Ayushman Bharat: రూ.10 లక్షలకు ఆయుష్మాన్‌ భారత్‌.. మరింత మందికి పథకం విస్తరణ?

Ayushman Bharat: రాబోయే బడ్జెట్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ పథకం కింద లభించే హామీ మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Published : 07 Jul 2024 16:40 IST

Ayushman Bharat | దిల్లీ: ప్రతిష్ఠాత్మక పథకం ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య బీమా (AB PMJAY) లబ్ధిదారుల సంఖ్యను రెండింతలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే మూడేళ్లలో ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. తొలుత 70 ఏళ్లు పైబడిన వారిని ఈ పథకంలో భాగం చేయడం ద్వారా దీన్ని ప్రారంభించనుంది. అలాగే బీమా హామీ మొత్తాన్ని సైతం పెంచే ఆలోచనలో ఉన్నట్లు జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ అధికారులు వెల్లడించారు.

ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపితే ఖజానాపై ఏటా మరో రూ.12,076 కోట్ల భారం పడనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయంపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా సమాలోచనలు జరుపుతోందని తెలిపారు. ఈ ప్రణాళికలు కార్యరూపం దాలిస్తే దేశంలో మూడింట రెండొంతుల మంది ఆరోగ్య బీమా పరిధిలోకి వస్తారని వివరించారు. ప్రస్తుతం ఆయుష్మాన్‌ భారత్‌ కింద రూ.5 లక్షల హామీ మొత్తం లభిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని రూ.10 లక్షలకు పెంచే విషయాన్ని కూడా ప్రధానంగా చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ ప్రతిపాదనలన్నీ లేదా వీటిలో కొన్నింటిని రాబోయే కేంద్ర బడ్జెట్‌లో (Union Budget) ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో కేంద్రం ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (AB PMJAY)ను 12 కోట్ల కుటుంబాలకు విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా కేటాయింపులను రూ.7,200 కోట్లకు పెంచింది. మరో రూ.646 కోట్లు ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌కు కేటాయించింది.

గృహ పథకానికి రూ.55,000 కోట్ల సబ్సిడీ!

ఆయుష్మాన్‌ భారత్‌ యోజనను (AB PMJAY) 70 ఏళ్లు పైబడిన వారికి సైతం విస్తరిస్తున్నట్లు జూన్‌ 27న జరిగిన పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించిన విషయం తెలిసిందే. తద్వారా ఈ పథకంలో మరో 4-5 కోట్ల మంది చేరతారని అంచనా. పీఎంజేఏవై కింద రూ.5 లక్షల పరిమితిని 2018లో విధించారు. ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చులు పెరిగిన నేపథ్యంలో దాన్ని రెండింతలు చేయాలనే డిమాండ్‌ గతకొంత కాలంగా వినిపిస్తోంది. 2021లో నీతి ఆయోగ్‌ ఓ నివేదికలో దాదాపు 30 శాతం మంది మధ్యతరగతి ప్రజలు ఆరోగ్య బీమాకు దూరంగా ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయుష్మాన్‌ భారత్‌ను పెద్ద ఎత్తున విస్తరించాల్సిన అవసరం ఉందని సూచించింది.

పీఎంజేఏవై సహా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాల ద్వారా దేశంలో అట్టడుగున ఉన్న దాదాపు 50 శాతం మందికి అత్యవసర వైద్య ఖర్చులు అందుతున్నాయని అంచనా. మరో 20 శాతం మంది సామాజిక, స్వచ్ఛంద ప్రైవేటు ఆరోగ్య బీమా కింద నమోదు చేసుకున్నారు. మిగిలిన 30 శాతం మంది మాత్రం ఎలాంటి ప్రయోజనాన్ని పొందడం లేదు. వారిని కూడా బీమా పరిధిలోకి తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ వర్గం కోసం తక్కువ వ్యయంతో మెరుగైన ఆరోగ్య బీమా ప్రొడక్ట్‌లను రూపొందిస్తున్నట్టు పేర్కొన్నాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని