Google vs CCI: సీసీఐ ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు గూగుల్‌?

సీసీఐ ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్‌ చేసేందుకు గూగుల్‌ సిద్ధమైంది. ఎన్‌సీఎల్‌ఏటీలో చుక్కెదురైన నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చింది.

Published : 05 Jan 2023 21:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆండ్రాయిడ్‌ మొబైల్‌ విభాగంలో కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్‌ చేసేందుకు గూగుల్‌ (Google) సిద్ధమవుతోంది. సీసీఐ ఉత్తర్వులు అమలు కాకుండా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఒక్కటే తన ముందు ఉన్న  మార్గంగా ఆ కంపెనీ భావిస్తోంది. సీసీఐ విధించిన రూ.1337 కోట్ల అపరాధ రుసుముపై మధ్యంతర స్టే విధించడానికి జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (NCLAT) నిరాకరించించిన నేపథ్యంలో ఆ కంపెనీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

సీసీఐ ఉత్తర్వుల అమలుకు జనవరి 19 వరకు మాత్రమే గడువు ఉండడంతో గూగుల్‌ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తోందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి వెల్లడించారు. సీసీఐ ఇచ్చిన ఆదేశాల్లో కొన్నింటిని అమలు చేయడం సాధ్యం కాదని గూగుల్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో సవాలు చేయడం మినహా మరో మార్గం లేదని ఆ కంపెనీ భావిస్తోంది. 

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ విషయంలో గూగుల్‌ తన ఆధిపత్య హోదాను భారత్‌లో గూగుల్‌ దుర్వినియోగం చేసిందన్నది సీసీఐ ఆరోపణ. ఇందుకు గానూ రూ.1337 కోట్ల అపరాధ రుసుము విధించింది. అనైతిక వ్యాపార పద్ధతులు మానుకోవాలని సూచించింది. దీనిపై ఎన్‌సీఎల్‌ఏటీని గూగుల్‌ ఆశ్రయించగా.. అక్కడా చుక్కెదురైంది. జరిమానా మొత్తంలో 10 శాతాన్ని డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని