IMEI మోసాలకు కేంద్రం చెక్‌.. మొబైల్‌ కంపెనీలకు కీలక ఆదేశాలు!

పోయిన, దొంగిలించిన స్మార్ట్‌ఫోన్లతో పాల్పడే మోసాలకు చెక్‌పెట్టే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్‌ తయారీ కంపెనీలు ప్రతి మొబైల్‌ IMEIని ప్రత్యేక పోర్టల్‌లో (https://icdr.ceir.gov.in) నమోదు చేయాలని ఆదేశించింది.

Published : 27 Sep 2022 19:20 IST

దిల్లీ: పోయిన, దొంగిలించిన స్మార్ట్‌ఫోన్లతో పాల్పడే మోసాలకు చెక్‌పెట్టే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్‌ తయారీ కంపెనీలు ప్రతి మొబైల్‌ IMEIని ప్రత్యేక పోర్టల్‌లో (https://icdr.ceir.gov.in) నమోదు చేయాలని ఆదేశించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి దేశీయంగా మొబైళ్లు విక్రయించే అన్ని సంస్థలూ తప్పనిసరిగా ఈ పని పూర్తి చేయాలని సూచించింది. మొబైల్‌ను విక్రయించే ముందే నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది.

దేశంలో ఏటా కోట్ల కొలదీ మొబైళ్లు విక్రయమవుతున్నాయి. అయితే, వీటిలో కొన్ని డూప్లికేట్‌, నకిలీ IMEI నంబర్లతో వస్తున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన ఈ నిబంధన వల్ల IMEI మోసాలకు చెక్‌ పడనుంది. దీనివల్ల డిజిటల్‌గా IMEI కలిగిన డివైజ్‌ను సులువుగా గుర్తించడం వీలు పడుతుంది. వ్యక్తుల ఫోన్లు దొంగతనానికి గురైనా, పోగొట్టుకున్న సందర్భంలో సైతం వారి ఫోన్లు దుర్వినియోగం కాకుండా బ్లాక్‌ చేసుకునే వీలు కలుగుతుంది. దీనివల్ల స్మార్ట్‌ఫోన్ల బ్లాక్‌ మార్కెటింగ్‌ను సైతం అరికట్టేందుకు వీలు కలుగుతుంది.

దేశంలో ఒకే IMEI నంబర్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్లను గుర్తించిన సంఘటనలు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌ IMEI నంబర్‌ని మార్చి విక్రయిస్తున్న ముఠాలను పోలీసులు గతంలో అరెస్ట్‌ చేశారు. ఇప్పటి వరకు IMEI నంబర్లను నమోదు చేసే వ్యవస్థ ఏదీ లేదు. దీంతో ఈ నంబర్‌ను ఉపయోగించుకుని చేసే మోసాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మన ఫోన్‌లో ఈ నంబర్‌ తెలుసుకోవాలంటే *#06# టైప్‌ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ స్మార్ట్‌ఫోన్‌లో రెండు సిమ్‌లు ఉంటే రెండు వేర్వేరు IMEI నంబర్లు ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని