Income Tax: కొత్త పన్ను విధానంలో కొత్త స్లాబ్‌లు.. బడ్జెట్‌లో ప్రకటన?

Income Tax: ఆదాయపు పన్నుకు సంబంధించి కొత్త పన్ను విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. కొత్త స్లాబ్‌లు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. బడ్జెట్‌లో ఆ మేరకు ప్రకటన ఉండే అవకాశం ఉంది.

Updated : 21 Jan 2023 14:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యక్తిగత ఆదాయపు పన్ను (Income Tax) చెల్లింపుదారులకు సంబంధించి బడ్జెట్‌లో (Budget-2023)కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కొత్త పన్ను వ్యవస్థలో (New income tax structure) కీలక మార్పునకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లను తగ్గించి కొత్త పన్ను స్లాబ్‌లను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయని రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది. దీనిపై ప్రధాని కార్యాలయం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది.

ప్రస్తుతం ఉన్న పాత పన్ను విధానానికి అదనంగా 2021లో కొత్త పన్ను వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పాత పన్ను విధానంలో కేవలం మూడు స్లాబ్‌లే ఉండగా.. కొత్త పన్ను విధానంలో ఆరు స్లాబ్‌లను తీసుకొచ్చారు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయంపై 5 శాతం; రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు 10 శాతం; రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 15 శాతం; రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు 20 శాతం, రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 25 శాతం; రూ.15 లక్షలు ఆపైన ఆదాయం కలిగిన వారికి 30 శాతం పన్ను వర్తిస్తుంది. ఏ పన్ను విధానాన్ని ఎంచుకోవాలనే దానిపై పన్ను చెల్లింపుదారులకు స్వేచ్ఛ ఉంది. అయితే, కొత్త విధానంలో పన్ను మినహాయింపులను చూపించేందుకు అవకాశం లేదు.

అయితే, ఈసారి బడ్జెట్‌లో మధ్యతరగతికి పెద్దపీట వేయాలని భావిస్తున్న మోదీ సర్కారు ముఖ్యంగా ఆదాయపు పన్ను విషయంలో ఊరటనిచ్చే అంశాన్ని పరిశీలిస్తోందని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు ఈ మధ్యే నిర్మలా సీతారామన్‌ మధ్య తరగతి అంశాన్ని ప్రస్తావించడం దీనికి బలం చేకూరింది. దీంతో కొత్త పన్ను విధానంలో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.15 లక్షలు, ఆపై ఉన్న మొత్తానికి 30 శాతం పన్ను వర్తిస్తోంది. ఈ మొత్తాన్నీ పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరిన్ని బడ్జెట్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని