Data centres: డేటా సెంటర్లకు మౌలిక వసతుల హోదా

దేశీయంగా అన్ని రంగాల్లో డిజిటలీకరణ ఊపందుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డేటా నిల్వ కేంద్రాలకు మౌలిక వసతుల హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 13 Oct 2022 17:42 IST

దిల్లీ: డేటా నిల్వ కేంద్రాలకు మౌలిక వసతుల హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5 మెగావాట్ల కంటే అధిక ఐటీ లోడ్‌ ఉన్న సంస్థలకు ఈ హోదా ఇవ్వనున్నట్లు అక్టోబరు 11న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అన్ని రంగాల డిజిటలీకరణ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.

ఇ-కామర్స్‌, ఎడ్‌టెక్‌, డిజిటల్‌ లావాదేవీలు అనూహ్యంగా పెరుగుతున్నందున, మనదేశంలో డేటా కేంద్రాలకు అధిక సామర్థ్యం కావాల్సి వస్తోంది. డేటా సెంటర్లకు మౌలిక సదుపాయాల హోదా కల్పించడం వల్ల, పరిశ్రమ విస్తరణకు అవసరమైన నిధులు సులువుగా సమీకరించే అవకాశం కలుగుతుంది. విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ) తీసుకోవచ్చు. బాగా తక్కువ వడ్డీ రేటుకు దీర్ఘకాలిక నిధులు లభిస్తాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ)ని ఆకర్షించే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రతిపాదించిన డిజిటల్‌ యూనివర్సిటీలు, డిజిటల్‌ బ్యాంకులు, డిజిటల్‌ కరెన్సీలు కార్యరూపం దాలిస్తే.. డిజిటల్‌ లావాదేవీలు భారీగా పెరుగుతాయి. ‘భారత్‌నెట్‌’ ద్వారా ఓఎఫ్‌సీ (ఆప్టికల్‌ ఫైబర్‌  కేబుల్‌) లైన్లను దేశవ్యాప్తంగా ప్రతి గ్రామీణ, పట్టణానికి వేయగలిగితే ఎంతో పెద్ద డిజిటల్‌ వ్యవస్థ ఆవిష్కృతమవుతుంది. దీంతో డేటా నిల్వ అవసరాలు అనూహ్యంగా పెరుగుతాయి.

వచ్చే ఐదేళ్లలో భారత్‌లోని డేటా సెంటర్లలో దేశీయ, విదేశీ కంపెనీల పెట్టుబడులు రూ.1.20 లక్షల కోట్లకు పెరుగుతాయని ఇక్రా నివేదిక ఇటీవల తెలిపింది. దేశీయ కంపెనీలైన హీరానందానీ గ్రూప్‌, అదానీ గ్రూప్‌.. విదేశీ సంస్థలైన అమెజాన్‌, ఎడ్జ్‌కనెక్స్‌, మైక్రోసాఫ్ట్‌, క్యాపిటాల్యాండ్‌, మంత్రా గ్రూప్‌ మన దేశ డేటా సెంటర్లలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న కంట్రోల్‌ఎస్‌, ఎన్‌క్ట్రా, ఎస్‌టీటీ ఇండియా తమ సామర్థ్యాలను గణనీయంగా విస్తరిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని