Budget 2023: మరిన్ని రంగాలకు పీఎల్‌ఐ.. బడ్జెట్‌లో ‘తయారీ’కి దన్ను
Budget 2023: బడ్జెట్ 2023లో తయారీ రంగానికి మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించాల్సి ఉంది. అందులో భాగంగా పీఎల్‌ఐని ఇతర రంగాలకూ విస్తరించాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీయే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2025 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను అందుకోవడం అందులో ఒకటి. ఈ గమ్యాన్ని చేరుకోవడానికి ఉన్న అనేక మార్గాలను అప్పట్లో ప్రభుత్వం శోధించింది. తయారీకి పెద్దపీట వేయాలని నిర్ణయించింది. ‘ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల పథకం (PLI)’ ద్వారా తయారీ రంగానికి ఊతమిచ్చింది. తాజా బడ్జెట్ (Budget 2023)లో పీఎల్‌ఐని మరిన్ని రంగాలకూ విస్తరించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.
తయారీతోనే ముందుకు..
ఇప్పటి వరకు భారత వృద్ధి కేవలం సేవలరంగంపైనే ఆధారపడినట్లు సర్కార్ గుర్తించింది. తయారీ రంగానికి (Manufacturing Sector) సముచిత ప్రాధాన్యం కల్పించి దేశ వృద్ధి బాటలో భాగం చేయాలని తలచింది. ఈ నేపథ్యంలో జీడీపీ (GDP)లో తయారీ రంగ వాటాను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని గుర్తించింది. ఈ క్రమంలో ‘మేకిన్ ఇండియా’ పేరిట 2014లో బృహత్తర ప్రణాళికను ఆవిష్కరించింది. మొత్తం 25 రంగాలకు దీన్ని విస్తరించాలని నిర్ణయించింది.
పీఎల్‌ఐతో బూస్ట్..
మేకిన్ ఇండియా కింద అనేక పథకాలు తీసుకొచ్చినప్పటికీ.. ‘ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల (PLI)’ పథకానికి వచ్చిన స్పందన మరేదానికీ రాలేదు. పీఎల్‌ఐను మూడు తయారీ రంగాలకు వర్తింపజేస్తూ మార్చి 2020లో ప్రవేశపెట్టారు. సత్ఫలితాలివ్వడంతో మొత్తం 15 రంగాలకు విస్తరించారు. ఇప్పటి వరకు రూ. 1.93 లక్షల కోట్లు విలువ చేసే ప్రోత్సాహకాలను ప్రకటించినట్లు అంచనా. దీంతో వచ్చే ఐదేళ్లలో భారత్ తయారీ కేంద్రంగా అవతరించేందుకు అడుగులు పడుతున్నాయని నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
పీఎల్‌ఐకి కలిసొచ్చిన వాతావరణం..
ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా అనేక అనిశ్చితుల నెలకొన్న తరుణంలో ప్రభుత్వం ఈ పథకాన్ని తెరమీదకు తీసుకురావడం భారత్‌కు కలిసొచ్చింది. మరోవైపు వస్తు-సేవల కోసం పూర్తిగా ఇతర దేశాలపై ఆధారపడడం ఎంత ప్రమాదమో కరోనా సంక్షోభం కళ్లకు కట్టింది. ఈ తరుణంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలూ పీఎల్‌ఐ విజయవంతమవడానికి దోహదం చేశాయి. ఇప్పటి వరకు పీఎల్‌ఐ ఆధారంగా వచ్చిన పెట్టుబడుల్లో 67 శాతం కొత్తతరం రంగాలే కావడం గమనార్హం.
చైనా, తైవాన్, వియత్నాంతో పోలిస్తే భారత్ తయారీలో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఆసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో తయారీ ఖర్చులు అధికంగా ఉండడం కూడా సవాల్‌గా నిలుస్తోంది. ఇప్పటి వరకు పీఎల్‌ఐని వర్తింపజేసిన 15 రంగాల్లో 12 విద్యుత్‌పై భారీగా ఆధారపడేవే. 10 రంగాల్లో లాజిస్టిక్స్ ఆధారిత ఖర్చులది ప్రధాన వాటా. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్‌లో ఆయా ఖర్చులను తగ్గించుకునే దిశగా రాయితీలు ఉండాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.
బడ్జెట్‌లో ఇవీ అవసరం..
పీఎల్‌ఐని మరిన్ని రంగాలకు విస్తరించడంతో పాటు ఈ పథకానికి సవాళ్లుగా నిలుస్తున్న అంశాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. తాజా బడ్జెట్ (Budget 2023)లో ఆ దిశగా చర్యలు ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆటబొమ్మలు, సైకిళ్లు, తోలు, పాదరక్షల రంగంలో దిగుమతులను తగ్గించడానికి ఆయా రంగాలకు పీఎల్‌ఐని విస్తరించాలని సూచిస్తున్నారు. పైగా దేశంలో ఇవి భారీ ఎత్తున ఉపాధి కల్పనకు దోహదం చేస్తాయని చెబుతున్నారు.
ఆటబొమ్మలు, తోలు పరిశ్రమకు పీఎల్‌ఐను విస్తరించడంపై ఇప్పటికే జరిగిన చర్చలు తుది దశలో ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ (Budget 2023)లో దీనిపై కచ్చితంగా ప్రకటన ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబరు 2022 నాటికి లార్జ్-స్కేల్ ఎలక్ట్రానిక్స్ రంగంలో పీఎల్‌ఐ కింద రూ. 4,784 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఫలితంగా రూ. 2,03,952 కోట్లు విలువ చేసే ఉత్పత్తి జరిగినట్లు వెల్లడించాయి. దీంట్లో రూ. 80,769 కోట్లు ఎగుమతులేనని తెలిపాయి. ఫాక్స్‌కాన్, శాంసంగ్, పెగాట్రాన్, రైసింగ్ స్టార్, విస్ట్రోన్, లావా, మైక్రోమాక్స్, ఆప్టిమస్ వంటి బడా కంపెనీలు భారత్‌లో పీఎల్‌ఐ కింద పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. ఈ పెట్టుబడుల యాత్ర ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే రాబోయే బడ్జెట్‌లో పీఎల్‌ఐకి పెద్దపీట వేయాల్సిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Amaravati: ‘వైకాపాతో జరుగుతున్న యుద్ధంలో అంతిమ విజయం అమరావతిదే’
-
Sports News
IND vs PAK: విరాట్ సమాధానంతో ఆశ్చర్యపోయా.. నేను మాత్రం అలా ముగించా: సర్ఫరాజ్
-
Movies News
balagam: అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన ‘బలగం’
-
General News
TSPSC: పేపర్ లీకేజీ కేసు.. నిందితుల పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్నపత్రాలు
-
India News
Kapil Sibal: మన పోరాటం మనదే.. విదేశాల ఆమోదం అవసరం లేదు..!
-
Politics News
Chandrababu: అంతిమంగా గెలిచేది.. నిలిచేది అమరావతే: చంద్రబాబు