EVల సబ్సిడీలో కోత..? ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహన ధరలు పెరిగే ఛాన్స్‌..!

FAME-2 subsidy: విద్యుత్‌ ద్విచక్ర వాహనాలపై ఇస్తున్న సబ్సిడీకి కేంద్రం కోత పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే విద్యుత్‌ వాహనాల ధరలు పెరిగే అవకాశం ఉంది.

Updated : 18 May 2023 18:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విద్యుత్‌ వాహనాల (Electric vehicles) కొనుగోలుపై సబ్సిడీ అందించే ఫేమ్‌-2 (FAME-2 ) పథకం గడువు పొడిగిస్తారా? లేదా? అన్న సందేహాలు నెలకొన్న వేళ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా ముందడుగు వేస్తోంది. ప్రస్తుతం విద్యుత్‌ ద్విచక్ర వాహనాలపై ఇస్తున్న వడ్డీ సబ్సిడీకి (subsidy) కోత పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదే గనుక జరిగితే ప్రస్తుతం విద్యు్‌త్‌ ద్విచక్ర వాహనాలపై ఇచ్చే సబ్సిడీ తగ్గి.. వాటి ధరలకు రెక్కలు రానున్నాయి.

విద్యుత్‌ ద్విచక్ర వాహనాలపై ప్రభుత్వం ప్రస్తుతం వాహన ధరలో గరిష్ఠంగా 40 శాతం సబ్సిడీ ఇస్తోంది. దీన్ని 15 శాతానికి కుదించాలని కేంద్రం భావిస్తోంది. దీనికి తోడు ప్రస్తుతం కిలోవాట్‌కు ఇస్తున్న రూ.15వేల సబ్సిడీని సైతం రూ.10వేలకు కుదించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనివల్ల పథకం కోసం కేటాయించిన నిధులను మరిన్ని వాహనాలకు సబ్సిడీ ఇచ్చేందుకు వీలు పడుతుందన్నది కేంద్రం ఆలోచనగా ఉంది. ఇప్పటి వరకు 5.63 లక్షల విద్యుత్‌ ద్విచక్ర వాహనాలు ఫేమ్‌-2 పథకం కింద సబ్సిడీ పొందాయి. ఇప్పుడిస్తున్న స్థాయిలోనే సబ్సిడీ కేటాయిస్తూ పోతే రానున్న రెండుమూడు నెలల్లోనే ఈ పథకానికి కేటాయించిన నిధులు నిండుకుంటాయని అధికారులు చెప్తున్నారు.

ఒకవేళ సబ్సిడీలో ప్రభుత్వం కోత పెడితే.. విద్యుత్‌ ద్విచక్ర వాహనాల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు 3.5 KW బ్యాటరీ కలిగిన ఓ విద్యుత్‌ వాహనం ధర రూ.1.50 లక్షలు అనుకుంటే.. కిలోవాట్‌కు రూ.15వేలు చొప్పున 40 శాతం సబ్సిడీ మినహాయిస్తే.. రూ.52,500 సబ్సిడీ రూపంలో లభిస్తుంది. అదే సబ్సిడీ మొత్తాన్ని 15 శాతానికి కుదించి.. కిలోవాట్‌కు చెల్లించే మొత్తం రూ.10వేలకు తగ్గిస్తే.. రూ.22,500 మాత్రమే సబ్సిడీ రూపంలో లభిస్తుంది. దీంతో ఆ మేర విద్యుత్‌ వాహన ధరలు ప్రియం కానున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని