Google: ఫిఫా ఫైనల్ వేళ.. గూగుల్‌ సరికొత్త రికార్డ్‌

ఉత్కంఠభరింతంగా సాగిన సాకర్‌ ప్రపంచకప్‌ తుది పోరును ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులు వీక్షించారు. ఈ మ్యాచ్‌ కోసం గూగుల్‌లో తెగ వెతికేశారట. దీంతో గూగుల్‌ 25 ఏళ్లలో అత్యధికంగా సెర్చ్‌ ట్రాఫిక్‌ను నమోదు చేసింది.

Published : 19 Dec 2022 13:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌ (FIFA World cup 2022)లో ఫ్రాన్స్‌ (France)ను ఓడించి అర్జెంటీనా (Argentina) జగజ్జేతగా అవతరించింది. ఈ మెగా టోర్నీలో సాకర్‌ మాంత్రికుడు లియొనెల్‌ మెస్సీ (Lionel Messi), ఫ్రాన్స్‌ స్టార్‌ ఆటగాడు ఎంబాపె (Kylian Mbappe) సరికొత్త రికార్డులు సృష్టించారు. అయితే, వీరిద్దరే కాదండోయ్‌.. సాకర్‌ తుది సమరం వేళ ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ (Google) కూడా రికార్డు బద్దలుకొట్టింది. తన 25 ఏళ్ల చరిత్రలోనే అత్యధిక సెర్చ్‌ ట్రాఫిక్‌ను నమోదు చేసింది. ఈ విషయాన్ని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ స్వయంగా వెల్లడించారు.

ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌ పోరుపై సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) ట్విటర్‌లో స్పందించారు. ‘‘ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌ సమయంలో గూగుల్‌ సెర్చ్‌లో తెగ వెతికేశారు. గత 25 ఏళ్లలో అత్యధిక సెర్చ్‌ ట్రాఫిక్‌ రికార్డ్‌ ఇదే. యావత్‌ ప్రపంచం కేవలం ఒకే ఒక్క దాని (Fifa Worldcup) కోసం వెతికినట్లుంది’’ అని ఆయన రాసుకొచ్చారు. ఇక నిన్నటి ఫైనల్‌ మ్యాచ్‌.. అత్యుత్తమ ఆటల్లో ఒకటిగా నిలిచిందని కొనియాడారు. మెస్సి (Messi) చాలా గొప్పగా ఆడారని ప్రశంసించారు.

ఈ ఏడాది ఫిఫా ప్రపంచకప్‌లో మెస్సి అరుదైన ఘనత సాధించాడు. ఓ ప్రపంచ కప్‌లో గ్రూప్‌ దశ, ప్రిక్వార్టర్స్‌, క్వార్టర్స్‌, సెమీస్‌, ఫైనల్స్‌లో గోల్‌ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అంతేగాక, ఫిఫా టోర్నీల్లో ఉత్తమ ఆటగాడిగా రెండు సార్లు బంగారు బంతి అందుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఇక ఫ్రాన్స్‌ స్టార్‌ ప్లేయర్‌ ఎంబాపె.. ఫైనల్‌లో ఏకంగా మూడు గోల్స్‌ చేసి ఆశ్చర్యపర్చాడు. ఇప్పటి వరకు జరిగిన ఫిఫా(FIFA) ప్రపంచకప్‌లలో.. ఫైనల్ మ్యాచ్‌లో మూడు గోల్స్‌ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

ఇదిలా ఉండగా సాకర్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించారు. దీంతో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఫిఫా, మెస్సి, అర్జెంటీనా, ఎంబాపె పేర్లు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇక ఫిఫా ప్రపంచకప్‌లో భారత జట్టు లేనప్పటికీ మన దేశంలో ఈ టోర్నీకి వీక్షకాదరణ ఎక్కువగానే ఉంది. ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా శోధించిన వాటిల్లో ఫిఫా ప్రపంచకప్‌ మూడో స్థానంలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని