Whatsapp: వాట్సాప్‌ అంతరాయంపై నజర్‌.. వివరాలు కోరిన భారత ప్రభుత్వం

వాట్సాప్‌ సేవల్లో అంతరాయం ఏర్పడడంపై భారత ప్రభుత్వం దృష్టి సారించింది. సేవల్లో అంతరాయానికి గల కారణాలను తెలియజేయాలని వాట్సాప్‌నకు సూచించింది.

Updated : 27 Oct 2022 13:50 IST

దిల్లీ: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ సేవల్లో (Whatsapp outage) ఈ నెల 25న అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. భారత్‌ సహా పలు దేశాల్లో దాదాపు 2 గంటల పాటు సేవలు నిలిచిపోయాయి. ఆ సమయంలో సందేశాలు పంపడం వీలు పడలేదని, వెబ్‌ వాట్సాప్‌ కూడా కనెక్ట్‌ కాలేదని యూజర్లు ఫిర్యాదు చేశారు. కొంత సమయం తర్వాత సమస్య పరిష్కారమైంది. గతంలోనూ పలుమార్లు వాట్సాప్‌ సేవల్లో అంతరాయం ఏర్పడినప్పటికీ.. ఈ స్థాయిలో సమస్య తలెత్తడం ఇదే తొలిసారి. కలిగిన అసౌకర్యానికి గానూ వాట్సాప్‌ క్షమాపణ సైతం చెప్పింది. కానీ, అందుకు గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు.

ఈ వ్యవహారంపై తాజాగా భారత ప్రభుత్వం దృష్టి సారించింది. సేవల్లో అంతరాయానికి గల కారణాలను తెలియజేయాలని వాట్సాప్‌ను వివరణ కోరింది. సాంకేతిక సమస్య కారణంగా అంతరాయం ఏర్పడిందా? సైబర్‌ ఎటాక్‌ ఏమైనా జరిగిందా? అన్న కోణంలో వాట్సాప్‌ నుంచి ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) వివరణ కోరినట్లు తెలిసింది. భారత్‌కు చెందిన కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (Cert-in)తో సమన్వయం చేసుకుంటూ అంతరాయానికి గల కారణాలను అన్వేషించాలని సూచించింది. వాట్సాప్‌ వివరణ కోరిన విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ సైతం ధ్రువీకరించారు. వారంలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు తెలిసింది. భారత్‌లో దాదాపు 50 కోట్ల మందికి పైగా వాట్సాప్‌ వినియోగదారులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని