Mobile Towers: 500 రోజులు.. ₹26,000 కోట్లు.. 25,000 టవర్లు!

దేశవ్యాప్తంగా వచ్చే 500 రోజుల్లో 25 వేల టవర్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. దానికి కావాల్సిన రూ.26 వేల కోట్ల నిధుల మంజూరుకు ఆమోదం తెలిపింది.

Published : 04 Oct 2022 14:35 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా 25,000 మొబైల్‌ టవర్ల ఏర్పాటుకు కావాల్సిన రూ.26,000 కోట్ల నిధుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన నిధుల్ని ‘యూనివర్సల్‌ సర్వీసెస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌’ నుంచి ఇవ్వనున్నట్లు టెలికాం శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ టవర్ల ఏర్పాటు ప్రక్రియను ‘భారత్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌’ చేపట్టనుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సోమవారం ముగిసిన ‘రాష్ట్రాల ఐటీ మంత్రుల డిజిటల్‌ ఇండియా సమావేశం’లో ప్రకటించారు. వచ్చే 500 రోజుల్లో దీన్ని పూర్తిచేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా అన్ని రాష్ట్రాల ఐటీశాఖ మంత్రులు పాల్గొన్నారు.

దేశంలో 5జీ సేవలు ఇటీవలే అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తొలుత ఎయిర్‌టెల్‌ 8 ప్రధాన నగరాల్లో ఈ సేవల్ని ప్రారంభించింది. దీపావళి కల్లా రిలయన్స్‌ జియో సైతం నాలుగు మెట్రో నగరాల్లో 5జీ సేవల్ని తమ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. అందుకోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, వీటిని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు మౌలిక వసతులను వేగంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దీనికోసం పెద్ద ఎత్తున మూలధన పెట్టుబడి అవసరమవుతుందుని నిపుణులు చెప్పారు. మరోవైపు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ వచ్చే ఏడాది ఆగస్టు నాటికి 5జీ సేవలు అందించేందుకు సిద్ధమవుతోందని సీఎండీ పీకే పూర్వార్‌ సోమవారం ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌లో వెల్లడించారు. ఈ నవంబరు నుంచి 4జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించి, క్రమంగా వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి 5జీ సేవలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని