
Google-Airtel: భారత్‌లో గూగుల్ మరో భారీ ఒప్పందం!
దిల్లీ: భారత్‌లోని ప్రముఖ టెలికాం కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించిన ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్.. మరో భారీ ఒప్పందానికి సిద్ధమైంది. దేశీయ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌లో వచ్చే అయిదేళ్లలో గూగుల్ రూ.7,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ‘భారత్‌లో డిజిటలీకరణ నిధుల కోసం గూగుల్’ అనే కార్యక్రమం కింద ఈ నిధులు వెచ్చించనుంది.
భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన ఒక్కో షేరును రూ.734తో కొనుగోలు చేసేందుకు గూగుల్ 700 మిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు పెట్టనుంది. మొత్తం పెట్టుబడుల్లో మరో 300 మిలియన్ డాలర్లు.. ఎయిర్టెల్ ద్వారా వినియోగదారులకు నవ కల్పనలతో ఆధునిక మొబైల్ పరికరాలు, ఇతర ఆఫర్లను అందుబాటులోకి తెచ్చేందుకు వెచ్చిస్తుంది. డిజిటల్ వ్యవస్థను అందరికీ అందుబాటులోకి తెవడంలో భాగంగానే గూగుల్ ఈ నిధులను వెచ్చించనున్నట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.
భారీ వ్యూహాత్మక లక్ష్యాల సాధనలో భాగంగా ఆధునిక వ్యవస్థలతో 5జీ, ఇతర ప్రమాణాలను అందుబాటులోకి తెచ్చి ఓ నెట్‌వర్క్‌ను సృష్టించేందుకు గూగుల్‌తో కలిసి పని చేస్తామని ఎయిర్టెల్ తెలిపింది. భారత్‌లో డిజిటల్ వ్యవస్థను మరింత విస్తరించేందుకు గూగుల్‌తో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు భారతీ ఎయిర్ టెల్ ఛైర్మన్ సునీల్ భారతి మిత్తల్ వెల్లడించారు. గూగుల్ ఇప్పటికే రిలయన్స్ జియోలో రూ.33,737 కోట్ల పెట్టుబడులు పెట్టింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.