ONDC: ప్రభుత్వ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం వచ్చేసింది.. తొలుత బెంగళూరు వాసులకు అవకాశం!

ONDC now in Bengaluru: ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వంటి ఇ-కామర్స్‌ వేదికలకు దీటుగా చిన్న వ్యాపారులకు మేలు చేకూర్చే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ సేవలు బెంగళూరులో అందుబాటులోకి వచ్చాయి.

Updated : 30 Sep 2022 19:43 IST

బెంగళూరు: ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వంటి ఇ-కామర్స్‌ వేదికలకు దీటుగా చిన్న వ్యాపారులకు మేలు చేకూర్చే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ONDC) సేవలు ప్రారంభమయ్యాయి. బెంగళూరులోని 16 పిన్‌కోడ్స్‌లో ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. బీటా టెస్టింగ్‌లో భాగంగా ప్రజలు ఈ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకునే సదుపాయాన్ని కల్పించారు. వారి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా దేశవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ప్రస్తుతం ఓఎన్‌డీసీ ద్వారా నిత్యావసర సరకులు, రెస్టారెంట్స్‌ విభాగాల్లో బెంగళూరు వాసులు సేవలను పొందొచ్చు. ఈ రెండు విభాగాల్లో తమకు నచ్చిన అప్లికేషన్‌ను వినియోగదారులు ఎంపిక చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మైస్టోర్‌, పేటీఎం, స్పైస్‌ మనీ యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. త్వరలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, ఐటీసీ స్టోర్‌, కోటక్‌ బ్యాంక్‌, మ్యాజిక్‌ పిన్‌, మైక్రోసాఫ్ట్‌, ఫోన్‌ పే, జోహో వంటి యాప్స్‌ సైతం ఇందులో చేరనున్నాయి.

ఏమిటీ ఓఎన్‌డీసీ?

దేశీయ ఇ-కామర్స్‌ విపణిలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌దే హవా. కొవిడ్‌ పరిణామాలతో నిత్యావసరాల కోసం కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇవ్వడం పెరిగింది. దీంతో కిరాణ షాపుల భవితవ్యం అనిశ్చితిలో పడుతోందని గుర్తించిన కేంద్రం.. చిన్న దుకాణదారులు కూడా ఆన్‌లైన్‌లో విక్రయాలు నిర్వహించడానికి వీలుగా ఓ వేదిక ఉండాలని సంకల్పించింది. ప్రధాని మోదీ సూచన మేరకు నందన్‌ నీలేకని, నేషనల్‌ హెల్త్‌ అథారిటీ సీఈఓ ఆర్‌ఎస్‌ శర్మతో సహా 9 మంది సభ్యుల సలహా సంఘం ఓఎన్‌డీసీ పేరిట లాభాపేక్షలేని ఈ ఫ్లాట్‌ఫాంను రూపొందించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో లాభాపేక్ష రహితంగా పనిచేసే ఈ ప్లాట్‌ఫాంను ట్రేడర్లు, వినియోగదార్లు వినియోగించుకోవచ్చు. సబ్బు నుంచి విమాన టికెట్ల వరకు ఏదైనా విక్రయించుకోవచ్చు, కొనుగోలు చేయవచ్చు. దిల్లీ, బెంగళూరు, భోపాల్, షిల్లాంగ్, కోయంబత్తూర్‌ నగరాల్లో ఈ నెట్‌వర్క్‌ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించారు. తాజాగా బెంగళూరులో బీటా టెస్టింగ్‌ చేపట్టారు.



Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts