Bard: చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్‌ బార్డ్‌.. ఎలా పనిచేస్తుంది?

ChatGPT Vs Bard: చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్‌ బార్డ్‌ను సిద్ధం చేస్తోంది. దీన్ని LaMDA ఆధారంగా రూపొందించారు. అంతరిక్ష ఆవిష్కరణలను సైతం ఇది సులభంగా వివరిస్తుందని సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. 

Updated : 07 Feb 2023 17:25 IST

న్యూయార్క్‌: ఆన్‌లైన్‌ సమాచార శోధనలో ఏళ్లుగా గూగుల్‌ (Google) తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తాజాగా దీనికి చాట్‌జీపీటీ (ChatGPT) రూపంలో ముప్పు ముంచుకొచ్చింది. దీన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సుందర్‌ పిచాయ్‌ నేతృత్వంలోని గూగుల్‌ సిద్ధమవుతోంది. చాట్‌జీపీటీ (ChatGPT)తో కృత్రిమ మేధ (AI) రంగంలో మైక్రోసాఫ్ట్‌ తెరతీసిన యుద్ధానికి గూగుల్‌ (Google) సైతం తన అస్త్రశస్త్రాలతో సన్నాహాలు చేసుకుంటోంది. ‘బార్డ్‌ (Bard)’ పేరిట ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ను సిద్ధం చేస్తోంది.

అంతరిక్ష ఆవిష్కరణలను సైతం సులభంగా

ప్రస్తుతం బార్డ్‌ (Bard)ను విశ్వసనీయ టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సుందర్‌ పిచాయ్‌ సోమవారం ఓ బ్లాగ్‌ పోస్ట్‌లో తెలిపారు. ప్రయోగాత్మకంగా పరీక్షించిన తర్వాత ఈ ఏడాదిలోనే దీన్ని విస్తృత స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని వెల్లడించారు. క్లిష్టమైన అంతరిక్ష ఆవిష్కరణలను చిన్న పిల్లలకు సైతం బార్డ్‌ (Bard) చాలా సులభంగా అర్థమయ్యేలా వివరిస్తుందని గూగుల్ పేర్కొంది. విందు ఏర్పాటుకు కావాల్సిన ప్రణాళిక, ఇంట్లోని రిఫ్రిజిరేటర్‌లో ఉన్న కూరగాయల ఆధారంగా భోజనానికి ఏం వండుకోవచ్చు.. వంటి చిట్కాలను సైతం బార్డ్‌ (Bard) అందించగలుగుతుందని పేర్కొంది. ‘‘సృజనాత్మకత, ఉత్సుకతకు బార్డ్‌ (Bard) ఓ వేదికగా మారుతుంది’’ అని పిచాయ్‌ రాసుకొచ్చారు.

అప్రమత్తమై ‘అట్లాస్‌’తో పరుగులు..

చాట్‌జీపీటీ (ChatGPT)ని ఓపెన్‌ఏఐ అనే కృత్రిమ మేధ సంస్థ రూపొందించింది. ఓపెన్‌ఏఐలో మైక్రోసాఫ్ట్‌ 2019లోనే 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఇటీవల మరిన్ని నిధులను ఓపెన్‌ఏఐకి అందించనున్నట్లు ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన గూగుల్‌.. బార్డ్‌ (Bard)కు సంబంధించిన ప్రకటన చేసింది. తమ కంపెనీలో కృత్రిమ మేధపై పనిచేస్తున్న ఇంజినీర్లనూ అప్రమత్తం చేసింది. చాట్‌జీపీటీ (ChatGPT)కి పోటీనిచ్చేలా బార్డ్‌ (Bard) అభివృద్ధిని వేగవంతం చేయాలని సూచించింది. అట్లాస్‌ ప్రాజెక్టు పేరిట గూగుల్‌ ఈ బార్డ్‌ (Bard)ను తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం.

LaMDA ఆధారంగా...

బార్డ్‌ (Bard) అనేది చాట్‌జీపీటీ (ChatGPT) తరహాలోనే కృత్రిమ మేధ ఆధారిత ప్రయోగాత్మక సంభాషణా సేవ. దీన్ని ‘లాంగ్వేజ్‌ మోడల్‌ ఫర్‌ డైలాగ్‌ అప్లికేషన్‌ (LaMDA)’ ఆధారంగా రూపొందించారు. యూజర్లు అడిగిన ప్రశ్నలకు అంతర్జాలం నుంచి తాజా, నాణ్యతతో కూడిన సమాచారాన్ని అందిస్తుంది.

చాట్‌జీపీటీ, బార్డ్‌ మధ్య ప్రస్తుతానికి ఇదే తేడా..

చాట్‌జీపీటీ (ChatGPT)ని విజయవంతం చేయడానికి ఓపెన్‌ఏఐలోకి మైక్రోసాఫ్ట్‌ దాదాపు 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. దీన్ని బింగ్‌ సెర్చ్‌ ఇంజిన్‌కు అనుసంధానించే పనిలో ఉంది. దీనికి పోటీగానే బార్డ్‌ (Bard)ను తీసుకొచ్చారు. ప్రస్తుతం 2021 వరకు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగానే చాట్‌జీపీటీ (ChatGPT) సమాధానాలిస్తోంది. కానీ, బార్డ్‌ (Bard) మాత్రం ఆన్‌లైన్‌లో ఉన్న తాజా సమాచారాన్ని ఉపయోగించుకుంటోంది. ఇది బార్డ్‌కు అదనపు ప్రయోజనాన్ని చేకూర్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం చాట్‌జీపీటీ (ChatGPT) అందరికీ ఉచితంగానే అందుబాటులో ఉంది. చాట్‌జీపీటీ ప్లస్‌ పేరిట పెయిడ్‌ వెర్షన్‌ కూడా అందిస్తున్నారు. బార్డ్‌ మాత్రం ఇంకా కొంత మందికే అందుబాటులోకి వచ్చింది. అందరూ దీన్ని ఉపయోగించుకునేందుకు ఇంకా కొంత సమయం పట్టొచ్చు.

ఇదీ చదవండి: గూగులమ్మకు కొత్త గుబులు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని