Loan Apps: నకిలీ రుణ యాప్‌లకు గూగుల్‌ చెక్‌.. ప్లేస్టోర్‌ విధానం మరింత పటిష్ఠం

Loan Apps: నకిలీ రుణయాప్‌లకు చెక్‌ పెట్టేలా గూగుల్‌ తమ ప్లే స్టోర్‌ విధానాన్ని మరింత పటిష్ఠం చేసింది. దీన్ని ౨౦౨౩ మే ౩౧ నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

Published : 06 Apr 2023 19:30 IST

దిల్లీ: భారత్‌లో నకిలీ రుణ యాప్‌ (Loan Apps)ల బెడద పెరిగిపోతున్న నేపథ్యంలో గూగుల్‌ (Google) కీలక నిర్ణయం తీసుకుంది. వీటికి చెక్‌ పెట్టేలా తమ యాప్‌స్టోర్‌ పాలసీని మరింత పటిష్ఠం చేసింది. ఇకపై ఎవరైనా గూగుల్‌ ప్లే స్టోర్‌ (Google play store)లో లోన్ యాప్‌లను ఉంచాలనుకుంటే వారు సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు 2023 మే 31 నుంచి అమల్లోకి రానున్నాయి.

కొత్త పాలసీలో భాగంగా పర్సనల్‌ లోన్‌ యాప్‌ (Loan Apps)లు ఇకపై ఫొటోలు, వీడియోలు, డివైజ్‌ లొకేషన్‌, కాల్‌ లాగ్స్‌ వంటి యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి వీలుండదని గూగుల్‌ (Google) తెలిపింది. అలాగే పర్సనల్‌ లోన్‌ యాప్‌ డిక్లరేషన్‌ను ఇవ్వాలని తెలిపింది. అందుకు సంబంధించిన పత్రాలను కూడా సమర్పించాలని కోరింది. ఉదాహరణకు ఎవరికైనా లోన్‌లు ఇవ్వడానికి ఆర్‌బీఐ నుంచి అనుమతి ఉంటే దానికి సంబంధించిన పత్రాలను డిక్లరేషన్‌తో పాటు అందజేయాల్సి ఉంటుంది. ఒకవేళ నేరుగా రుణాలు ఇవ్వకుండా ఏదైనా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు మధ్యవర్తిగా ఉంటే.. ఆ విషయాన్ని డిక్లరేషన్‌లో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది.

అలాగే యాప్‌ను ప్లే స్టోర్‌లో పబ్లిష్‌ చేయడానికి అనుమతి కోరేటప్పుడు గూగుల్ ప్లే కన్సోల్‌లో యాప్‌ కేటగిరీని ‘ఫైనాన్స్‌’గా ఎంపిక చేసుకోవాలని గూగుల్‌ తెలిపింది. ఇవన్నీ సమర్పించిన తర్వాత వాటిని సమీక్షించడానికి గూగుల్‌కు దాదాపు వారం రోజులు పట్టే అవకాశం ఉంటుందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని