Budget 2022: బంగారం విషయంలో కేంద్రం నిర్ణయం.. కొత్తగా గోల్డ్‌ సేవింగ్స్‌ అకౌంట్స్‌..?

గోల్డ్‌ సేవింగ్స్‌ అకౌంట్స్‌ను తీసుకురావాలని కేంద్రం యోచిస్తోందని సమాచారం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌లో ఈ మేరకు ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated : 25 Jan 2022 16:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వివాహం అయినా.. ఇతర ఏ శుభకార్యమైనా బంగారం ఉండాల్సిందే. మన సంస్కృతి, సంప్రదాయాల్లో పసిడి అంతగా అంతర్భాగమైపోయింది. కేవలం ఆభరణంగానే కాదు.. సురక్షిత పెట్టుబడి సాధనంగానూ భావించి చాలా మంది దీంట్లో పెట్టుబడి పెడుతుంటారు. అందుకే భారత్‌ ఏటా టన్నులకొద్దీ బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీనివల్ల కరెంట్‌ ఖాతా లోటు పెరుగుతోంది. దీనికి విరుగుడుగా.. గతంలో సార్వభౌమ పసిడి పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. అయినా సరే బంగారానికి ఏమాత్రం డిమాండ్‌ తగ్గలేదు. ఒకవేళ పన్నులు పెంచి పసిడి కొనుగోళ్లకు అడ్డుకట్టవేద్దామంటే.. బంగారం స్మగ్లింగ్‌ ఉదంతాలు పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్రం మరో కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. కొత్తగా గోల్డ్‌ సేవింగ్స్‌ అకౌంట్స్‌ను తీసుకురావాలని యోచిస్తోందని సమాచారం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌లో ఈ మేరకు ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఏమిటీ గోల్డ్‌ సేవింగ్స్‌ అకౌంట్స్‌?

సార్వభౌమ పసిడి పథకం లాంటిదే గోల్డ్‌ సేవింగ్స్‌ అకౌంట్స్‌. కాకపోతే గోల్డ్‌ బాండ్స్‌లో పెట్టుబడి పెట్టాలంటే కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అదే సేవింగ్స్‌ అకౌంట్స్‌ అయితే రోజూ అందుబాటులో ఉంటుంది. గ్రాము బంగారానికి సమాన మొత్తంలో నగదును బ్యాంకులోని గోల్డ్‌ సేవింగ్స్‌ అకౌంట్స్‌లో మదుపు చేయొచ్చు. గ్రాము నుంచి ఎంత వరకైనా ఇందులో డిపాజిట్‌ చేయొచ్చు. తిరిగి నగదును ఉపసంహరించుకునేటప్పుడు ఆ రోజు ధర ఆధారంగా బ్యాంకులు చెల్లింపులు చేస్తాయి. దీనికి పాస్‌బుక్‌ కూడా జారీ చేస్తారు. ఈ ఖాతాలోని డిపాజిట్లపై గోల్డ్‌ బాండ్స్‌ తరహాలోనే 2.5 శాతం చొప్పున వడ్డీని బ్యాంకులు చెల్లిస్తాయని సమాచారం.

మేలెంత..?
బంగారం కొనుగోలు చేయడం ఒకెత్తయితే... దాన్ని భద్రపరచుకోవడం మరో ఎత్తు. చాలా మంది బంగారాన్ని పెట్టుబడిగా భావించి కొనుగోలు చేసినప్పటికీ దొంగల బారి నుంచి రక్షించుకోవడానికి బ్యాంక్‌ లాకర్లను ఆశ్రయిస్తుంటారు. పైగా బంగారు ఆభరణాల కొనుగోలు విషయంలో మేకింగ్‌ ఛార్జీలు, పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి బాదరబందీ లేకుండా కేవలం పెట్టుబడి సాధనంగా ఉపయోగించుకోవాలనుకునే వారికి ఈ ఖాతాలు ఉపయోగపడతాయి. పైగా మూలధనంపై వచ్చే లాభంపై ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం ఉండదని తెలుస్తోంది.

ధరల నిర్ణయమే సమస్య..!

సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ కొనుగోలు సమయంలో ఆర్‌బీఐ గ్రాముకు ఇంత అని ధర నిర్ణయిస్తుంది. బాండ్ల జారీ సమయంలో ఉండే సగటు ధర ఆధారంగా ధరను నిర్ణయిస్తుంది. బాండ్ల సబ్‌స్క్రిప్షన్‌ సమయంలో బంగారం ధరలో మార్పు వచ్చినా అదే ధరకు కొనుగోళ్లకు అనుమతిస్తారు. అయితే, గోల్డ్‌ సేవింగ్స్ అకౌంట్స్‌ విషయంలో అలా కాదు. ఇక్కడ ఏ రోజుకారోజు ధర నిర్ణయించాల్సి ఉంటుంది. పైగా దేశంలో నగరానికీ నగరానికీ మధ్య బంగారం ధరలో వ్యత్యాసం ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎలా ముందడుగు వేస్తుందో చూడాలి..! దీంతో పాటు డిజిటల్‌ గోల్డ్‌కు సంబంధించిన విధివిధానాలను కూడా ఈ బడ్జెట్‌లోనే ప్రకటించే అవకాశం ఉంది.

దిగుమతి సుంకం తగ్గింపు ఉండేనా...?

బంగారం విషయంలో కేంద్రం ముందున్న మరో సవాల్‌.. దిగుమతి సుంకం తగ్గింపు. 2004లో 2 శాతంగా ఉన్న కస్టమ్స్‌ డ్యూటీని 2013లో యూపీఏ ప్రభుత్వం 10 శాతానికి పెంచింది. ఆ తర్వాత 2019లో మోదీ ప్రభుత్వం 12.5 శాతానికి పెంచింది. దిగుమతి సుంకం పెంచడం వల్ల బంగారం అక్రమ రవాణా పెరుగుతుండడం కేంద్రానికి తలనొప్పి వ్యవహారంగా మారింది. ఈ నేపథ్యంలో గతేడాది బడ్జెట్‌లో ఏకంగా ఐదు శాతం మేర పన్నును తగ్గించింది. దీంతో కస్టమ్స్‌ సుంకం 7.5 శాతానికి చేరింది. అయితే, 3 శాతం జీఎస్టీ, సెస్సులు, సర్‌ఛార్జీలు కలుపుకొంటే పన్ను మొత్తం 10.75 శాతానికి చేరడంతో వినియోగదారుడికి ఒనగూరిన ప్రయోజనం అంతంతే. అయితే, ఈ సారి బడ్జెట్‌లో బంగారంపై ఉన్న పన్నును 7.5 శాతం నుంచి 4-5 శాతానికి కేంద్రం తగ్గించొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. పన్నులు అధికంగా ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఆశించిన మేర రాబడి రాకపోవడంతో పన్ను భారం తగ్గించే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ దిగుమతి సుంకం తగ్గించినా ఆ మేర జీఎస్టీని పెంచుతారని మరికొందరు చెబుతున్నారు. మరోవైపు బంగారం దిగుమతులు పెరిగిన నేపథ్యంలో దాన్ని అదుపు చేసేందుకు ఎలాంటి ఊరటా కల్పించకపోవచ్చని పలువురి విశ్లేషకుల మాట. మరి బంగారం విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయో తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని