్చిందని ఓ యూజర్‌ తెలిపాడు. మరికొందరు తమకు 100 డాలర్లు వచ్చాయని పేర్కొనగా.. మరో యూజర్‌ తనకు 240 డాలర్లు వచ్చాయని పేర్కొన్నాడు.  ఇంకో యూజర్‌ ఏకంగా 1072 డాలర్లు వచ్చాయని తెలిపాడు. అంటే మన కరెన్సీ ప్రకారం రూ.80వేల పైమాటే!!

సోషల్‌ మీడియాలో ఈ విషయం వైరల్‌ కావడంతో మరికొంతమంది సైతం గూగుల్‌ పేలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.  అయితే, యాప్‌లోని లోపాన్ని గుర్తించిన గూగుల్‌ పే వెంటనే దాన్ని సరిచేసింది. యాప్‌లో సాంకేతిక పరమైన మార్పులు చేసే క్రమంలో ఈ లోపం తలెత్తినట్లు పలువురు పేర్కొంటున్నారు. అయితే, క్యాష్‌బ్యాక్ అందుకున్న యూజర్ల నుంచి గూగుల్‌ పే డబ్బులను వెనక్కి తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అప్పటికే సంబంధిత ఫండ్స్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసిన వారి విషయంలో మాత్రం ఏమీ చేయలేదని సమాచారం. భారత్‌లో యూపీఐ రూపంలో గూగుల్‌పే సేవలందిస్తుండగా.. అమెరికాలో మాత్రం వ్యాలెట్‌ సేవలందిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని