CoronaVaccineపై జీఎస్‌టీ తొలగింపు?

కరోనా వ్యాక్సిన్‌ ధరలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది.

Updated : 29 Apr 2021 13:58 IST

దిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ ధరలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రజలపై భారం తగ్గించేలా టీకాలపై కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) తొలగించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల టీకా ధరలు తగ్గితే ఎక్కువ మంది ప్రయివేటుగా వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ముందుకొస్తారని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

టీకాల కొనుగోలులో రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛ కల్పిస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రాలు, ప్రయివేటు కేంద్రాలు నేరుగా ఉత్పత్తిదారుల నుంచి వ్యాక్సిన్లు సేకరించుకోవచ్చని తెలిపింది. తయారీదారులు తమ ఉత్పత్తిలో 50శాతం రాష్ట్రాలు, బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల సీరమ్‌, భారత్‌ బయోటెక్‌ సంస్థలు తమ టీకాల ధరలను అధికారికంగా ప్రకటించాయి. కొవిషీల్డ్‌ టీకాను రాష్ట్ర ప్రభుత్వానికి డోసుకు రూ. 400, ప్రయివేటు ఆసుపత్రులకు రూ. 600 చొప్పున విక్రయిస్తామని సీరమ్‌ సంస్థ ప్రకటించింది. అటు కొవాగ్జిన్‌ ధర రాష్ట్రాలకు రూ. 600, ప్రైయివేటులో రూ. 1200గా ఉంటుందని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. అయితే ఈ ధరలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో సీరం సంస్థ తమ ధరను తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 300(డోసుకు) చొప్పున విక్రయిస్తామని తాజాగా తెలిపింది.
 
టీకాల కోసం 1.33కోట్ల మంది రిజిస్ట్రేషన్‌

కరోనా కట్టడిలో భాగంగా మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన వారందరూ టీకా వేసుకునేందుకు అర్హులని కేంద్రం ఇటీవల ప్రకటించింది. అయితే టీకా తీసుకోవాలనుకునేవారు ముందస్తుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించింది. బుధవారం సాయంత్రం నుంచి ఈ నమోదు ప్రక్రియ ప్రారంభం కాగా.. తొలి రోజు 1.33 కోట్ల మంది టీకా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 80 లక్షల మంది కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకోగా.. మిగతా వారు ఆరోగ్య సేతు, ఉమాంగ్‌ యాప్‌లలో తమ పేరు నమోదు చేసుకున్నట్లు కేంద్రం తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని