Common charger: ఛార్జర్‌ సమస్యలకు చెక్‌.. ఇకపై ఒకే రకం ఛార్జర్‌!

Common charger:  స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్లెట్‌ ఇలా.. గ్యాడ్జెట్‌ ఏదైనా ఒకటే ఛార్జర్‌ ఉండాలంటోంది కేంద్రం.

Updated : 15 Aug 2022 14:47 IST

దిల్లీ: గ్యాడ్జెట్లు కొత్త రూపు సంతరించుకుంటున్నా.. వాటికి ఉపయోగించే ఛార్జర్ల సమస్య మాత్రం ఇప్పటికీ పోలేదు. ఒక కంపెనీ టైప్‌-సి పోర్ట్‌ ఇస్తే.. మరో కంపెనీ యూఎస్‌బీ పోర్ట్‌ అంటుంది. ఒకరు బాక్సులో ఛార్జర్‌ అందిస్తే.. మరొకరు సపరేట్‌గా కొనాలంటారు. దీనివల్ల వినియోగదారుడి చేతి చమురు వదలడమే కాకుండా పెద్ద ఎత్తున ఈ-వేస్టేజ్‌ పేరుకుపోతోంది. ఇలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం కామన్‌ ఛార్జర్‌ విధానం తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్లెట్‌ ఇలా.. గ్యాడ్జెట్‌ ఏదైనా ఒకటే ఛార్జర్‌ ఉండాలంటోంది. ఇందుకోసం ఆగస్టు 17న కీలక సమావేశానికి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. మొబైల్‌ తయారీ కంపెనీలు, ఆయా రంగంతో సంబంధం ఉన్న సంస్థలు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు ఆ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. వినియోగదారుడిపై భారం తగ్గించడంతో పాటు ఈ-వేస్టేజ్‌ను అరికట్టడంలో భాగంగా సమావేశానికి పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు.

ఛార్జర్ల సమస్యకు చెక్‌ పెడుతూ ఇటీవల యూరోపియన్‌ యూనియన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న ఎలక్ట్రానిక్‌ పరికరాల కోసం కంపెనీలన్నీ విధిగా టైప్‌-సి పోర్ట్‌ కలిగిన ఛార్జింగ్‌ ప్రమాణాలను పాటించాలని సూచించింది. 2024ను దీనికి గడువుగా నిర్దేశించింది. అమెరికాలో సైతం ఇలాంటి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాణాలను భారత్‌లో సైతం పాటించే దిశగా ఈ సమావేశం నిర్వహించనున్నట్లు సీనియర్‌ అధికారి తెలిపారు. స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్లెట్‌కు కామన్‌ ఛార్జర్‌ ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన తెలిపారు. ఈ విధానం అమలు చేయకపోతే పాతబడిపోయిన ఛార్జర్లన్నీ మూలన పడేయడం మినహా ఏమీ చేయడానికి ఉండదని తెలిపారు. ప్రస్తుతం పలు మొబైల్‌ కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌తో పాటు బాక్సులో ఛార్జర్‌ ఇవ్వడం లేదు. పైగా ఆ పోర్ట్‌ ఉన్న ఫోన్‌ను మాత్రమే కొనుగోలు చేయాలని సూచిస్తున్నాయి. ఇది వినియోగదారుడికి భారం అవుతోంది. కామన్‌ ఛార్జర్‌ తీసుకొస్తే భారం తగ్గడంతో పాటు ఛార్జర్‌ కష్టాలకు తెరపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని