ATF GST: ఏటీఎఫ్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం?

విమానాల్లో ఇంధనంగా వాడే ‘ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యుయల్‌ (ATF)’ను వస్తు సేవల పన్ను (GST) పరిధిలోకి తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం....

Published : 21 Feb 2022 20:25 IST

దిల్లీ: విమానాల్లో ఇంధనంగా వాడే ‘ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యుయల్‌ (ATF)’ను వస్తు సేవల పన్ను (GST) పరిధిలోకి తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఓ ఫార్ములాను కూడా ప్రతిపాదించనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై అదనంగా వ్యాట్‌ (VAT), లేదా ఎక్సైజ్ రేటును విధించే వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్రాన్ని బట్టి ఏటీఎఫ్‌, వ్యాట్‌ మారే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ఏటీఎఫ్‌పై జీఎస్టీకి ఓ నిర్దిష్ట ఫార్ములాను పాటిస్తున్నాయని.. అదనంగా వ్యాట్‌/ఎక్సైజ్‌ను విధిస్తున్నాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. తదుపరి జీఎస్టీ మండలి (GST Council) సమావేశంలో ఈ ప్రతిపాదనలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ముందు ఉంచనున్నట్లు పేర్కొన్నారు. మండలిలో ఆమోదం లభిస్తేనే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా ఏటీఎఫ్‌ ధరలు రికార్డు గరిష్ఠానికి చేరాయి. అంతర్జాతీయ ముడి చమురు (Crude Oil) ధరలు పెరుగుతుండడంతో గత కొన్ని నెలలుగా ఏటీఎఫ్‌ ధరల్ని పెంచుతూ పోతున్నారు. ఫిబ్రవరి 16న ధరల్ని 5.2 శాతం మేర పెంచారు. దీంతో ఒక్కో కిలోలోటర్‌ ధర రూ.4,481.63 పెరిగి రూ.90,519.79కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ ముడి చమురు ధర 147 డాలర్లు పలికిన ఆగస్టు 2008లో కూడా ఏటీఎఫ్‌ ధరలు ఈ స్థాయికి చేరలేదు. గత రెండు నెలల్లో ధరలు నాలుగు సార్లు పెరిగాయి.

ధరలు ఇంకా పెరిగితే.. ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న విమానయాన రంగం మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. కొవిడ్‌ సంక్షోభం నుంచి కోలుకొని ఇంకా పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించని కంపెనీలకు ఇది గుదిబండగా మారే ప్రమాదం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని