Budget 2023: మరో 400 వందే భారత్‌ రైళ్లు.. రైల్వేకు ఈసారి భారీ బూస్ట్‌?

Railway Budget 2023: మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్న మోదీ సర్కారు.. ఈసారి బడ్జెట్‌లో రైల్వేకు పెద్దఎత్తున కేటాయింపులు జరిపే అవకాశం ఉంది. మరిన్ని వందే భారత్‌ రైళ్ల గురించి ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.

Updated : 23 Jan 2023 14:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు రైల్వే బడ్జెట్‌ (Railway budget) అనగానే.. కొత్త రైళ్లు ఏం ప్రకటిస్తారు? కొత్త లైన్లేంటి? రైళ్లను పొడిగిస్తారా? రేట్లను పెంచుతారా?.. ఇలా రకరకాల అంచనాలు ఉండేవి. ఎప్పుడైతే వేరుగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సంప్రదాయానికి మోదీ ప్రభుత్వం స్వస్తి పలికిందో ఈ వ్యవహారం చప్పగా మారింది. రైల్వేకు బడ్జెట్‌ కేటాయింపుల లెక్కలు మాత్రమే ఆర్థిక మంత్రి బడ్జెట్‌ (Budget-2023) ప్రసంగంలో వినిపిస్తున్నాయి. దీంతో ప్రజల్లో రైల్వే బడ్జెట్‌పై ఆసక్తి సన్నగిల్లిందనే చెప్పాలి. కానీ, గతేడాది మాత్రం అనూహ్యంగా 400 వందే భారత్‌ రైళ్లను (Vande bharat Trains) రాబోయే మూడేళ్లలో తీసుకొస్తామన్న ఆర్థిక మంత్రి ప్రకటన రైల్వే బడ్జెట్‌పై మరోసారి ఆసక్తిని పెంచింది. మరోవైపు బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌ పనులు సైతం వడివడిగా కొనసాగుతున్నాయి. దీంతో ఈసారి రైల్వే శాఖకు ఏ స్థాయిలో కేటాయింపులు జరుపుతారన్నది ఆసక్తిగా మారింది.

వందే ‘భారతం’

మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్న మోదీ సర్కారు.. 2019లో తొలి వందే భారత్‌ రైలును ప్రారంభించింది. కొవిడ్‌ కారణంగా మధ్యలో బ్రేకులు పడినప్పటికీ.. ఇప్పడిప్పుడే ఒక్కో రైలు అందుబాటులోకి వస్తోంది. గతేడాది బడ్జెట్‌లో 400 వందే భారత్‌ రైళ్ల గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక ప్రకటన చేశారు. రాబోయే మూడేళ్లలో వీటిని తీసుకురానున్నట్లు చెప్పారు. అయితే, ఈసారి బడ్జెట్‌లో మరో 300-400 రైళ్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం వందేభారత్‌ రైళ్లు కేవలం సీటింగ్‌తోనే నడుస్తున్నాయి. దూర ప్రయాణాలకు అనువుగా స్లీపర్‌ క్లాస్‌ వెర్షన్‌ను తీసుకొచ్చే అంశంపై ఈసారి ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశీయంగా తయారుచేస్తున్న ఈ రైళ్లను ఇతర దేశాలకూ ఎగుమతి చేయాలని భారత్‌ భావిస్తోంది.

‘బుల్లెట్‌’కు పెరగనున్న కేటాయింపులు

జపాన్‌ సాయంతో ముంబయి- అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌ను భారత్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2024 చివరి నాటికి అందుబాటులోకి రావాలి. భూసేకరణ, కొవిడ్‌ వంటి సమస్యలు ఈ ప్రాజెక్ట్‌కు విఘాతంగా మారాయి. దీంతో 2026 నాటికైనా ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 110 కిలోమీటర్ల ట్రాక్‌ నిర్మాణం పూర్తయ్యింది. అనుకున్న సమయానికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలంటే.. భారీ కేటాయింపులు జరగాలి. దీనిపై ఈ సారి ప్రకటన ఉండే అవకాశం ఉంది.

₹1.8 లక్షల కోట్లు?

స్వల్పకాలిక లక్ష్యాల కోసం కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పనిచేస్తున్నామని మోదీ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఇందులో భాగంగా రాబోయే 25 ఏళ్లకు గానూ లక్ష కిలోమీటర్ల మేర కొత్త లైన్లు వేసేందుకు బడ్జెట్‌లో ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వేగవంతమైన రైళ్లను నడపాలంటే ప్రస్తుతం ఉన్న ట్రాకుల సామర్థ్యం పెంచడంతో పాటు నెట్‌వర్క్‌ను విస్తరించడం తప్పనిసరి. దీంతోపాటు ఇప్పటికీ పూర్తికాని విద్యుదీకరణ పనులు పూర్తి చేయడం ప్రభుత్వం ముందున్న లక్ష్యం. 2022-23 బడ్జెట్‌లో రూ.1.4 లక్షల కోట్ల కేటాయింపులు జరిపారు. ఈసారి బడ్జెట్‌ను 30 శాతం మేర పెంచి రూ.1.8 లక్షల కోట్లకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరిన్ని బడ్జెట్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని