LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓకి సమయం ఆసన్నమైందా? ఫెమాలో మార్పులు అందుకేనా?

ఎల్‌ఐసీలో ఆటోమేటిక్‌ మార్గంలో 20 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(FDI)కు మార్గం సుగమం చేస్తూ ‘విదేశీ మారకద్రవ్య చట్టం (FEMA)’లో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది...

Published : 17 Apr 2022 21:31 IST

దిల్లీ: ఎల్‌ఐసీలో ఆటోమేటిక్‌ మార్గంలో 20 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(FDI)కు మార్గం సుగమం చేస్తూ ‘విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (FEMA)’లో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని మంత్రిమండలి ఎల్‌ఐసీలో ఎఫ్‌డీఐలకు అనుమతిస్తూ ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దానికి అనుగుణంగా గత నెల 14న ‘డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (DPIIT)’ ఎఫ్‌డీఐ విధానంలో మార్పులు చేసింది.

డీపీఐఐటీ చేసిన మార్పులు అమల్లోకి రావాలంటే ఫెమాలో సవరణలు చేయాల్సి ఉంటుంది. ఎల్‌ఐసీలోకి 20 శాతం వరకు ఎఫ్‌డీఐలను అనుమతిస్తున్నట్లు ఫెమా చట్టంలో ఓ పేరాను చేర్చారు. ప్రస్తుత ఎఫ్‌డీఐ విధానం ప్రకారం.. ప్రభుత్వ అనుమతి మార్గంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విదేశీ పెట్టుబడులకు 20 శాతం వరకు పరిమితి ఉంది. ఇపుడు ఎల్‌ఐసీ, తదితర చట్టబద్ధ కార్పొరేట్‌ సంస్థల్లోనూ 20 శాతం వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతికి వీలు కల్పించినట్లయింది. ఎఫ్‌డీఐ నిధులు మరింతగా రావడానికి, సులభతరంగా వ్యాపారం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని ఆ వర్గాలు చెబుతున్నాయి.

ఫెమాలో సవరణల నేపథ్యంలో మే నెల ప్రారంభంలోనే ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూకు రావొచ్చని తెలుస్తోంది. అందుకే ప్రభుత్వం కావాల్సిన ప్రక్రియలన్నింటినీ వేగంగా పూర్తిచేస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐపీఓ ద్వారా 5 శాతం కంటే ఎక్కువ వాటాను విక్రయానికి ఉంచవచ్చని సమాచారం. తద్వారా షేర్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఐసీఓ ద్వారా నిధులను సమీకరించడానికి ఇప్పటికే సెబీ నుంచి ఎల్‌ఐసీ అనుమతులు పొందిన విషయం తెలిసిందే. ఎల్‌ఐసీ దాఖలు చేసిన ముసాయిదా పత్రాల (డీఆర్‌హెచ్‌పీ) ప్రకారం.. 31 కోట్ల షేర్లను ప్రభుత్వం విక్రయించనుంది.  సెబీ వద్ద మళ్లీ తాజాగా ముసాయిదా సమర్పించకుండా.. ఐపీఓకు రావడానికి మే 12 వరకు ప్రభుత్వానికి సమయం ఉంది. ఒకవేళ విక్రయ వాటాను పెంచాలనుకుంటే మరోసారి తాజా సమాచారంతో సంస్థ సెబీని ఆశ్రయించాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని