Air tickets: విమాన టికెట్‌ ధరలు.. విమానయాన సంస్థలకు కేంద్రం సూచన

కొన్ని రూట్లలో విమాన టికెట్‌ ధరలు పెరగడం పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. టికెట్ల పెరగకుండా ఒక మెకానిజం ఉండాలని ఆయా సంస్థలకు సూచించింది.

Published : 05 Jun 2023 21:07 IST

దిల్లీ: విమాన టికెట్ల ధరలు అమాంతం పెరగడంపై కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. టికెట్ల ధరల కోసం ఒక యంత్రాంగాన్ని రూపొందించాలని విమానయాన సంస్థలకు సూచించింది. ముఖ్యంగా గోఫస్ట్‌ నడిచిన రూట్లలో ఈ టికెట్‌ ధరలు అధికంగా ఉండడం గుర్తించింది. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థల ప్రతినిధులతో పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా సోమవారం సమావేశమయ్యారు. కొన్ని రూట్లలో టికెట్‌ ధరలు పెరుగుదల అంశాన్ని భేటీలో ప్రస్తావించారు.

ముఖ్యంగా గోఫస్ట్‌ విమానయాన సంస్థ గతంలో నడిచిన రూట్లలో విమాన టికెట్ల ధరలు అధికంగా ఉండడాన్ని సింథియా సమావేశంలో చర్చించారు. టికెట్‌ ధరలను సంస్థలే పర్యవేక్షించుకోవాలని సూచించారు. హై ఆర్‌బీడీ (రిజర్వేషన్‌ బుకింగ్‌ డిజిగ్నేటర్‌- టికెట్ల రిజర్వేషన్‌కు ఉపయోగించే పద్ధతి)కి లోబడి ఈ మెకానిజం ఉండాలని సూచించారు. దీన్ని డీజీసీఏ పర్యవేక్షిస్తుందన్నారు. అలాగే, ప్రకృతి విపత్తులు, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మానవతా దృక్పథంతో టికెట్‌ ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని విమాన సంస్థలకు సూచించారు. ఇందుకు ఒడిశా ఘటనను ఉదహరించారు. 

విమానయాన టికెట్‌ ధరలు అనేవి ప్రభుత్వ నియంత్రణలో ఉండవు. ధరల పెరుగుదల అనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇదే విషయాన్ని మార్చిలో జ్యోతిరాదిత్య సింథియా లోక్‌సభలో తెలియజేశారు. టికెట్‌ ధరలను రూపొందించడం గానీ, వాటిని నియంత్రించండం గానీ ప్రభుత్వం చేయదని చెప్పారు. అంతర్జాతీయంగా అనుసరిస్తున్న పద్ధతులను విమానయాన సంస్థలు పాటిస్తాయని చెప్పారు. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా టికెట్ల ధరలను ఎయిర్‌లైన్‌ సంస్థలు నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. డిమాండ్‌, సీజన్‌, ఇతర మార్కెట్‌ పరిస్థితులు అనుగుణంగా టికెట్ల ధరలు అనేవి ఆధారపడి ఉంటాయని లోక్‌సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డిమాండ్‌ అధికంగా ఉండడంతో టికెట్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికంటూ ఓ మెకానిజం ఉండాలని మంత్రి సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు