PMJJBY: పీఎం జీవన్‌జ్యోతి, సురక్ష బీమా ప్రీమియం పెంపు

పీఎమ్‌జేజేబీవై ప్రీమియంను రూ. 330 నుంచి రూ. 436 కి, పీఎమ్ఎస్‌బీవై ప్రీమియంను రూ. 12 నుంచి రూ. 20 కి పెంచారు

Updated : 01 Jun 2022 14:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్ర ప్ర‌భుత్వం పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను స‌హితం బీమా ప‌రిధిలోకి తీసుకురావాల‌నే ల‌క్ష్యంతో ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలే ప్ర‌ధాన మంత్రి జీవ‌న్ జ్యోతి బీమా యోజ‌న (పీఎమ్‌జేజేబీవై), ప్ర‌ధాన మంత్రి సుర‌క్షా బీమా యోజ‌న (పీఎమ్ఎస్‌బీవై). అయితే, తాజాగా ఈ పాల‌సీల‌ ప్రీమియంను పెంచుతున్న‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించింది. పీఎమ్‌జేజేబీవై ప్రీమియంను రూ.330 నుంచి రూ. 436కి, పీఎమ్ఎస్‌బీవై ప్రీమియంను రూ.12 నుంచి రూ. 20కి పెంచారు.

ప్ర‌ధాన మంత్రి జీవ‌న్ జ్యోతి బీమా యోజ‌న: పీఎమ్‌జేజేబీవై వార్షిక జీవిత బీమా ప‌థ‌కం. ఒక సంవ‌త్స‌రం క‌వ‌రేజ్‌తో వ‌స్తుంది. ప్ర‌తి ఏడాది జూన్ 1 నుంచి ప్రారంభ‌మై మే 31తో ముగిస్తుంది. ఆ త‌ర్వాత ఏడాది ప్రీమియం చెల్లించి పాల‌సీని పునరుద్ధ‌రించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆటో-డెబిట్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ పాలసీ తీసుకున్న వ్య‌క్తి ఏ కారణంచేత‌నైనా మ‌ర‌ణిస్తే.. రూ.2 లక్షల బీమా పరిహారం అందిస్తుంది. గుర్తింపు పొందిన బ్యాంకుల్లో పొదుపు ఖాతా ఉన్న 18 నుంచి 50 ఏళ్ల లోపు వ్యక్తులు దీనికి అర్హులు. ఈ పథకంలో కొత్తగా చేరితే.. నమోదు చేసిన 45 రోజుల తర్వాత మాత్రమే బీమా వర్తిస్తుంది. దురదృష్టవశాత్తూ ఎవరైనా చనిపోతే వారి నామినీలు 30 రోజుల్లోగా పాలసీ ఉన్న బ్యాంకు శాఖను సంప్రదించి క్లెయిమ్‌ కోసం దాఖలు చేసుకోవ‌చ్చు.

ప్ర‌ధాన మంత్రి సుర‌క్షా బీమా యోజ‌న: పీఎమ్ఎస్‌బీవై ప్ర‌మాద బీమా ప‌థ‌కం. అంటే బీమా చేసిన వ్య‌క్తి ప్ర‌మాదవ‌శాత్తు మ‌ర‌ణించినా లేదా వైక‌ల్యం పొందినా హామీ మొత్తాన్ని అందిస్తారు. గుర్తింపు పొందిన బ్యాంకుల్లో పొదుపు ఖాతా ఉన్న 18-70 ఏళ్ల వ్యక్తులు ఈ పాలసీని తీసుకోవచ్చు. ప్రమాదంలో పాలసీదారుడు మరణిస్తే రూ.2 లక్షలు, శాశ్వత వైకల్యం ఏర్పడితే రూ.1 లక్ష చెల్లిస్తారు. ఇది కూడా వార్షిక బీమానే. ప్ర‌తీ ఏడాది పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ప్ర‌తి సంవ‌త్స‌రం మే 25 నుంచి మే 31 మ‌ధ్య ఆటో-డెబిట్ ఆప్ష‌న్ ద్వారా పాల‌సీదారుని బ్యాంకు పొదుపు ఖాతా నుంచి ప్రీమియంను డిడ‌క్ట్ చేస్తారు. 

మార్చి 31, 2022 నాటికి పీఎమ్‌జేజేబీవై కింద 6.40 కోట్ల మంది, పీఎమ్ఎస్‌బీవై కింద 22 కోట్ల మంది న‌మోదు చేసుకున్నారు. పీఎమ్ఎస్‌బీవై ప్రారంభ‌మైన నాటి నుంచి రూ. 1,134 కోట్లు ప్రీమియం వ‌సూలు కాగా, క్లెయిమ్‌ల రూపంలో రూ. 2,513 కోట్లు చెల్లించారు. అలాగే పీఎమ్‌జేజేవై కింద రూ.9,737 కోట్ల ప్రీమియం సేక‌రించ‌గా, క్లెయిమ్ రూపంలో రూ.14,144 కోట్లు చెల్లించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని