Windfall tax: విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ రూ.1900 నుంచి రూ.5050కి పెంపు!

మార్చి 31తో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరంలో విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ (windfall tax) ద్వారా రూ.25వేల కోట్లు వసూలు కానున్నట్లు ఇటీవలే సీబీఐసీ ఛైర్మన్‌ వివేక్‌ జోహ్రి తెలిపారు.

Published : 05 Feb 2023 12:48 IST

దిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై విధించే అదాటు పన్ను (windfall tax)ను ప్రభుత్వం పెంచింది. డీజిల్‌, విమాన ఇంధనం (ATF) ఎగుమతిపై విధించే సుంకాన్ని సైతం పెంచుతున్నట్లు ప్రకటించింది. టన్ను చమురుపై అదాటు పన్ను (windfall tax)ను రూ.1,900 నుంచి రూ.5,050కు పెంచింది. ఎగుమతి చేసే లీటర్‌ డీజిల్‌పై పన్నును రూ.5 నుంచి రూ.7.5కు సవరించింది. లీటర్‌ విమాన ఇంధనంపై రూ.3.5 నుంచి రూ.6కు పెంచింది. ఫిబ్రవరి 4 నుంచే కొత్త పన్నులు అమల్లోకి వచ్చాయి.

గత నెల అదాటు పన్ను (windfall tax), డీజిల్‌, ఏటీఎఫ్‌పై విధించే ఎగుమతి సుంకం కనిష్ఠానికి చేరాయి. తాజా పెంపుతో అవి మళ్లీ ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గడంతో జనవరి 17న ప్రభుత్వం ఈ పన్నులను తగ్గించింది. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో పన్నులు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మార్చి 31తో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరంలో విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ (windfall tax) ద్వారా రూ.25వేల కోట్లు వసూలు కానున్నట్లు ఇటీవలే సీబీఐసీ ఛైర్మన్‌ వివేక్‌ జోహ్రి తెలిపారు. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురు, డీజిల్‌, ఏటీఎఫ్‌ ఎగుమతులపై గతేడాది జులై 1 నుంచి పన్ను విధిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా 15 రోజులకోసారి వీటిని సవరిస్తున్నారు. ఎగుమతుల వల్ల కంపెనీలు అదనపు లాభాలు పొందుతున్న నేపథ్యంలో ఈ పన్నులను తీసుకొచ్చారు. గతేడాది ఎక్సైజ్‌ సుంకంలో కోత విధించడం ద్వారా ఏర్పడిన లోటును కూడా ఈ ఆదాయం ద్వారా భర్తీ చేసుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని